కార్పొరేట్‌ ట్యాక్స్‌ కంటే ఇన్‌కం ట్యాక్సే ఎక్కువ!

corporate tax collections below personal tax: దేశంలో తొలిసారిగా కార్పొరేట్‌ ట్యాక్సును మించి ఇన్‌కం ట్యాక్స్‌ వసూళ్లు జరిగాయి.

Published : 02 Jun 2021 20:37 IST

దిల్లీ: భారత ప్రభుత్వానికి గత ఆర్థిక సంవత్సరంలో (2020-21) వచ్చిన పన్ను ఆదాయంలో కార్పొరేట్‌ ట్యాక్స్‌ కంటే ఇన్‌కంట్యాక్స్‌ ద్వారానే ఎక్కువ ఆదాయం సమకూరింది. కార్పొరేట్‌ పన్నుల ద్వారా వచ్చిన మొత్తం కంటే ఇన్‌కంట్యాక్స్ ద్వారా ఎక్కువ ఆదాయం రావడం కొన్ని ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఈ విషయం వెల్లడైంది.

ఇన్‌కంట్యాక్స్‌ అంటే వ్యక్తుల ఆదాయంపై వేస్తుంటారు. అదే కంపెనీలపై లాభాలపై వేసే పన్నును కార్పొరేట్‌ ట్యాక్స్‌గా పరిగణిస్తారు. ఈ విధంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్‌ ట్యాక్స్‌ రూపంలో ₹4.57 లక్షల కోట్లు ఆదాయం వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ఇన్‌కం ట్యాక్స్‌ రూపంలో ₹4.69 లక్షల కోట్లు రావడం గమనార్హం. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే కార్పొరేట్‌ ట్యాక్స్‌ వసూళ్లు 18 శాతం క్షీణించగా.. ఇన్‌కంట్యాక్స్‌ వసూళ్లు 2.3 శాతం క్షీణించాయి.

రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం 2019లో 10 శాతం మేర కార్పొరేట్‌ ట్యాక్స్‌ను (25 శాతానికి) తగ్గించడంతో ఆ మేర కార్పొరేట్‌ పన్ను వసూళ్లు తగ్గాయి. దీనికితోడు ఆర్థిక వ్యవస్థ మందగనం, కొవిడ్‌ సంక్షోభం కారణంగా కార్పొరేట్‌ ట్యాక్స్‌ వసూళ్లు తగ్గడానికి కారణమయ్యాయి. 2018-19లో 6.6 లక్షల కోట్లుగా ఉన్న కార్పొరేట్‌ ట్యాక్స్‌ వసూళ్లు 2019-20లో 16 శాతం, 2020-21లో 18 శాతం చొప్పున మొత్తం 31 శాతం క్షీణించాయి. అదే సమయంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారుల రిటర్నుల్లో పెద్దగా మార్పు లేకపోవడంతో కార్పొరేట్‌ పన్ను వసూళ్లను వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు దాటేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని