OTT Platform: ‘సీస్పేస్‌’.. తొలి ప్రభుత్వ రంగ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌

కేరళ ప్రభుత్వం సీస్పేస్‌ పేరుతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు చేస్తోంది. గురువారం సీఎం పినరయి విజయన్‌ ఈ సర్వీస్‌లను ప్రారంభించనున్నారు. 

Published : 06 Mar 2024 13:49 IST

తిరువనంతపురం: భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ  (OTT) మార్కెట్‌ క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటిదాకా ప్రైవేటు సంస్థలు మాత్రమే ఈ సర్వీస్‌లను అందిస్తున్నాయి. ఇకపై ప్రభుత్వ రంగ సంస్థలు ఓటీటీ సర్వీసులను అందించనున్నాయి. తాజాగా కేరళ (Kerala) ‘సీస్పేస్‌’ (CSpace) పేరుతో ఓటీటీ సర్వీస్‌లను అందించేందుకు సిద్దమైంది. మార్చి 7న సీఎం పినరయి విజయన్‌ (Pinarayi Vijayan)  ప్రారంభించనున్నారు. దేశంలో తొలి ప్రభుత్వ రంగ ఓటీటీ వేదిక ఇదేనని కేరళ సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్‌ తెలిపారు. 

‘‘ప్రస్తుతం ఓటీటీల్లో ప్రసారమవుతున్న కంటెంట్‌ ఎంపికలో అసమానతలు ఉన్నాయి. వాటి ప్రసారాల్లో సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటికి ప్రతిస్పందనగా సీస్పేస్‌ను ప్రారంభిస్తున్నాం’’ అని కేరళ రాష్ట్ర ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ (KSFDC) షాజీ ఎన్‌ కరున్‌ తెలిపారు. ఈ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

  • ఇందులో ప్రసారమయ్యే కంటెంట్‌ను ఎంపిక చేసేందుకు 60 మంది సభ్యులతో కూడిన ప్యానెల్‌ నియమించారు. సీస్పేస్‌ కోసం ఇప్పటి వరకు 42 చిత్రాలను ఎంపిక చేశారు. 
  • ‘పే ఫర్ వ్యూ’ ఆధారంగా నిర్మాతలకు చెల్లింపులు చేస్తారు. రూ.75 ధరకు యూజర్లు సినిమా చూడొచ్చు. తక్కువ నిడివి ఉన్న కంటెంట్‌ను సగం ధరకే వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. నూతన దర్శకులు తమ చిత్రాల కోసం సీస్పేస్ ద్వారా క్రౌడ్‌ ఫండింగ్‌ చేసుకోవచ్చు.
  • చాలా మంది నిర్మాతలు తమ చిత్రాలను నేరుగా ఓటీటీల్లో విడుదల చేయడం వల్ల లాభాలు తగ్గుతున్నాయని పలువురు ఎగ్జిబిటర్లు, పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా థియేటర్లలో విడుదలైన సినిమాలను మాత్రమే సీస్పేస్‌లో విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. 
  • వాటితోపాటు ప్యానెల్‌ అనుమతి పొందిన షార్ట్‌ ఫిల్మ్స్‌, డాక్యుమెంటరీలు, ప్రయోగాత్మక చిత్రాలను స్ట్రీమింగ్‌ చేస్తారు. ఈ ఓటీటీ ద్వారా వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని చిత్ర పరిశ్రమలో ఉపాధిలేని నిపుణుల సంక్షేమం కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని