Nirmala Sitharaman: క్రిప్టో కరెన్సీలపై పన్ను వేసే హక్కు ప్రభుత్వానికి ఉంది..

క్రిప్టో కరెన్సీ లావాదేవీల నుంచి వచ్చే లాభాలపై పన్ను విధించే హక్కు ప్రభుత్వానికి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. అయితే వాటిని నిషేధించాలా.. వద్దా

Updated : 11 Feb 2022 15:24 IST

నిషేధించాలా వద్దా అన్నది తర్వాత నిర్ణయిస్తాం..

రాజ్యసభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

దిల్లీ: క్రిప్టో కరెన్సీ లావాదేవీల నుంచి వచ్చే లాభాలపై పన్ను విధించే హక్కు ప్రభుత్వానికి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. అయితే వాటిని నిషేధించాలా.. వద్దా అన్నదానిపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. 2022-23 బడ్జెట్‌పై రాజ్యసభలో జరిగిన చర్చకు శుక్రవారం ఆమె సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆమె క్రిప్టో పన్ను అంశాన్ని ప్రస్తావించారు. 

‘‘క్రిప్టోకరెన్సీ లావాదేవీలు చట్టబద్ధమా.. కాదా అన్న ప్రశ్న తర్వాత. కానీ ఆ లావాదేవీల ద్వారా పొందే లాభాలపై పన్ను విధిస్తాం. ఎందుకంటే అది ప్రభుత్వానికి ఉండే సార్వభౌమ హక్కు. క్రిప్టో కరెన్సీలపై నిపుణులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. వారి నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత క్రిప్టోలను నిషేధించాలా.. వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడే దానిపై ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు’’ అని సీతారామన్ వెల్లడించారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన 2022-23 కేంద్ర బడ్జెట్‌లో క్రిప్టో లావాదేవీలపై 30శాతం పన్ను విధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ లావాదేవీలను చట్టబద్ధం చేసినట్లే అని మదుపర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్థికమంత్రి నేడు స్పష్టతనిచ్చారు.

ఆర్థికవ్యవస్థ పునరుద్ధరరణే.. బడ్జెట్‌ లక్ష్యం

ఆర్థిక వ్యవస్థలో స్థిరమైన పునరుద్ధరణే లక్ష్యంగా 2022-23 బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆర్థికమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. 100ఏళ్ల స్వాతంత్ర్య భారత్‌ను దృష్టిలో ఉంచుకుని రానున్న 25ఏళ్లకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. ఈ పాతికేళ్లు దేశానికి చాలా ముఖ్యమని అన్నారు. వాటిపై దృష్టి పెట్టకపోతే స్వాత్రంత్యం వచ్చిన తొలి 70ఏళ్లలో ఎలా ఇబ్బందులు పడ్డామో మళ్లీ అలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కాంగ్రెస్‌పై పరోక్ష విమర్శలు చేశారు.

ఇక గత ప్రభుత్వాలు సాధించలేని పురోగతిని ఈ ఏడేళ్లలో సాధించినట్లు ఆర్థికమంత్రి తెలిపారు. 2008-09లో ప్రపంచ ఆర్థిక మాంద్యం తలెత్తినప్పుడు దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 9.1శాతానికి చేరిందని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ.. తమ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని 6.2శాతానికి పరిమితం చేయగలిగిందని చెప్పారు. 

రాజ్యసభ వాయిదా..

రాజ్యసభ బడ్జెట్‌ తొలి విడత సమావేశాలు నేటితో ప్రారంభమయ్యాయి. జనవరి 31న సమావేశాలు మొదలవ్వగా.. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, బడ్జెట్‌పై చర్చలు జరిగాయి. నేటితో తొలి విడత సమావేశాలను ముగిస్తున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు. బడ్జెట్‌ రెండో విడత సమావేశాల కోసం రాజ్యసభను మార్చి 14వ తేదీకి వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని