చెన్నై కంపెనీలో 46% వాటాకు రూ.31,000 కోట్లు!

చెన్నైకి చెందిన రసాయనాల పంపిణీదారు రామ్‌చరణ్‌ కో చరిత్ర సృష్టించింది. ఈ కంపెనీలో 46 శాతం వాటాను 4.14 బిలియన్‌ డాలర్లు(రూ.31,000 కోట్లకు పైగా) పెట్టి అమెరికాకు చెందిన టీఎఫ్‌సీసీ ఇంటర్నేషనల్‌ అనే ఇంపాక్ట్‌ ఫండ్‌ కొనుగోలు చేసింది.

Published : 02 Dec 2021 02:18 IST

చెల్లించిన అమెరికా కంపెనీ

దేశీయ రసాయనాల రంగంలోనే అతిపెద్ద ఒప్పందం

ముంబయి: చెన్నైకి చెందిన రసాయనాల పంపిణీదారు రామ్‌చరణ్‌ కో చరిత్ర సృష్టించింది. ఈ కంపెనీలో 46 శాతం వాటాను 4.14 బిలియన్‌ డాలర్లు(రూ.31,000 కోట్లకు పైగా) పెట్టి అమెరికాకు చెందిన టీఎఫ్‌సీసీ ఇంటర్నేషనల్‌ అనే ఇంపాక్ట్‌ ఫండ్‌ కొనుగోలు చేసింది. తద్వారా రామ్‌చరణ్‌ కో కంపెనీ విలువను 9 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.67,500 కోట్లు)గా లెక్కగట్టినట్లయింది. ఇది దేశీయ రసాయనాల రంగంలోనే అతిపెద్ద ఒప్పందం కావడంతో పాటు.. దేశంలో ఏ పరిశ్రమలోనైనా ఒక ప్రైవేటు ఈక్విటీ సంస్థ పెట్టిన అతిపెద్ద పెట్టుబడి కూడా ఇదే. న్యూయార్క్‌కు చెందిన టీఎఫ్‌సీసీ ఇంటర్నేషనల్‌ ఈ పెట్టుబడితో భారత్‌లోకి అడుగుపెట్టినట్లయింది. పర్యావరణ సొల్యూషన్లు, పునరుత్పాదక ఇంధనం, అందుబాటు ధర గృహాల విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టాలని ఈ ఫండ్‌  భావిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ దక్షిణాసియాలో 20 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది.

56 ఏళ్ల కంపెనీ: రామ్‌చరణ్‌ కంపెనీ 1965లో రసాయనాల పంపిణీదారుగా ప్రారంభమైంది. 2016 నుంచి ఇది పరిశోధన వైపూ మళ్లింది. అప్పటి నుంచి వ్యర్థాల నుంచి ఉత్పత్తులను అభివృద్ధి చేస్తూ వచ్చింది. ప్రస్తుతం ఈ సంస్థ మూడో తరం పారిశ్రామికవేత్తలైన దివ్యేశ్‌, కౌశిక్‌ పాలిచా చేతుల్లో ఉంది. రసాయనాల ట్రేడింగ్‌, పంపిణీ నుంచి కాంపౌండ్‌, స్పెషాలిటీ రసాయనాల తయారీ, టెస్టింగ్‌, రీసెర్చ్‌లోకి కార్యకలాపాలు విస్తరించినట్లు కంపెనీ వెబ్‌సైట్‌ చెబుతోంది. బ్రిటన్‌, ఉత్తర అమెరికా, జపాన్‌లలోనూ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని