చెల్లకుంటే చిక్కులెన్నో...

చెక్కు…నగదుకు ప్రత్యామ్న్యాయం. రుణం తీసుకోవడానికి హామీ…ఏదైనా కొనుగోలు చేయడానికైనా, ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా ఒక్క చెక్కుతోనే పని జరిగిపోతుంది. ఇక ఖాళీ చెక్కులు అవసరాలు ఎన్నో…కానీ…ఇలా ఇచ్చే చెక్కులు దుర్వినియోగం అయితే ఏం చేయాలి? చెల్లని చెక్కు ఇస్తే నేరం చేసినట్లేనా?చట్టాలు ఏం చెబుతున్నాయి? కోర్టులు..

Published : 16 Dec 2020 18:31 IST

చెక్కు…నగదుకు ప్రత్యామ్న్యాయం. రుణం తీసుకోవడానికి హామీ…ఏదైనా కొనుగోలు చేయడానికైనా, ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా ఒక్క చెక్కుతోనే పని జరిగిపోతుంది. ఇక ఖాళీ చెక్కులు అవసరాలు ఎన్నో…కానీ…ఇలా ఇచ్చే చెక్కులు దుర్వినియోగం అయితే ఏం చేయాలి? చెల్లని చెక్కు ఇస్తే నేరం చేసినట్లేనా?చట్టాలు ఏం చెబుతున్నాయి? కోర్టులు ఏమంటున్నాయి? వ్యక్తుల, సంస్థల ఆర్ధిక వ్యాపార లావాదేవీల్లో చెక్కుల పాత్ర ఎంతో ఉంటుంది. వీటి చెల్లుబాటు గురించి చట్టం లో కఠిన నిబంధనలే ఉన్నాయి. బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు తమ వ్యాపారాలు సజావుగా సాగాలంటే ఇలాంటి కఠిన చట్టాలు ఉండాల్సిందేనని అంటున్నాయి. అయితే, ఈ క్రమం లో వాటి దుర్వినియిగానికి సంబంధించి మాత్రం ఏ చర్చా జరగడం లేదు. విధి విధానాల్ని రూపొందించే ప్రయత్నాలూ చేయడం లేదు. అందరూ సర్వాధికారాల్ని కోరుకుంటున్నారు కానీ జవాబుదారీతనాన్ని సిద్ధపడటం లేదు. దీని వల్ల చట్టం పట్ల, వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం పోతోందని, న్యాయేతర మార్గాల్ని వెతుకుతున్నారని తెలుసుకోవడం లేదు. ఖాతాదారుల అవసరాలకు, అవకాశాలకు, ఆదాయానికి, ఆధారాలకు అనుగుణంగా అప్పులిస్తీ ఈ చెక్కుల అవసరం ఉంటుందా? నచ్చినట్టుగా అప్పులిచ్చి దాన్ని వాసులు చేయడానికి పేడ మార్గాల్ని ఆశ్రయించడం న్యాయమేనా?

ఇదొక వాస్తవ ఉదాహరణ:

ఓ బ్యాంకు వారికి ఓ పెద్ద వ్యాపార సంస్థ ఖాతాదారుడు. ఆ సంస్థకు నగరమంతా శాఖలు ఉన్నాయి. వారి వ్యాపారాల్ని సజావుగా సాగేందుకు పొరుగు సేవల్ని(ఔట్ సోర్సింగ్) అందించే ఓ చిన్న వ్యాపార సంస్థ తో అవసరం వచ్చింది. వారి షోరూంలలో సేవలు అందించాల్సిందిగా ఆ చిన్న సంస్థను కోరింది. ఆ సంస్థ కు చెందిన యజమాని అంత తాహతు తనకు లేదని, తన వల్ల కాదని తెలిపాడు. అయినప్పటికీ వినకుండా…బ్యాంకు నుంచి రుణం ఇప్పిస్తాం…దీనితో వ్యాపారం ప్రారంభిస్తే తెల్లారేసరికి పెద్ద వ్యాపారవేత్తగా మారిపోతావని ఆశ చూపించింది. నిపుణుల సహాయం తో ఆకర్షణీయమైన పధక నివేదిక తయారయ్యింది. తర్వాత బ్యాంకు మ్యానేజర్ ను కలిసి ముగ్గురూ ఒప్పందం కుదుర్చుకున్నారు.

మరి రుణం కావాలంటే హామీ కావాలి కదా! కార్పొరేట్ హామీ ఇస్తానన్న బడా వ్యాపార సంస్థ మొహం చాటేసింది. ఏ చేయాలో పాలుపోని వ్యాపారి ఖాళీ చెక్కులు, తనవి, తనకు తెలిసిన వారి ఆస్తులను తాకట్టు హామీగా చూపించాడు. కొంత రుణం విడుదల అయింది, దీనితో ఆ వ్యాపార సంస్థ లో పొరుగు సేవల పనులు ప్రారంభించాడు. ఇంతలో వ్యాపార సంస్థ నుంచి పిడుగు లాంటి వార్త. అతని అందించే సేవల్లో నాణ్యత లేదని, ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు తెలిపింది. అదే విషయం బ్యాంకుకి కూడా తెలిపింది. బ్యాంకు వెంటనే వ్యాపారి ఖాతాను రద్దు చేసింది. ఖాళీ చెక్కులను వసూలు కోసం పంపించింది, అవి చెల్లకపోయేసరికి నోటీసులు పంపింది. రుణ వసూలుకు ఒక కేసు, తనఖా ఆస్తుల జప్తు కోరుతూ ఒకటి, చెల్లని చెక్కులకి ఒకటి ఇలా కేసులు వేసింది. దీనితో ఆ వ్యాపారి తన వ్యాపారాన్ని వదిలేసి కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. కొసమెరుపు ఏంటంటే…బ్యాంకు ముందు తన ఖాతా ను రద్దు చేసి, మళ్ళీ ఆ ఖాతా చెక్కులనే అందులో జమ చేసింది. రద్దైన ఖాతా కి సంబంధించి చెక్కులు ఇచ్చి మోసం చేసాడని మరో కేసు కూడా పెట్టింది. చెక్కులతో ఉన్న చిక్కులు ఇలా ఉంటాయన్నమాట.

నేరం చేసినట్లేనా?

ఒక వ్యక్తి చెక్కు ఇచ్ఛందంటే అర్ధం…ఆ చెక్కు ఉన్న వ్యక్తికి అందులో పేర్కొన్న మొత్తాన్ని ఇవ్వాల్సిందిగా బ్యాంకు వారికి ఇచ్చే అభ్యర్ధన అన్నమాట. చెక్కు ఇచ్చే ముందు ఖాతాదారు ఖాతా లో ఆ మొత్తం ఉండాలి. లేదా బ్యాంకుతో ఏదైనా రుణ ఒప్పందం అయినా ఉండాలి. అలా కాకుండా చెక్కు చెల్లకుండా తిరిగి వచ్చిందనుకోండి, అది నేరంగా మారే క్రమం ఎలా ఉంటుందంటే…

  • చెక్కు తిరిగి వచ్చిందని తెలిసిన నెల రోజుల్లో చెక్కు పొందిన వారు, చెక్కు ఇచ్చిన వారికి 15 రోజుల్లోగా చెక్కులో పేర్కొన్న సొమ్ము చెల్లించాల్సిందిగా కోరుతూ నోటీసు ఇవ్వాలి.

  • నోటీసు అందిన 15 రోజుల్లోగా సొమ్ము చెల్లిస్తే నేరం చేయనట్లే, అలా కట్టకపోతే అది నేరమే.

  • నోటీసు ముట్టిన తర్వాత కూడా 15 రోజుల్లో చెల్లించకపోతే ఆ గడువు ముగిసిన తర్వాత నెల రోజుల్లోపు రాతపూర్వకంగా సంబంధిత జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ వారి కోర్టు లో ఫిర్యాదు చేయాలి. ఆలస్యం జరిగిన తగిన కారణాలు ఉంటే కోర్టు క్షమించవచ్చు.

తొందరగా తేల్చాలి:

చెక్కు కేసులను తొందరగా పూర్తి చేయాలని సుప్రీమ్ కోర్టు తెలిపింది.

  • ఫిర్యాదు సక్రమంగా ఉంటే దాఖలు చేసిన రోజు కోర్టు స్వీకరించి సమన్లు పంపాలి.

  • వాయిదా తేదీ దగ్గర్లో ఉంచాలి. సమన్లు పోస్టు తో పాటు ఈమెయిల్ కి కూడా పంపాలి. అవసరమైన సందర్భం లో పోలీసు సహకారం తీసుకోవాలి.

  • నిందితుడు రాజీ కోరుతూ, దాని కోసం మొదటి వాయిదాలోనే ఆర్జీ పెట్టుకుంటే వెంటనే దాన్ని పరిష్కరించాలి.

  • మూడు నెలల్లో విచారణ ముగించాలి. అవసరమైతే సాక్ష్యాల్ని ప్రమాణ పత్రం లో తీసుకుని, ఎదురు ప్రశ్నల పరీక్షకు వెంటనే ఆదేశాలివ్వాలి.

రాజీ విషయాల్లోనూ…

చెక్కు, ఇచ్చిన వ్యక్తులు/సంస్థలు రాజీ కుదుర్చుకునే సందర్భాల్లోనూ సుప్రీమ్ కోర్టు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది.

  • రాజీ ఉద్దేశం ఉంటే మొదటి, రెండో వాయిదాల్లోనే అడగాలని సమన్లలోనే పొందు పర్చాలి.

  • ఒకవేళ ఆ తర్వాత ఎప్పుడు రాజీకి ఆర్జీ పెట్టుకున్నా ఆర్జీలను అనుమతించడానికి అదనంగా చెక్కు సొమ్ములో 10 శాతం, న్యాయ సేవ ప్రాధికార సంస్థ లో జమ చేయాల్సి ఉంటుంది. అదే మేజిస్ట్రేట్ కోర్టు కాకుండా ఆ పై కోర్టు, అంటే జిల్లా కోర్టు, హై కోర్టు లో అలంటి ఆర్జీ పెట్టుకునే 15 శాతం వరకు కట్టాల్సి ఉంటుంది. అదే సుప్రీమ్ కోర్టు వరకు వెళ్ళాక ఆర్జీ పెట్టినట్టైతే 20 శాతం వరకు పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని