కరెన్సీగా బిట్‌కాయిన్‌.. ప్రతిపాదనే లేదు

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

దిల్లీ: దేశంలో బిట్‌కాయిన్‌ను ఒక కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం లోక్‌సభకు స్పష్టం చేశారు. బిట్‌కాయిన్‌ లావాదేవీల డేటాను కేంద్రం సమీకరించడం లేదనీ తెలిపారు.

‘బ్యాంక్‌నోట్‌’ నిర్వచనంలోకి డిజిటల్‌ కరెన్సీ!: అధికారిక డిజిటల్‌ కరెన్సీని ఆవిష్కరించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రయత్నాలు చేస్తోంది. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ(సీబీడీసీ)ని తీసుకురావడం కోసం ఆర్‌బీఐ చట్టం-1934లో సవరణ నిమిత్తం గత నెలలో ఆర్‌బీఐ నుంచి ప్రతిపాదన అందిందని లోక్‌సభకు ఆర్థిక శాఖ రాతపూర్వకంగా తెలిపింది. ఇందు కోసం ‘బ్యాంక్‌ నోట్‌’ నిర్వచనాన్ని విస్తృతం చేసి, డిజిటల్‌ కరెన్సీని సైతం జత చేయాలని భావిస్తోంది. సీబీడీసీని దశల వారీగా అమలు చేసే వ్యూహంపై ప్రస్తుతం ఆర్‌బీఐ పనిచేస్తోందని ఆర్థిక శాఖ  తెలిపింది. ‘డిజిటల్‌ కరెన్సీ వల్ల నగదుపై ఆధారపడడం తగ్గుతుందని, లావాదేవీ వ్యయం దిగి వస్తుందని, సెటిల్‌మెంట్‌ రిస్క్‌ తక్కువగా ఉంటుందని.. చెల్లింపుల వ్యవస్థ మరింత అధిక సామర్థ్యంతో, విశ్వసనీయతతో పనిచేస్తుంద’ని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ ఛౌధ్రి పేర్కొన్నారు.

రూ.46,382 కోట్ల మొండి బకాయిల రద్దు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో బ్యాంకులు రూ.46,382 కోట్ల మేర మొండి బకాయిలను సాంకేతికంగా రద్దు(రైటాఫ్‌) చేసినట్లు లోక్‌సభకు ఆర్థిక శాఖ వెల్లడించింది.

నికర ప్రత్యక్ష పన్ను ఆదాయాల్లో 68% వృద్ధి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచి నవంబరు 23 వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు క్రితం ఏడాది ఇదే సమయంతో పోలిస్తే దాదాపు 68 శాతం వృద్ధి చెంది రూ.6.92 లక్షల కోట్లకు చేరినట్లు మంత్రి పంకజ్‌ ఛౌధ్రి తెలిపారు. 2019-20 ఇదే సమయంతో పోలిస్తే ఇది 27.29 శాతం అధికం.

5 లక్షల కంపెనీలు మాయం.. 7 లక్షల కొత్త సంస్థలు ప్రత్యక్షం: గత ఆరేళ్లలో 5 లక్షల కంపెనీలు వ్యాపార కార్యకలాపాలు నిలిపేశాయని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో 7 లక్షలకు పైగా కంపెనీలు కొత్తగా ఏర్పాటయ్యాయి. 2016 ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటిదాకా 5,00,506 సంస్థలు మూతబడ్డాయి. ఇదే సమయంలో కంపెనీల చట్టం-2013 కింద 7,17,049 కొత్తగా నమోదయ్యాయి. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ, కొవిడ్‌ వంటి పరిణామాల ఫలితంగా ఎన్ని కంపెనీలు మూతబడ్డాయన్న సమాచారం విడిగా లేదని ప్రభుత్వం తెలిపింది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని