ఎల్‌ఐసీ ఐపీఓ..ఈ వివరాలు తెలుసుకోండి...

ఇప్పుడు ఎక్కడ చూసినా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) ఐపీఓ గురించే చర్చలు.. భారత స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో అతి పెద్ద పబ్లిక్‌ ఇష్యూ ఇది. దాదాపు రూ.21,000 కోట్లను మార్కెట్ల నుంచి సమీకరించనుంది.

Updated : 29 Apr 2022 05:26 IST

 

ఇప్పుడు ఎక్కడ చూసినా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) ఐపీఓ గురించే చర్చలు.. భారత స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో అతి పెద్ద పబ్లిక్‌ ఇష్యూ ఇది. దాదాపు రూ.21,000 కోట్లను మార్కెట్ల నుంచి సమీకరించనుంది. బీమా రంగంలో ప్రపంచంలోనే అయిదో అతి పెద్ద సంస్థగా అవతరించే ఈ సంస్థలో వాటాలను చేజిక్కించుకోవాలని భావిస్తున్న వారు ఐపీఓకి దరఖాస్తు చేసుకునేటప్పుడు గమనించాల్సిన కొన్ని ముఖ్యాంశాలు చూద్దామా..

* ఎల్‌ఐసీ ఐపీఓకి దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా డీమ్యాట్‌ ఖాతా ఉండాలి. మీకు ఇప్పటికే డీమ్యాట్‌ ఖాతా ఉంటే దానిని ఉపయోగించుకోవచ్చు. కొత్తగా మరోటి తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

* కొత్తగా వస్తున్న పలు ఐపీఓలపై ఆసక్తి ఉండి, డీమ్యాట్‌ ఖాతా లేనివారు కొత్తది తీసుకునేందుకు ప్రయత్నించవచ్చు. ఇప్పుడు చాలా కొత్తతరం బ్రోకరేజీ సంస్థలు పూర్తిగా డిజిటల్‌ రూపంలోనే డీమ్యాట్‌ ఖాతాలను అందిస్తున్నాయి. ఇందులో మీకు నచ్చిన సంస్థ నుంచి డీమ్యాట్‌ను తీసుకోవచ్చు. కొన్ని గంటల్లోనే మీకు ఖాతా సిద్ధం అవుతుంది. కొన్ని సంస్థలు పత్రాలను పంపాల్సిందిగా పేర్కొంటాయి. వీటిలో ఖాతా ప్రారంభిస్తే వారం వరకూ పట్టే ఆస్కారం ఉంది.

* డీమ్యాట్‌ ఖాతా కోసం మీ దగ్గర పాన్‌, ఆధార్‌ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఖాతాను తీసుకునేందుకు వీలవుతుంది. ఆధార్‌ ఓటీపీ ద్వారా  కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది.

* ఇప్పటికే ఉన్న డీమ్యాట్‌ ఖాతాను సరి చూసుకోండి. మీ వివరాలు, ఇ-మెయిల్‌, ఫోన్‌ నెంబరు అన్నీ ఉన్నాయా పరిశీలించండి. లేకపోతే వాటన్నింటినీ అప్‌డేట్‌ చేసుకోండి. ఆన్‌లైన్‌ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లాంటివి పనిచేస్తున్నాయా పరిశీలించండి. లేకపోతే కొత్త పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకోండి.


* ఐపీఓ ప్రారంభం: మే 4

* ఐపీఓ ముగింపు: మే 9

* ధరల శ్రేణి : రూ.902-రూ.949

* తగ్గింపు: రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఉద్యోగులు: రూ.45,పాలసీదారులకు రూ.60

* దరఖాస్తు: కనీసం 15 షేర్లకు


పాన్‌ జత చేశారా?

ఎల్‌ఐసీ పాలసీదారులకు రూ.60 తగ్గింపుతో షేర్లు కేటాయించనుంది. దీన్ని పొందాలంటే.. ఈ ఏడాది ఫిబ్రవరి 13 నాటికి ఏదో ఒక ఎల్‌ఐసీ పాలసీ ఉండాలి. బృంద పాలసీలో సభ్యులుగా ఉన్నవారు ఈ కోటా కిందకు రారు. అదే విధంగా పాలసీకి పాన్‌ను ఫిబ్రవరి 28లోగా అనుసంధానం చేసి ఉండాలి (ఎల్‌ఐసీ ఇప్పటివరకూ ప్రకటించిన మేరకు).

* పాలసీ ఉన్నప్పటికీ.. గడువు తేదీ లోపు పాన్‌ను అనుసంధానం చేయని వారు.. రిటైల్‌ కోటా కింద దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పుడు రూ.45 తగ్గింపు వర్తిస్తుంది.

గుర్తుంచుకోండి...: మీకు ఒకటికి మించి డీమ్యాట్‌ ఖాతాలున్నా.. ఒకే ఖాతా ద్వారా ఐపీఓకి దరఖాస్తు చేయాలి. వేర్వేరు ఖాతాల నుంచి దరఖాస్తు చేసినప్పుడు ‘మల్టిపుల్‌ అప్లికేషన్‌’ వచ్చినట్లుగా భావించి, షేర్ల కేటాయింపు నిలిపివేయొచ్చు. కొన్నిసార్లు మీరు పెట్టిన డబ్బులూ వెంటనే వెనక్కి రాకపోవచ్చు. కాబట్టి, ఒకే ఖాతానుంచే ఒక లాట్‌ (15 షేర్లు) నుంచి గరిష్ఠంగా 14 లాట్‌ల (210 షేర్లు) కోసం దరఖాస్తు చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని