New Jobs: 2026 నాటికి ఈ 3 రంగాల్లో కొత్తగా 1.2 కోట్ల ఉద్యోగాలు!

2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ఇంజినీరింగ్‌, టెలికాం, హెల్త్‌కేర్‌  రంగాల్లో 1.2 కోట్ల ఉద్యోగాలు రానున్నాయని ఓ ప్రముఖ నివేదిక పేర్కొంది....

Published : 27 Mar 2022 14:54 IST

దిల్లీ: 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ఇంజినీరింగ్‌, టెలికాం, హెల్త్‌కేర్‌ రంగాల్లో 1.2 కోట్ల ఉద్యోగాలు రానున్నాయని ఓ ప్రముఖ నివేదిక పేర్కొంది. కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణతో పాటు సాంకేతికత, డిజిటలైజేషన్‌ వేగం పుంజుకోవడం వంటి కారణాలు అందుకు దోహదం చేయనున్నాయని టీమ్‌లీజ్‌ డిజిటల్‌ నివేదిక తెలిపింది.

ఇంజినీరింగ్‌, టెలికాం, హెల్త్‌కేర్‌ రంగాల్లో దాదాపు 750 యాజమాన్యాలను సర్వే, ఇంటర్వ్యూ చేసిన టీమ్‌లీజ్‌ ‘ప్రొఫెషనల్‌ స్టాఫింగ్‌-డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ట్రెండ్స్‌ రిపోర్ట్‌’ పేరిట నివేదిక విడుదల చేసింది. ఈ మూడు రంగాలు సరికొత్త రూపు సంతరించుకోనున్నాయని నివేదిక తెలిపింది. కేంద్రీకృత నియంత్రణా వ్యవస్థల నుంచి స్మార్ట్‌ ఉత్పత్తులు, ప్రక్రియల దిశగా మార్పు ఉండబోతోందని పేర్కొంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం (PLI), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) మానవ వనరులకున్న డిమాండ్‌ను మరింత పెంచాయని వెల్లడించింది. ముఖ్యంగా ఆయా రంగాలకు సంబంధించి ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి భారీ డిమాండ్‌ ఉందని తెలిపింది. 

ఈ మూడు రంగాల్లో 2026 నాటికి ఉద్యోగ అవకాశాలు 25-27 శాతం పెరగనున్నాయని నివేదిక అంచనా వేసింది. ప్రత్యేక నైపుణ్యంగల దాదాపు 90 లక్షల మంది అవసరం ఏర్పుడుతుందని తెలిపింది. ఈ మూడు రంగాల మార్కెట్‌ పరిమాణం ప్రస్తుతం 1.5 ట్రిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు అంచనా వేసింది. ఈ మూడు రంగాలు కలిసి 4.2 కోట్ల మంది ఉద్యోగులకు ఉపాధి కల్పించనున్నాయని తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో ఉన్న మొత్తం ఉద్యోగులతో పోలిస్తే ఇది 8.7 శాతం ఎక్కువని పేర్కొంది. ఈ క్రమంలో కొత్తగా 1.2 కోట్ల ఉద్యోగాలు పుట్టుకొస్తాయని అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని