Updated : 05 Jul 2022 15:55 IST

జీతం పెరుగుద‌ల‌ను ఎలా స‌ద్వినియోగం చేసుకోవాలి?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్ స‌మ‌యంలో ఐటీ, ఫార్మా ఉద్యోగాలు త‌ప్పించి చాలా ఉద్యోగాలు ప్ర‌మాదంలో ప‌డ్డాయి. ఆ స‌మ‌యంలో పూర్తిగా ఉద్యోగాలు కోల్పోవ‌డం గానీ, పాక్షికంగా ర‌ద్దు అవ్వ‌డం గానీ దేశ‌మంతా జ‌రిగాయి. జీతాలు పెర‌గ‌డం అటుంచి ఉద్యోగాలు నిల‌బెట్టుకోవ‌డం చాలా మందికి ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగుల‌కు శ‌క్తికి మించిన ప‌నైంది. గతేడాది నుంచి ప‌రిస్థితులు మెల్ల‌గా కుదుట‌ప‌డ్డాయి. ఉద్యోగుల‌కు ఇంక్రిమెంట్లు ఇవ్వ‌డం, జీతాలు పెంచ‌డం లాంటివి అన్ని రంగాల్లో మొద‌ల‌య్యాయి. మీకూ ఇంక్రిమెంట్ వ‌చ్చిందా? జీతం పెరిగిందా? మరి ఈ పెరుగుద‌ల‌ను స‌ద్వినియోగం చేసుకోవ‌డం ఎలా...?

వేగంగా నగదుగా మార్చుకోవ‌డానికి వీలుండే ఆర్థిక ఆస్తుల్లో పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవ‌డానికి కొత్త‌గా పెరిగిన నిధుల‌ను ఉప‌యోగించుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు.. ఈ నిధుల‌ను బాండ్‌లు, స్టాక్స్, మ్యూచువ‌ల్ ఫండ్‌లు, బీమాలో పెట్టుబ‌డి పెట్ట‌డానికి ఉప‌యోగించుకోవ‌చ్చు. కొంత మందికి ఇంక్రిమెంట్‌లు, డీఏలు బ‌కాయిల‌తో పాటు ఎరియర్స్ వ‌స్తుంటాయి. ఒత్తిడిని త‌గ్గించుకోవ‌డానికి చిన్న చిన్న ఖ‌ర్చులు చేసినా కూడా, మొత్తం ఖ‌ర్చు పెట్టేయ‌డం స‌రైనా చ‌ర్య కాదు. మీ ఆర్థిక  ప‌రిస్థితుల‌ను భ‌విష్య‌త్‌లో చ‌క్క‌దిద్దుకోవ‌డానికి ఈ అద‌న‌పు మొత్తాన్ని ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇంకా మీ పెరిగిన ఆదాయంతో పొదుపును ఎలా పెంచుకోవ‌చ్చో కొన్ని విష‌యాలు ఈ దిగువన ఉన్నాయి. 

క‌నీస పొదుపు: చాలా మందికి ఉద్యోగం, దానిమీద ఆర్జించే జీత‌మే ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా ఉంటుంది. అలాంటి వారు ఖ‌ర్చుల విష‌యంలో చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ఇంక్రిమెంట్‌లో పెరుగుద‌ల ఉన్నా ఏటా కుటుంబంలో పెరిగే ఖ‌ర్చులు ఎలాగూ ఉంటాయి. వాటికి 50% ఖ‌ర్చుపెట్టి, క‌నీసం మిగ‌తా 50% పొదుపు చేయండి. లేక భ‌విష్య‌త్‌లో అత్య‌వ‌స‌రంగా వాడుకోవ‌డానికి వీలుండే విధంగా పెట్టుబడి పెట్టండి. ఉదాహ‌ర‌ణ‌కు జీతంలో రూ.5,000 పెంపు ఉంటే, మీరు నెల‌కు అద‌నంగా రూ. 2,500 ఆదా చేయ‌డం కొన‌సాగించాలి.

ప‌ద‌వీవిర‌మ‌ణ, ట‌ర్మ్ క‌వ‌ర్ పెంపు: ఉద్యోగ విర‌మ‌ణ త‌ర్వాత జీతంపై ఆధార‌ప‌డే వారికి నెల నెలా ఆదాయం ఉండ‌దు. కాబ‌ట్టి, ఉద్యోగ విర‌మ‌ణ నిధిని పెంచ‌డానికి ఈ జీతం పెరుగుద‌ల‌ను ఉప‌యోగించాలి. కొంచెం ఎక్కువ డ‌బ్బు ఆదా చేస్తే ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి పెరుగుతుంద‌ని గుర్తించాలి. పీఎఫ్ మొత్తాన్ని పెంచొచ్చు. లేదా ఎన్‌పీఎస్‌లో అదనంగా మదుపు చేయవచ్చు. వారి ట‌ర్మ్ బీమా క‌వ‌ర్ అద‌నంగా ఉండే విధంగా పున‌రుద్ధరించాలి.

అత్య‌వ‌స‌ర నిధిని పెంచుకోండి: వార్షిక ఇంక్రిమెంట్ బ‌కాయిల‌తో పాటు వ‌స్తే, మీ అత్య‌వ‌స‌ర నిధిని పెంచ‌డానికి వెంట‌నే అద‌న‌పు మొత్తాన్ని ఉప‌యోగించండి. మీకు మీ కుటుంబంలో జ‌రిగే అత్య‌వ‌స‌ర సంఘ‌ట‌న‌లు త‌ట్టుకోవ‌డానికి, ఈ అత్య‌వ‌స‌ర నిధి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అత్య‌వ‌స‌ర నిధి నెలసరి ఆదాయానికి 6-7 రెట్లు ఉండేలా త‌గు చ‌ర్య‌లు తీసుకోవాలి. మీ వద్ద ఉన్న అత్య‌వ‌స‌ర నిధిని పెంచ‌డానికే ప్ర‌య‌త్నించాలి.

నెల‌వారీ SIPని పెంచుకోండి: మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో మ‌రింత క్ర‌మ‌బ‌ద్ధమైన నెల‌వారీ పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించ‌డానికి SIPల‌ను అల‌వాటు చేసుకోవాలి. సంప్రదాయ పొదుపు ప‌థ‌కాల క‌న్నా ఈ మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో అధిక రాబ‌డి ఆశించ‌వ‌చ్చు. ఈ SIPల‌లో జీతం పెరుగ‌ద‌ల డ‌బ్బును పెట్టుబ‌డిగా పెంచ‌డం ద్వారా భ‌విష్య‌త్‌లో మ‌రింత అధిక నిధిని వెన‌కేయ‌వ‌చ్చు.

ప‌న్ను ప‌రిధి: మీ జీతం పెరిగిన‌ప్పుడు, మీ ఆదాయ ప‌న్ను కూడా పెర‌గొచ్చు. కాబ‌ట్టి మీ జీతం పెరిగిన‌ప్పుడు ఆదాయ ప‌న్ను విష‌య‌మై ఎలా వ్య‌వ‌హారించాలో గ‌మ‌నించండి. ప‌న్ను మిన‌హాయింపుల పెట్టుబ‌డులను, అందులో లాభ‌న‌ష్టాల‌ను బేరీజు వేసుకుని స‌రైన పెట్టుబ‌డులు పెట్టండి. ఒక్కోసారి కొన్ని పెట్టుబ‌డుల్లో ప‌న్ను మిన‌హాయింపులు ఉన్నా ఆయా ప‌థ‌కాల‌లో స‌రైన నిక‌ర రాబ‌డి ఉండ‌దు. ఇటువంటి పెట్టుబ‌డుల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. అలాగే, రిస్క్ పరిమితి తెలుసుకోకుండా పన్ను ఆదా కోసం ఈఎల్ఎస్ఎస్ లాంటి పథకాల్లో పెట్టుబడి పెట్టడం సరైన పద్ధతి కాదు.

నైపుణ్యాలు పెంపు: అస‌లు ఉపాధి పొంద‌డ‌మ‌నేదే ఎవ‌రికైనా వారి నైపుణ్యం మీద ఆధార‌ప‌డి ఉంటుంది. వృత్తి నైపుణ్యం బాగున్నా వారికి ఇంక్రిమెంట్లు కూడా బాగా పెరుగుతాయ‌ని చెప్పొచ్చు. జీతం పెంపుతో ఆయా సంస్థ‌లు ఉద్యోగి ప‌ని నైపుణ్యాన్ని కూడా అధికంగానే ఆశిస్తాయి. అందు వల్ల ఈ జీతం పెంపుతో వారు కొత్త విద్య‌ల‌ను నేర్చుకోవ‌డానికి ఫీజులుగా ఉప‌యోగించుకోవ‌చ్చు. దీంతో కొత్త నైపుణ్యాలు పెంచుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం శాస్త్ర‌, సాంకేతిక రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రంగాల‌లో నూత‌న నైపుణ్యాల‌కు ఎప్ప‌టిక‌ప్ప‌డు అప్‌గ్రేడ్ అవ్వ‌డం త‌ప్ప‌దు.

చివ‌రగా: వేత‌నం పెంపును పొందేట‌ప్పుడు తెలివిగా ఉండ‌టం చాలా ముఖ్యం. జీతం పెంపు క్ష‌ణాల‌ను ఆస్వాదించ‌డం ఎవ‌రికైనా సహ‌జ‌మే. కానీ భ‌విష్య‌త్తులో ఒత్తిడిని నివారించాల‌నుకుంటే ప్రాధాన్య‌త‌ల‌ను నిర్ణ‌యించ‌డం, దీర్ఘ‌కాల ల‌క్ష్యాల‌ను గుర్తించ‌డం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో ప్ర‌తి విష‌యం, సంఘ‌ట‌న డ‌బ్బుతో ముడిప‌డి ఉంటుంది. కాబ‌ట్టి ఆర్థిక ప‌ర‌మైన విష‌యాల్లో శ‌క్తిమంతంగా, అప్రమత్తంగా ఉండడం ఎవరికైనా చాలా అవసరం.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని