సంక్షిప్త వార్తలు

క్యాసినోలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌, గుర్రపు పందేలపై 28 శాతం జీఎస్‌టీ విధించాలన్న ప్రతిపాదనపై ఈనెల 28-29 తేదీల్లో జరగబోయే జీఎస్‌టీ మండలి సమావేశం చర్చించే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ గేమింగ్‌లో పాల్గొనే ఆటగాడు చెల్లించే ప్రవేశ

Published : 27 Jun 2022 03:24 IST

క్యాసినోలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28% జీఎస్‌టీ!

దిల్లీ: క్యాసినోలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌, గుర్రపు పందేలపై 28 శాతం జీఎస్‌టీ విధించాలన్న ప్రతిపాదనపై ఈనెల 28-29 తేదీల్లో జరగబోయే జీఎస్‌టీ మండలి సమావేశం చర్చించే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ గేమింగ్‌లో పాల్గొనే ఆటగాడు చెల్లించే ప్రవేశ రుసుం సహా పూర్తి విలువపై జీఎస్‌టీ విధించాలని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని మంత్రుల బృందం సిఫారసు చేసింది. గుర్రపు పందేల విషయానికొస్తే.. బుక్‌మేకర్లతో వేసే బెట్‌ల పూర్తి విలువపై జీఎస్‌టీ విధించాలని మంత్రుల బృందం సూచించింది. క్యాసినోలో ఆటగాడు కొనుగోలు చేసే చిప్స్‌/కాయిన్‌ పూర్తి ముఖవిలువపై పన్ను వసూలు చేయాలని కోరింది.


దేశీయ 5జీ గేర్లకు విదేశీ ఆర్డర్లు వస్తాయ్‌
టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణవ్‌

దిల్లీ: దేశీయంగా టీసీఎస్‌-సీడాట్‌ కన్సార్షియం అభివృద్ధి చేస్తున్న 5జీ వ్యవస్థకు అంతర్జాతీయ ఆర్డర్లు దక్కించుకునే సత్తా ఉందని కేంద్ర టెలికాం, ఐటీ మంత్రి ఆశ్వనీ వైష్ణవ్‌ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నమ్మకమైన టెలికాం సొల్యూషన్ల కోసం ప్రజలు చూస్తున్నారని, భారత్‌ ఇచ్చే భరోసా మరే దేశం ఇవ్వలేదని తెలిపారు. దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ గేర్ల ఆధారంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌లో 1.25 లక్షల మొబైల్‌ సైట్లు నెలకొల్పడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల కొరత అనేక రంగాలకు ఇబ్బంది కలిగిస్తోందని గుర్తు చేస్తూ, దేశీయంగా హైటెక్‌ ఎలక్ట్రానిక్స్‌ చిప్స్‌ తయారీ ప్రాజెక్టుకు ఈ ఏడాదిలోనే ఆమోదం లభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.76,000 కోట్ల సెమీకాన్‌ మిషన్‌ కింద సెమీకండక్టర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయని.. ఆయా దరఖాస్తుల మదింపు ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు తెలిపారు. భారత్‌లో ఎలక్ట్రానిక్స్‌ చిప్స్‌ తయారీకి అవసరమైన టెక్నాలజీ అందించేందుకు దరఖాస్తు చేసుకున్న బెల్జియం సంస్థ ఐఎంఈసీతో ఇటీవల మంత్రి వైష్ణవ్‌ సమావేశమయ్యారు. వేదాంతా ఫాక్స్‌కాన్‌ సంయుక్త సంస్థ అయిన ఐజీఎస్‌ఎస్‌ వెంచర్స్‌, ఐఎస్‌ఎంసీలు ఎలక్ట్రానిక్స్‌ చిప్‌ తయారీ ప్లాంట్‌ల ఏర్పాటుకు 13.6 బి.డాలర్ల (దాదాపు రూ.1.06 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టుబడుల ప్రతిపాదనలు ఇచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని