paytm: పేటీఎం ఎఫెక్ట్‌.. గూగుల్‌ పే, ఫోన్‌పే వైపు యూజర్ల చూపు

paytm: పేటీఎం ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో గూగుల్‌పే, ఫోన్‌పే యాప్‌ ద్వారా యూపీఐ చెల్లింపులు పెరిగినట్లు ఎన్‌పీసీఐ వెల్లడించింది

Published : 07 Mar 2024 02:11 IST

paytm | ఇంటర్నెట్‌డెస్క్‌: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై (PPBL) ఆర్‌బీఐ ఆంక్షలు ఇతర యాప్‌లకు వరంగా మారింది. పేటీఎం వినియోగదారులు ఇతర పేమెంట్‌ యాప్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. గూగుల్‌ పే (Google Pay), ఫోన్‌ పే (PhonePe) యాప్‌లకు మళ్లుతున్నారు. ఆంక్షల అనంతరం పేటీఎం ద్వారా చేసే లావాదేవీలు పెద్ద మొత్తం తగ్గుముఖం పట్టగా.. ఈ యాప్‌ల లావాదేవీలు పెరగడం గమనార్హం.

ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన అనంతరం పేటీఎం ద్వారా చేసే యూపీఐ చెల్లింపులు గణనీయంగా తగ్గాయి. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) డేటా ప్రకారం.. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో పేటీఎం ద్వారా చేసే లావాదేవీల విలువ 14 శాతం క్షీణించి రూ.1.65 లక్షల కోట్లుగా నమోదైంది. ఆ సమయంలో గూగుల్‌పే ద్వారా జరిపే లావాదేవీల విలువ 6 శాతం,  ఫోన్‌పేలో 7 శాతం పెరిగాయి. సంఖ్య పరంగాను ఈ రెండు యాప్‌ల లావాదేవీలు గతం కంటే పెరగ్గా.. పేటీఎంలో చేసే లావాదేవీలు తగ్గుముఖం పట్టాయని డేటా వెల్లడిస్తోంది.

‘సీస్పేస్‌’.. తొలి ప్రభుత్వ రంగ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌

జనవరి 31న పేటీఎంపై ఆంక్షలు విధిస్తూ ఆర్‌బీఐ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లలో డిపాజిట్లు, టాప్‌-అప్‌లు స్వీకరించొద్దని ఆదేశాల్లో పేర్కొంది. తర్వాత ఈ గడువును మార్చి 15 వరకు పొడిగించింది. ఈ పరిణామాలతో పేటీఎం షేరు ఇప్పటికే భారీగా క్షీణించింది. ఆంక్షలకు ముందు రూ.750 స్థాయి వద్ద ట్రేడయిన పేటీఎం షేరు.. ప్రస్తుతం రూ.400 దిగువకు చేరింది. మరోవైపు నియంత్రణ వైఫల్యాలను అధిగమించి బలమైన సంస్థగా పేటీఎం తిరిగి పుంజుకుంటుందని వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని