LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓకు ధరల శ్రేణి ఎంతంటే?

బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు (ఐపీఓకు) ధరల శ్రేణిని రూ.902- 949గా నిర్ణయించారు. ఈ ఐపీఓ మే 4న ప్రారంభమై 9న ముగిసే అవకాశం ఉందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

Updated : 27 Apr 2022 08:57 IST

దిల్లీ: బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు (ఐపీఓకు) ధరల శ్రేణిని రూ.902- 949గా నిర్ణయించారు. ఈ ఐపీఓ మే 4న ప్రారంభమై 9న ముగిసే అవకాశం ఉందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇష్యూ ధరలో పాలసీదార్లకు రూ.60, చిన్న మదుపర్లు, ఉద్యోగులకు రూ.40 మేర రాయితీ ఉంటుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. మదుపర్లు కనీసం 15 షేర్లకు (ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవాల్సి రావొచ్చు. యాంకర్‌ ఇన్వెస్టర్లకు మే 2న ఇష్యూ ప్రారంభం అవుతుంది.

* ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 5 శాతం వాటా లేదా 31.6 కోట్ల షేర్లను విక్రయించాలని తొలుత భావించినప్పటికీ, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాల్లో,  వాటా విక్రయ పరిమాణాన్ని 3.5 శాతం లేదా   22.13 కోట్ల షేర్లకు తగ్గించుకోవాలని గత వారంలో నిర్ణయం తీసుకుంది. దీంతో ఇష్యూ పరిమాణం   రూ.21,000 కోట్లకు పరిమితమైంది. ఎల్‌ఐసీ విలువను రూ.6 లక్షల కోట్లుగా పరిగణిస్తున్నారు.  


పాలసీదార్లకు 10 శాతం

పాలసీదార్లకు ఇష్యూ పరిమాణంలో 10 శాతం లేదా 2.21 కోట్ల షేర్లను, ఉద్యోగులకు 15 లక్షల షేర్లను రిజర్వ్‌ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేటాయింపుల అనంతరం మిగిలిన షేర్లలో 50 శాతాన్ని అర్హులైన సంస్థాగత మదుపర్లకు (క్యూఐబీ), చిన్న మదుపర్లకు 35 శాతం షేర్లను, సంస్థాగతేతర మదుపర్లకు 15 శాతం షేర్లను కేటాయించారు. క్యూఐబీ విభాగంలో 60 శాతం షేర్లను యాంకర్‌ ఇన్వెస్టర్ల కోసం అట్టేపెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని