ఆర్థిక లక్ష్యాల‌ను చేరుకునేందుకు స‌రైన ప్ర‌ణాళిక అవ‌స‌రం

మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘకాలం మదుపు చేయడం వలన మంచి రాబడి పొందొచ్చు

Published : 16 Dec 2020 19:41 IST

సాధారణంగా 22-25 ఏళ్ల వయసు నుంచి సంపాదన మొదలు పెడతారు. యువతగా ఉన్నప్పుడు ఎక్కువ బాధ్యతలు ఉండవు, భవిష్యత్ అవసరాల గురించి అవగాహన ఉండకపోవడం, భవిష్యత్ లో ఇంకా  సంపాదించగలమనే ధీమాతో, అధిక శాతం ఖర్చు పెట్టడం జరుగుతుంది . కొద్ది మొత్తంలోనైనా ఏదో ఒక విధంగా పొదుపు చేయడం జరుగుతుంది. అయితే పొదుపు లేదా మదుపు చేసే ముందు ఈ కింది విషయాలను పరిశీలించినట్లయితే , కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయికి విలువ ఇచ్చిన వాళ్లవుతారు. దీనికి కొన్ని ఆర్ధిక లక్ష్యాలను నిర్దేశించుకుంటే , వాటిని సునాయాసంగా చేరుకునే అవకాశం ఉంటుంది.

నగదు లభ్యత, రాబడి, పెట్టుబడికి భద్రత, కాల పరిమితి, లాక్-ఇన్ పీరియడ్, పన్ను మినహాయింపులు,.

నగదు లభ్యత :

మనం ఎంచుకున్న ఆర్ధిక లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే, ఆ సమయానికి తగిన మొత్తం మన దగ్గర నగదు రూపంలో ఉండేటట్లు చూసుకోవాలి. ఉదాహరణకు: 2-3 ఏళ్లలో ఇంట్లో వివాహంగానీ, ఇంటి కొనుగోలుకు కావలసిన డౌన్ పేమెంట్ కోసం గానీ, వంటి వాటి కోసం అవసరమైన డబ్బును షేర్ మార్కెట్, లేదా స్థలాల వంటి వాటిలో పెట్టుబడి చేయకూడదు. ఎందుకంటే ఆ సమయానికి షేర్ మార్కెట్ పతనం లో ఉండొచ్చు, అలాగే స్థలం అమ్ముదామంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ స్తబ్దత వల్ల సరైన ధర రాకపోవచ్చు .తప్పనిసరి పరిస్థితులలో తక్కువ ధరకు అమ్మవలసి వస్తే నష్ట పోయే ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి తక్కువ సమయాల కోసం బ్యాంక్ ఫిక్సెడ్ డిపాజిట్ మంచిది .

రాబడి :

మనం చేసే ప్రతి పెట్టుబడిపై రాబడిని ఆశిస్తాము. దీనివలన పెట్టుబడి విలువ పెరుగుతుంది. అదికూడా ద్రవ్యోల్బణాన్ని మించి ఉండాలి. లేకపోతే ద్రవ్యోల్బణం మన పెట్టుబడి విలువను హరించి వేస్తుంది. ఈ రాబడి కూడా ఎక్కడ, ఎంత మొత్తంలో, ఎంత కాలానికి చేస్తున్నామనే అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది . కొన్ని పెట్టుబడులపై వార్షిక రాబడి ఇంతని ముందే తెలుస్తుంది. ఉదా : బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ లు. స్టాక్ మార్కెట్ వంటి వాటిలో స్వల్పకాలంలో అనేక ఒదుడుకులకు లోనవడం వలన అసలు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. అయితే మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘకాలం మదుపు చేయడం వలన మంచి రాబడి పొందొచ్చు. ఇళ్ళు, స్థలాలు, పొలాలు వంటివాటికి అక్కడి నీటి లభ్యత, వాతావరణం, అభివృద్హి, ప్రభుత్వ విధానాలు వంటి అంశాలపై ధరలు నిర్ణయింపబడతాయి .

రిజర్వు బ్యాంక్ నిర్దేశించిన వడ్డీ రేట్లను బట్టి బ్యాంకులు తమ వినియోగదారులకు వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. అయితే కొందరు అధిక వడ్డీ రేట్ల కోసం అత్యాశకు పోయి ప్రభుత్వ నియంత్రణ లేని వ్యక్తుల లేదా సంస్థలలో పెట్టుబడి చేసి , అసలును కూడా న‌ష్టపోయిన సందర్భాలు మనం రోజూ వింటూనే ఉన్నాము.

కాలపరిమితి :

పెట్టుబడి చేసే విషయంలో మరొక ముఖ్యమైనది కాలపరిమితి. ఎంత దీర్ఘకాలం మదుపు చేయగలిగితే , చక్రవడ్డీ ప్రభావంతో అంత అధిక ప్రయోజనం పొందొచ్చు. మన ఆర్ధిక లక్ష్యాన్ని బట్టి అది స్వల్పకాలికమా , మధ్యకాలికమా, దీర్ఘకాలికమా అనేది గుర్తించాలి. ఉదా : 1-5 ఏళ్ల లోపు డబ్బు అవసరాలను స్వల్పకాలికంగా, 5-10 ఏళ్లలోపు కాలాన్ని మధ్యకాలికంగా, 10 ఏళ్ళు తరువాత అవసరమయ్యే డబ్బును దీర్ఘకాలిక లక్ష్యంగా పెట్టుకోవచ్చు. పెట్టుబడి చేసేముందే దీనిని గుర్తించగలిగితే , తగిన పథ‌కాన్ని ఎంచుకోవచ్చు. అలాగే దానిపై ఆశించే రాబడి ని పరిగణించవచ్చు.

స్వల్పకాలిక లక్ష్యాలకోసం అవసరమైన డబ్బును, మధ్య లేదా దీర్ఘకాలిక పథకాలలో పెట్టుబడి చేస్తే , ఒక్కొక్కసారి మన డబ్బు చేతికందక పోవచ్చు, లేదా అసలు కూడా నష్టపోయే ప్రమాదముంది. ఒకవేళ మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాల సొమ్మును స్వల్పకాలిక పథకాలలో పెట్టుబడి పెడితే, తగిన రాబడి రాక , లక్ష్యం చేరుకోవటానికి సొమ్ము సరిపోకపోవచ్చు. 

ఉదా : పదవీవిరమణ కు అవసరమయ్యే సొమ్మును PF , PPF , NPS , మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో మదుపు చేస్తే దీర్ఘకాలంలో అధిక రాబడితోపాటు , పన్ను మినహాయింపులు పొందొచ్చు. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం మదుపు చేసేటప్పుడు కొద్ది మొత్తాలతోనే మొదలు పెట్టండి. దీనివలన స్వల్ప కాలిక, మధ్యకాలిక లక్ష్యాల కోసం డబ్బు ఇబ్బంది ఉండదు.

లాక్-ఇన్ పీరియడ్:

కొన్ని పథకాలలో లాక్-ఇన్ పీరియడ్ వుంటుంది . ముఖ్యంగా పన్ను మినహాయింపులు పొందే పథకాలలో ఈ షరతు వుంటుంది . కొన్ని పథకాలలో లాక్-ఇన్ పీరియడ్ పూర్తయ్యే వరకు చేసిన పెట్టుబడిని పొందే అవకాశం ఉండదు. ఒకవేళ లాక్-ఇన్ పీరియడ్ సమయంలో చేసిన పెట్టుబడి తిరిగి పొందితే, పన్ను మినహాయింపులు కోల్పోయే అవకాశం వుంటుంది . ఉదా : పన్ను మినహాయింపు కోసం చేసే 5 ఏళ్ల బ్యాంక్ ఫిక్సెడ్ డిపాజిట్ లో పెట్టుబడి తిరిగి తీసుకుంటే, పొందిన పన్ను మినహాయింపును కోల్పోవలసి వుంటుంది .

పన్ను మినహాయింపులు :

ఆదాయపు పన్ను చట్టం కింద మినహాయింపు పొందేందుకు కొన్ని పథకాలలో మదుపు చేసినట్లయితే , పన్ను మినహాయింపులను పొందే అవకాశం ఉంది. ఉదా : సెక్షన్ 80సి కింద పీఎఫ్, పీపీఎఫ్, జీవిత బీమా ప్రీమియం, యులిప్స్, 5 ఏళ్ల బ్యాంక్ ఫిక్సెడ్ డిపాజిట్, ఎన్ఎస్సి, ఎన్పీఎస్ , ట్యూషన్ ఫీ , ఇంటి రుణ అసలు చెల్లింపులు వంటివి. అలాగే ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం , కొన్ని రకాల విరాళాలు వంటివి .

ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది , కేవలం పన్ను మినహాయింపులకోసం పెట్టుబడి చేయకూడదు. ఎందుకంటే ఇప్పటికీ అనేక మంది కేవలం పన్ను మినహాయింపు కోసం ఎండోమెంట్ ,హోల్ లైఫ్ , మనీ బ్యాక్ , యులిప్స్ వంటి పాలసీలను తీసుకుంటున్నారు. ఇటువంటి పాలసీలలో జీవిత బీమా హామీ తక్కువ, రాబడి తక్కువ, ప్రీమియం ఎక్కువ. జీవిత బీమా కోసం టర్మ్ జీవిత బీమా పాలసీని ఎంచుకుని, పన్ను మినహాయింపు, అధిక రాబడి కోసం పీ ఎఫ్, పీ పీ ఎఫ్ , వంటి పథకాలలో మదుపు చేయొచ్చు.

చివరగా:

పెట్టుబడి చేయడం ఒక కళ . మనం కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయికి విలువ ఇచ్చి , దీర్ఘకాలంలో అధిక సంపద చేకూర్చుకోవాలంటే ఆర్ధిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని