Budget 2022: భారత బడ్జెట్‌పై ఐఎంఎఫ్‌ ఏమందంటే..?

ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టిన భారత బడ్జెట్‌ను అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఒక ‘‘ఆలోచనాత్మకమైన విధాన ఎజెండా’’గా అభివర్ణించింది...

Updated : 04 Feb 2022 13:54 IST

వాషింగ్టన్‌: ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టిన భారత బడ్జెట్‌ను అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఒక ‘‘ఆలోచనాత్మకమైన విధాన ఎజెండా’’గా అభివర్ణించింది. పరిశోధన-అభివృద్ధిలో నూతన ఆవిష్కరణలతో పాటు హ్యూమన్‌ క్యాపిటల్‌, డిజిటలైజేషన్‌కు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇచ్చారని ఐఎంఎఫ్‌ ఎండీ క్రిస్టలినా జార్జియేవా తెలిపారు.

భారత వృద్ధిరేటు బలంగా ఉంటుందని ఐఎంఎఫ్‌ తొలి నుంచి అంచనా వేస్తూ వస్తోందని క్రిస్టలినా పేర్కొన్నారు. 2022 ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటును 9.5 శాతం నుంచి 9 శాతానికి తగ్గించినప్పటికీ.. 2023కి మాత్రం తిరిగి కోలుకుంటుందని అంచనా వేశామని గుర్తుచేశారు. భారత ప్రభుత్వ అంచనాలకనుగుణంగానే.. తామూ భారత వృద్ధిరేటు స్థిరంగా పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నామని తెలిపారు.

కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రకటించిన ఉద్దీపనల నుంచి బయటకు వచ్చేందుకు వివిధ దేశాలు ఆర్థికంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయని క్రిస్టలినా గుర్తుచేశారు. అయినప్పటికీ.. భారత్‌ వంటి వర్ధమాన మార్కెట్లపై ఆ ప్రభావం తక్కువగానే ఉందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు ముందుజాగ్రత్తగా తీసుకున్న నిర్ణయాలు, అవలంబిస్తున్న విధానాలే అందుకు కారణమని పేర్కొన్నారు.

స్వల్పకాల ఆందోళనలపై భారత్‌ దృష్టిపెట్టడాన్ని తాము స్వాగతిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అలాగే దీర్ఘకాలంలో కావాల్సిన నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. పర్యావరణ మార్పులకు కావాల్సిన ఆర్థిక సాధనాలకు సైతం భారత్‌ పదునుపెడుతోందన్నారు.

రూ.39.45 లక్షల కోట్లతో కూడిన కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అందుబాటు ధరలో ఇళ్లు, రోడ్లు, రహదారుల నిర్మాణానికి కేటాయింపులు గణనీయ స్థాయిలో పెంచింది. మహమ్మారి ప్రభావం నుంచి కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచేలా మౌలిక వసతుల కల్పనకు భారీ మొత్తం కేటాయించింది. మూలధన వ్యయానికి 35 శాతం పెంచి రూ.7.5 లక్షల కోట్లు కేటాయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని