LPG Cylinder Price: వాణిజ్య వంటగ్యాస్‌ మరింత ప్రియం.. సిలిండర్‌పై రూ.100 పెంపు

LPG Cylinder Price: నెలవారీ ధరల సవరణల్లో భాగంగా దేశీయ చమురు విక్రయ సంస్థలు వాణిజ్య సిలిండర్‌ ధరను పెంచాయి.

Updated : 01 Nov 2023 14:17 IST

దిల్లీ: దీపావళికి ముందు వాణిజ్య వంటగ్యాస్‌ సిలిండర్ల ధర పెరిగింది. 19 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ ధర (Commercial LPG cylinder Price) రూ.100కు పైగా ఎగబాకింది. అంతకుముందు ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో కలిపి దాదాపు రూ.250 మేర ధర తగ్గిన విషయం తెలిసిందే. అక్టోబర్‌లో రూ.200.. తాజాగా మరో రూ.100 పెంచడంతో తగ్గింపుతో లభించిన ఉపశమనం ఆవిరైంది. తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,833కు చేరింది. అంతకుముందు ఇది రూ.1,731గా ఉంది. చెన్నైలో రూ.1,999.50, కోల్‌కతాలో రూ.1,943, ముంబయిలో రూ.1,785.50కు చేరింది. కొత్త ధర నేటి నుంచే అమల్లోకి వస్తుందని చమురు సంస్థలు వెల్లడించాయి. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్‌ ధర మాత్రం మారలేదు. ఆగస్టు 30న వీటి ధర రూ.200 తగ్గిన విషయం తెలిసిందే.

విమాన ఇంధన ధర తగ్గింపు..

మరోవైపు విమాన ఇంధన ధరల (ATF Price)ను చమురు విక్రయ సంస్థలు తగ్గించాయి. ఒక్కో కిలోలీటరుపై రూ.6,854.25 కుదించింది. దీంతో దిల్లీలో కిలోలీటర్‌ ఏటీఎఫ్‌ ధర రూ.1,11,344.92కు చేరుకుంది. జెట్‌ ఇంధనం ధర వరుసగా గత నాలుగు నెలల పాటు పెరిగింది. మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మాత్రం గత 19 నెలలుగా ఎటువంటి మార్పు లేదు. వంటగ్యాస్‌తోపాటు ఏటీఎఫ్‌ ధరలను ప్రభుత్వరంగ సంస్థలైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లు ప్రతినెలా సవరిస్తుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని