డీలిస్టింగ్‌ నిబంధనల్లో సెబీ సవరణ

ఓపెన్‌ ఆఫర్‌ అనంతరం కంపెనీ షేర్ల డీలిస్టింగ్‌కు (ఎక్స్ఛేంజీల నుంచి ఉపసంహరించేందుకు) సంబంధించిన నిబంధనలను సెబీ సడలించింది. నమోదిత కంపెనీలకు కొనుగోళ్లు, విలీన లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు,

Published : 08 Dec 2021 02:22 IST

దిల్లీ: ఓపెన్‌ ఆఫర్‌ అనంతరం కంపెనీ షేర్ల డీలిస్టింగ్‌కు (ఎక్స్ఛేంజీల నుంచి ఉపసంహరించేందుకు) సంబంధించిన నిబంధనలను సెబీ సడలించింది. నమోదిత కంపెనీలకు కొనుగోళ్లు, విలీన లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు, మదుపర్ల ప్రయోజనాల పరిరక్షించేందుకు ఈ నిర్ణయం దోహదం చేయనుంది. సెబీ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కంపెనీ షేర్ల డీలిస్టింగ్‌ చేయడం వెనక ఉద్దేశాన్ని ఒక ప్రకటన (ఇనీషియల్‌ పబ్లిక్‌ అనౌన్స్‌మెంట్‌) రూపంలో ప్రమోటర్లు లేదా కొనుగోలుదార్లు తెలియజేయాలి. ఫలానా కంపెనీని డీలిస్టింగ్‌ చేయాలని ప్రమోటర్లు భావిస్తే.. డీలిస్టింగ్‌ నిమిత్తం, షేరుకు ఓపెన్‌ ఆఫర్‌ ధర కంటే అధిక ధరను ప్రతిపాదించాలి. ఒకవేళ పరోక్షంగా కొనుగోలు చేసేందుకు ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటిస్తే.. ఆ ఓపెన్‌ ఆఫర్‌ ధర, ప్రతిపాదిత ధరను ప్రకటన రూపంలో తెలియజేసే సమయంలో ప్రమోటర్లు నోటిఫై చేయాలి. ఆఫర్‌ లెటర్‌లో ఆ విషయాన్ని పొందుపరచాలి.

* ప్రస్తుతమున్న విధానం ప్రకారం.. ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించినప్పుడు టేకోవర్‌ నిబంధనలు అనుసరించి కొనుగోలుదారు వాటా 75 శాతం ఎగువకు, ఒక్కోసారి 90 శాతానికీ చేరుతుంటుంది. అయితే సెక్యూరిటీస్‌ కాంట్రాక్టు నిబంధనల మేరకు.. డీలిస్టింగ్‌ కోసం కొనుగోలుదారు ముందుగా తన వాటాను 75 శాతం లోపునకు పరిమితం చేసుకోవాలి. ఇలా చేయకుంటే.. సెబీ నిబంధనల ప్రకారం  డీలిస్టింగ్‌ ప్రయత్నాలను మొదలుపెట్టే వీలు కూడా ఉండదు. డీలిస్టింగ్‌కు, టేకోవర్‌ విషయంలో పరస్పర విభిన్న నిబంధనలు ఉండటంతో వీటిల్లో తాజాగా సెబీ సవరణలు చేసింది.

* డీలిస్టింగ్‌ నిమిత్తం ప్రకటించిన ఓపెన్‌ ఆఫర్‌కు స్పందన నిర్దిష్ట పరిమితైన 90 శాతాన్ని చేరుకుంటే.. వాటాదార్లందరూ ప్రతిపాదిత ధరకు వాళ్ల షేర్లను విక్రయించాల్సి ఉంటుంది. ఒకవేళ 90 శాతాన్ని చేరుకోకుంటే.. వాటాదార్లు విక్రయించే షేర్లకు ఓపెన్‌ ఆఫర్‌ ధర ప్రకారం చెల్లిస్తారు.

* ఒకవేళ ఓపెన్‌ ఆఫర్‌ అనంతరం కంపెనీ షేర్లు డీలిస్టింగ్‌ కాకుండా, ప్రమోటరు వాటా పరిమితి 75 శాతాన్ని మించినప్పుడు.. రివర్స్‌ బుక్‌ బిల్డింగ్‌ మెకానిజమ్‌ ద్వారా మళ్లీ డీలిస్టింగ్‌కు ప్రయత్నించేందుకు ఓపెన్‌ ఆఫర్‌ ముగింపు తేదీ నుంచి 12 నెలల సమయం ప్రమోటర్లకు ఉంటుంది. ఇక్కడ డీలిస్టింగ్‌ విజయవంతం కావాలంటే.. ప్రజల వద్ద మిగిలి ఉన్న వాటాలో 50 శాతాన్ని కొనుగోలు చేయడాన్ని పూర్తి చేయడంతో పాటు డీలిస్టింగ్‌ పరిమితిని అందుకోవాల్సి ఉంటుంది.

* పొడిగించిన ఈ 12 నెలల సమయంలోనూ డీలిస్టింగ్‌ ప్రక్రియ విజయవంతం కాకపోతే.. ఇది జరిగిన సమయం నుంచి మరో 12 నెలల్లోగా కనీస ప్రజల వాటా పరిమితి నిబంధనను కొనుగోలుదారు తప్పక పాటించాల్సి ఉంటుంది.

* ఈ కొత్త నిబంధనలు సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయని సెబీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని