కుటుంబ పత్రం..రాసి పెట్టుకున్నారా?

ఎంత జాగ్రత్తగా ఉన్నా.. కరోనా మహమ్మారి ఎటునుంచి వచ్చి మీద పడుతోందో అర్థం కావడం లేదు. రెండో దశలో విజృంభిస్తోన్న ఈ వైరస్‌ కారణంగా ఎన్నో కుటుంబాలు  తమ పెద్ద దిక్కును కోల్పోయాయి. లక్షల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. మరోపక్క.. కుటుంబంలోని కీలకమైన వ్యక్తికి కొవిడ్‌ సోకినప్పుడు.

Published : 14 May 2021 05:17 IST

ఎంత జాగ్రత్తగా ఉన్నా.. కరోనా మహమ్మారి ఎటునుంచి వచ్చి మీద పడుతోందో అర్థం కావడం లేదు. రెండో దశలో విజృంభిస్తోన్న ఈ వైరస్‌ కారణంగా ఎన్నో కుటుంబాలు  తమ పెద్ద దిక్కును కోల్పోయాయి. లక్షల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. మరోపక్క.. కుటుంబంలోని కీలకమైన వ్యక్తికి కొవిడ్‌ సోకినప్పుడు.. ముఖ్యమైన బ్యాంకు ఖాతాల వివరాలు, బీమా పాలసీల పత్రాలు ఎక్కడున్నాయో తెలియక చిక్కుల్లో పడుతున్న కుటుంబ సభ్యులూ ఉన్నారు. అందుకే, ప్రతి పెట్టుబడి.. పాలసీ.. బ్యాంకు ఖాతా.. వీటన్నింటితో ఒక జాబితా సిద్ధం చేసి పెట్టుకోవడం ఎప్పుడూ అవసరం..
కరోనా ఆరోగ్యాన్నే కాదు.. ఆర్థికంగానూ దెబ్బతీస్తోంది. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తే.. ఎన్ని లక్షల రూపాయలు ఖర్చయ్యాయో లెక్కే ఉండటం లేదు. ఏళ్లుగా సంపాదించిన మొత్తాన్ని ఈ మహమ్మారి రోజుల్లోనే ఖాళీ చేస్తోంది. ఇలాంటి పరిస్థితులో ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీలు ఎంతో ప్రధానంగా మారిపోయాయి. దీంతోపాటు ప్రతి ఒక్కరూ అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడమూ ముఖ్యం. బీమా పాలసీలు ఉంటే.. ఆసుపత్రి ఖర్చులను తట్టుకోవడంతోపాటు, జరగరానిది జరిగితే... కుటుంబ సభ్యులకు ఆర్థికంగా అండగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఆర్థికంగా ఎంతో క్రమశిక్షణతో ఉన్నవారూ.. ఒక విషయాన్ని విస్మరిస్తుంటారు. చాలామంది ఒకటికి మించిన బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తుంటారు. స్థిరాస్తులు, షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లు, బాండ్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు.. ఇలా అనేక పెట్టుబడి పథకాల్లో మదుపు చేస్తుంటారు. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలనూ తీసుకుంటారు. తనకూ.. తన కుటుంబానికీ ఆర్థికంగా భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ రాకూడదనే ఏర్పాటే ఇదంతా.. కానీ.. ఈ వివరాలను కుటుంబ సభ్యులకు చెప్పడం అంత అవసరమా అన్నట్లు భావిస్తుంటారు. ఇలాంటి ఆలోచనలను ఇప్పుడు మార్చుకోకతప్పదు.

ఎక్కడెక్కడ..
కష్టపడి సంపాదించిన మొత్తాన్ని.. ఎన్నో చోట్ల మదుపు చేస్తుంటాం.. అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయన్న సంగతి పెట్టిన వారికి తప్ప మూడో కంటికి తెలియకపోవడం ఎప్పుడూ ప్రమాదమే. కాబట్టి, ఈ లాక్‌డౌన్‌లో ఈ విషయాన్ని ఆలోచించండి. బ్యాంకు ఖాతా వివరాలు.. షేర్లు, మ్యూచువల్‌ ఫండ్ల పెట్టుబడులు, స్థిరాస్తి పత్రాలు.. ఇలా పెట్టుబడులన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి.. వాటి ప్రస్తుత విలువ ఎంత తదితర వివరాలన్నీ నమోదు చేయండి.
పాలసీల సంగతి..
తీసుకున్న జీవిత బీమా పాలసీ విలువ ఎంత? ఆన్‌లైన్‌లో తీసుకున్నారా? ఏజెంటు ద్వారా తీసుకున్నారా? ఆ పత్రాలు ఎక్కడున్నాయో ఒకసారి చూసుకోండి. లేకపోతే.. బీమా సంస్థను వెంటనే సంప్రదించండి. అన్ని పాలసీలకూ ప్రీమియం చెల్లింపు జరిగిందా.. బకాయి ఉన్నారా పరిశీలించండి. ముఖ్యంగా ఆ పాలసీలకు నామినీ ఉన్నారా చూడండి. లేకపోతే వెంటనే బీమా సంస్థకు ఆ విషయాన్ని తెలియజేయండి. క్లెయిం చేసుకోవాల్సిన సందర్భం వస్తే.. ఎవరిని, ఎలా సంప్రదించాలి? అవసరమైన పత్రాలు ఎక్కడున్నాయన్నదీ కుటుంబ సభ్యులకు తెలిసి ఉండాలి. ఉద్యోగులు తమ ఈపీఎఫ్‌ వివరాల్లో నామినీ పేరు ఉందా లేదా తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి.
వీలునామా ఉంటే..
చాలామంది తమ తదనంతరం ఆస్తుల పంపకం ఎలా ఉండాలనే విషయంలో వీలునామా రాస్తుంటారు. దీన్ని రాసేందుకు ప్రత్యేక ఏర్పాటు ఏమీ అవసరం లేదు. తెల్ల కాగితంపైనా ఆస్తుల వివరాలు, ఎవరికి చెందాలి అని రాసినా సరిపోతుంది. ఇ-విల్లు సేవలను అందించే సంస్థలూ ఉన్నాయి. లాయర్‌తో రూపొందించి, ఇద్దరు సాక్షి సంతకాలతో బలపర్చవచ్చు. కుటుంబ పెద్ద తదనంతరం తన వారసులకు ఆస్తి సులభంగా బదిలీ అయ్యేందుకు ఇది తోడ్పడుతుంది. వీలునామాను ఎన్నిసార్లయినా మార్చుకునేందుకు వీలుంటుందని గుర్తుంచుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని