EPFO Interest Rate: ఈపీఎఫ్‌ వడ్డీ రేటు.. ఈసారి 8 శాతమేనా..?

EPFO Interest Rate: 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్‌ వడ్డీ రేటును 8 శాతంగా నిర్ణయించాలనే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది.

Published : 09 Feb 2024 12:04 IST

దిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతాల్లో ఉండే సొమ్ముపై ఇచ్చే వడ్డీ రేటు (EPFO Interest Rate)పై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 8 శాతం వడ్డీ ఇవ్వాలనే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం (ఫిబ్రవరి 10న) జరిగే సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (CBT) సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియా కథనం వెల్లడించింది.

రేపటి సీబీటీ సమావేశంలో పింఛన్లు, బడ్జెట్‌ అంచనాలు, ఇతర అంశాలపై ప్రధానంగా చర్చలు జరపనున్నారు. ప్రస్తుతానికి వడ్డీ రేటు అంశం అజెండాలో లేనప్పటికీ.. సీబీటీ ఛైర్మన్‌, కార్మిక శాఖ అనుమతితో దీన్ని చేర్చాలని భావిస్తున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8 శాతంగా ప్రతిపాదించి కేంద్రానికి పంపనున్నట్లు పేర్కొన్నాయి.

అధిక పింఛనుపై రోజుకో నిర్ణయం..

అయితే, అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది తక్కువ కావడం గమనార్హం.  2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.15 శాతం వడ్డీని నిర్ణయించగా.. 2021-22లో 8.10 శాతం వడ్డీ ఇచ్చారు. సీబీటీ ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించిన తర్వాత ఆర్థిక శాఖ దీనిపై తుది నోటిఫికేషన్‌ ఇస్తుంది. అనంతరం 6 కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో ఈ మొత్తం జమ అవుతుంది.

ఈ సారి 8 శాతం రేటు నిర్ణయిస్తే.. ఈపీఎఫ్‌పై వడ్డీరేటు నాలుగున్నర దశాబ్దాల కనిష్ఠానికి పడిపోనుంది. 1977-78 ఆర్థిక సంవత్సరంలో 8 శాతం ఇవ్వగా.. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు క్రమంగా దాన్ని పెంచుతూ పోయారు. ఒక దశలో 11 ఏళ్ల పాటు 12 శాతం వడ్డీని చెల్లించారు. ఆ తర్వాత మళ్లీ తగ్గిస్తూ వస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ స్వల్పంగా పెంచడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని