Published : 25 Jan 2022 16:51 IST

Loan: రుణం మంజూరయ్యిందా?భారం కాకుండా ఏం చేయాలి?

ఏదైనా ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు నిధుల కొర‌త ఏర్ప‌డితే ఆ లోటును భ‌ర్తీ చేసేందుకు రుణం తీసుకుంటాం. ఉదాహ‌ర‌ణ‌కు మీరు రూ. 6 ల‌క్ష‌ల విలువైన కారు కొనుగోలు చేయాల‌నుకున్నారు. మీ వ‌ద్ద రూ. 3 ల‌క్ష‌లు మాత్ర‌మే ఉన్నాయి. మిగిలిన రూ. 3 ల‌క్ష‌లను రుణం తీసుకుని కారు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ మొత్తాన్ని వ‌డ్డీతో క‌లిపి నెల‌వారీగా తిరిగి రుణ‌దాతకు చెల్లించ‌వ‌చ్చు. అయితే, రుణం తిరిగి చెల్లించేందుకు నిబద్ధత, క్ర‌మ‌శిక్ష‌ణ ఉండాలి, లేక‌పోతే చెల్లింపులు భారంగా మార‌తాయి. 

రుణం భారంగా మార‌కుండా ఉండేందుకు చెల్లింపుల విష‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్తలు..
1. ఈఎమ్ఐ పేమెంట్స్‌..
రుణ ఈఎమ్ఐలు, క్రెడిట్ కార్డు బ‌కాయిల‌ను స‌కాలంలో చెల్లించ‌డం వ‌ల్ల‌ మంచి క్రెడిట్ స్కోరు పొంద‌వ‌చ్చు. బ‌కాయిల‌ను స‌కాలంలో చెల్లించ‌డంలో విఫ‌ల‌మైతే భారీ ఛార్జీలు, అధిక వ‌డ్డీరేటు చెల్లించాల్సి వ‌స్తుంది. అద‌నంగా భ‌విష్య‌త్తు రుణాల ల‌భ్య‌తతోపాటు క్రెడిట్ స్కోరుపైనా ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంది. అందువ‌ల్ల ఈఎమ్ఐలు గ‌డువు తేదిలోపు తిరిగి చెల్లించే అల‌వాటు చేసుకోవాలి.  

2. అత్య‌వ‌స‌ర నిధిలో ఈఎమ్ఐల‌ను చేర్చండి..
ఆకస్మికంగా ఉద్యోగం కోల్పోవ‌డం, తీవ్ర అనారోగ్యం, వైకల్యం లేదా ఇతర ప్రతికూల ప‌రిస్థితులు వంటి ఊహించలేని ఆర్థిక అవసరాలను ఎదుర్కోవ‌డ‌మే అత్య‌వ‌స‌ర నిధి ఏర్పాటు చేయ‌డం, దాని నిర్వ‌హించ‌డంలో ప్రాథమిక ఉద్దేశ్యం. నెల‌వారిగా చెల్లించాల్సిన అద్దె, బీమా ప్రీమియంలు, ఈఎమ్ఐలు మొద‌లైన వాటితో స‌హా క‌నీసం ఆరు నెల‌ల త‌ప్ప‌నిస‌రి అవ‌స‌రాల‌కు స‌రిపోయే మొత్తం అత్య‌వ‌స‌ర నిధిలో ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేన‌ప్పుడు కూడా త‌గిన స‌మ‌యంలో ఈఎమ్ఐలు చెల్లించి ఆల‌స్య రుసుములు, అధిక వ‌డ్డీ రేట్ల నుంచి త‌ప్పించుకోగ‌లుగుతారు. 

3. లోన్‌ ట్రాన్స్‌ఫ‌ర్‌..
మీ ప్ర‌స్తుత రుణం ఉన్న బ్యాంకు వ‌డ్డీ రేట్లు ఎక్కువ‌గా ఉంటే రుణాన్ని వేరే బ్యాంకికి బ‌దిలీ చేసుకోవ‌చ్చు. రుణ చెల్లింపుల‌కు దీర్ఘ‌కాల స‌మ‌యం ఉంటే వ‌డ్డీ రేట్లు త‌క్కువ‌గా ఉన్న బ్యాంకుకు రుణం బదిలీ చేసుకుని వ‌డ్డీతోపాటు ఈఎమ్ఐ భారాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. రుణం బ‌దిలీ చేసుకునే ముందు ప్రాసెసింగ్ ఛార్జీలు, ఇత‌ర ఛార్జీల‌ను దృష్టిలో ఉంచుకోవాలి. ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫారంల ద్వారా వ‌డ్డీ రేట్ల‌ను పోల్చి చూడొచ్చు. ఇత‌ర బ్యాంకుల‌తో పోలిస్తే మీ బ్యాంకు వ‌డ్డీ రేటు ఎక్కువుంది అనుకుంటే వ‌డ్డీ రేటును త‌గ్గించ‌మ‌ని ముందుగా మీ బ్యాంకుని కోర‌వ‌చ్చు. ఒక‌వేళ బ్యాంకు అంగీక‌రిస్తే అదే బ్యాంకుతో రుణం కొన‌సాగించ‌వ‌చ్చు లేదంటే బ్యాలెన్స్‌ను బ‌దిలీ చేసుకోవ‌చ్చు. 

4. మిగులు నిధులు ఉంటే..
రుణ మొత్తంలో కొంత భాగం ముందుగా చెల్లించ‌డం వ‌ల్ల చాలా వ‌ర‌కు వ‌డ్డీని ఆదా చేయ‌వ‌చ్చు. ప్ర‌త్యేకించి రుణం ప్రారంభ సంవ‌త్స‌రాల్లో ఇలా చేయ‌డం వ‌ల్ల చాలా ప్ర‌యోజ‌నం ఉంటుంది. మీ వ‌ద్ద మిగులు నిధులు ఉన్న‌ప్పుడ‌ల్లా రుణంలో కొంత భాగాన్ని ముందుగా చెల్లించేందుకు ప్ర‌య‌త్నించండి. ఒక‌వేళ మీకు ఒక‌టి కంటే ఎక్కువ రుణాలుంటే అధిక వ‌డ్డీ రేటు ఉన్న రుణాన్ని ముందుగా చెల్లించాలి. 

రుణాల‌ను తొంద‌ర‌గా తీర్చాల‌నే ఆత్రుత‌తో అత్య‌వ‌స‌ర నిధి, కీల‌క ఆర్థిక ల‌క్ష్యల కోసం కేటాయించిన పెట్టుబ‌డుల‌ను, నిధుల‌ను ముంద‌స్తు రుణ చెల్లింపుకు మ‌ళ్లించ‌డం స‌రికాదు. ల‌క్ష్యాల కోసం కేటాయించిన నిధుల‌ను వినియోగిస్తే.. భ‌విష్య‌త్తులో ఆర్థిక అవ‌స‌రాల కోసం ఎక్కువ వ‌డ్డీ రేటుతో కూడిన రుణాల‌ను తీసుకోవాల్సిన ప‌రిస్థితులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. 

5. క్రెడిట్ రిపోర్ట్‌ను విశ్లేషించండి..
మంచి  క్రెడిట్ స్కోరు మంచి క్రెడిట్ ప్ర‌వ‌ర్త‌న‌కు సూచ‌న‌లాంటిది. మీరు గ‌తంలో తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డు సంబంధిత చెల్లింపులు ఇందులో ప్ర‌తిబింబిస్తాయి. క్రెడిట్ రిపోర్ట్‌లో ఉన్న స‌మాచారం ఆధారంగా క్రెడిట్ బ్యూరో సంస్థ‌లు క్రెడిట్ స్కోరును లెక్కిస్తాయి. క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగానే  ప్రీ-అప్రూవుడ్ రుణాలు, రుణ బ‌దిలీలు, క్రెడిట్ కార్డుల‌ వంటివి ఆఫ‌ర్ చేస్తాయి బ్యాంకులు. ఒక‌వేళ మీ క్రెడిట్ రిపోర్ట్‌లో త‌ప్పులు ఉంటే మీ క్రెడిట్ స్కోరుపై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుంది. దీంతో రుణ ఆమోదం క‌ష్ట‌మ‌వుతుంది. అందువ‌ల్ల క్రెడిట్ స్కోరును ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ చేసుకోవాలి. మూడు నెల‌ల‌కు ఒక‌సారి క్రెడిట్ రిపోర్టును స‌మీక్షించాల‌ని నిపుణులు చెబుతారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని