Life Insurance: జీవిత బీమా పాల‌సీని.. ఎప్పుడు స‌మీక్షించాలి?

వాహన, ఆరోగ్య, గృహ బీమా పాలసీల మాదిరిగానే జీవిత బీమా పాలసీని కూడా కాలనుగుణంగా సమీక్షిస్తుండాలి.

Published : 08 Jun 2022 16:34 IST

  

జీవిత బీమాను కొనుగోలు చేశాం.. ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు అనుకుంటారు కొంత మంది. కానీ జీవిత బీమాను కొనుగోలు చేయ‌డంతోనే స‌రిపోదు..  క్రమానుగతంగా స‌మీక్షిస్తూ ఉండాల‌ని ప‌రిశ్ర‌మ నిపుణులు సూచిస్తున్నారు. జీవిత బీమాను కాలానుగుణంగా సమీక్షించడం ద్వారా అసవరమైన సమయంలో ప్రయోజనాలు పొందడానికి ఆస్కారముంటుంది. అంతేకాకుండా మీ ప్రియమైన వారి భవిష్యత్తు అవసరాలకు, జీవితంలో జరిగే అనేక మార్పులకు అనుగుణంగా ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌గ‌లుగుతాయి.  జీవిత బీమా ప్రయోజనాలు చాలా వరకు మీ మీద పూర్తిగా ఆదారపడినవారికి, మీ జీవితంలో, సంపాదనా సామర్థ్యంలో అనుకోని మార్పులు సంభవించినప్పుడు రక్షణ పొందడానికి దోహదపడతాయి.

జీవిత బీమా పాలసీని సమీక్షించవలసిన ముఖ్యమైన సందర్భాలు..
కొత్త అనుబంధం ఏర్పడినప్పుడు..
మీకు వివాహం జరిగినప్పుడు, బిడ్డ జన్మించినప్పుడు జీవిత బీమా సమీక్ష నిర్వహించాలి. మీరు ఒక కొత్త వ్యక్తిని మీ జీవితంలోనికి ఆహ్వానిస్తున్నారు. కాబ‌ట్టి అవ‌స‌రాలు పెరుగుతాయి. భ‌విష్య‌త్తులో పాల‌సీ ప్ర‌యోజ‌నాలు వారికి వ‌ర్తించేలంటే బీమా పాలసీ జాబితా వివరాలను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అంటే  మీ జీవిత బీమా పాలసీ లబ్దిదారుల జాబితాలో ఆ కొత్త వ్యక్తిని చేర్చ‌డం అన్న‌మాట‌. వారి వ్యక్తి గత జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని, బీమా హామీ మొత్తం అందరి భవిష్యత్తు అవసరాలకు సరిపోతుందా… లేదా నిర్ధారించుకోవచ్చు. ఒక వేళ హామీ మొత్తం సరిపోదని మీరు భావిస్తే, లైఫ్ స్టేజ్ ప్రొటక్షన్ కింద, చిన్న మొత్తంలో ప్రీమియం చెల్లించి బీమా హామీని మొత్తాన్ని పెంచుకోవచ్చు. లేదా మరొక కొత్త బీమా పాలసీని కొనుగోలు చేయచ్చు.

వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కుటుంబంలో కొత్తగా చేర్చినట్లయితే వారి పదవీవిరమణ అవసరాలు, ఖర్చులు గురించిన భాద్యత మీ మీదే ఉంటుంది. ఇలాంటి సందర్భంలో కూడా మీ జీవిత బీమాపాలసీని సమీక్షించుకోవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల‌ మీరు లేకపోయినా కూడా మీ తల్లిదండ్రుల జీవితానికి భరోసా ఇవ్వగలుగుతారు.

ఉద్యోగంలో మార్పులు సంభవించినప్పుడు..
ఉద్యోగ మార్పు సాధారణంగా వ్యక్తి ఆర్థిక స్థితిలో మార్పులను తీసుకువస్తుంది. పదోన్నతి, వేతన వృద్ది, అనుకోని బోనస్ చెల్లింపులు వంటివి వచ్చినప్పుడు నూతన ఆర్ధిక నిర్ణయాలను తీసుకోవలసి ఉంటుంది. మీ ఆదాయం పెరిగినప్పుడు, మెరుగైన జీవనశైలి అవసరాల కోసం జీవిత బీమా హామీ మొత్తాన్ని పెంచుకోవాలి, పాలసీని సమీక్షించాలి. అయితే ఒకవేళ ఉద్యోగం కోల్పోతే మీ రోజు వారి ఖర్చులకు ఇబ్బంది కలుగుతుంది. ఏ కారణంగానైనా సరే ప్రీమియం చెల్లింపులను నిలిపివేయడం మంచిది కాదు. దానికి బదులుగా మీ బీమా సంస్థ అధికారులను ప్రస్తుత సంవత్సరానికి ప్రీమియం చెల్లింపులు తగ్గించమని అడుగవచ్చు.

ఆర్ధిక స్థితిలో మార్పులు..
కారు, గృహం వంటివి కొనుగోలు చేయడానికి రుణం కోసం, మీ పిల్లల చదువుల కోసం వ్యక్తిగత రుణం తీసుకోవాలని దరఖాస్తు చేసేముందు, రుణం ఈఎమ్ఐలను పరిగణలోనికి తీసుకోవాలి. క్రెడిట్ కార్డు బిల్లు వంటి స్వల్ప కాలిక రుణాలను కూడా లెక్కించాలి. ఈ విధంగా చేయడం వల్ల మీరు లేని సమయంలో మీ ప్రియమైన వారి పై రుణ భారం పడకుండా, వాటిని చెల్లించడానికి కావలసిన మొత్తాన్ని హామీ రూపంలో పొందే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆకస్మిక మరణం సంభవించినప్పుడు మీ బదులుగా బీమా సంస్థలు రుణాలను చెల్లిస్తాయి.

చివరిగా..
మీ జీవిత బీమా పాలసీ సమీక్షను మర్చిపోతుంటే, ఒక వార్షిక సమీక్ష ప్లాన్ చేయండి. ఇది మీ ప్రస్తుత, భవిష్యత్తు ద్రవ్యనిధి, పెట్టుబడి అవసరాల గురించి మీ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లానర్‌తో చర్చించి మీ భవిష్యత్తు అవసరాలకు తగినట్లు పాల‌సీ ఎంచుకోవాలి. కొత్త ఫీచర్లు, యాడ్-ఆన్లను గురించి క్రమానుగత అప్‌డేట్‌ను ఇవ్వవలసిందిగా బీమా సంస్థను కోరాలి. ఈ విధంగా చేయడం వలన మీ అవసరాలను సులభంగా చేరుకునేందుకు తగిన బీమా హామీ మొత్తాన్ని పెంచుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని