Ukraine Crisis: మన మదుపర్లు ఉక్రెయిన్‌ జీడీపీ కంటే ఎక్కువే కోల్పోయారు!

ఉక్రెయిన్‌లో రష్యా విసురుతున్న బాంబుల ప్రభావం నేరుగా మన స్టాక్‌ మార్కెట్లపై పడుతోంది....

Published : 04 Mar 2022 18:30 IST

దిల్లీ: ఉక్రెయిన్‌లో రష్యా విసురుతున్న బాంబుల ప్రభావం నేరుగా మన స్టాక్‌ మార్కెట్లపై పడుతోంది. పుతిన్ సేనల దాడి ప్రారంభమైనప్పటి నుంచి మన సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. దీంతో మదుపర్ల సంపద గత కొన్ని రోజుల్లో భారీగా ఆవిరైంది.

గురువారం ఉక్రెయిన్‌లో జాపోరిషియా అనే అణు విద్యుత్తు కేంద్రంపై జరిగిన దాడులు ఈరోజు సూచీల్లో ప్రకంపనలు సృష్టించాయనే చెప్పాలి. ఈరోజు సెన్సెక్స్‌ 750 పాయింట్లకు పైగా నష్టపోయింది. దీంతో మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల విలువ శుక్రవారం ఒక్కరోజే 66 బిలియన్‌ డాలర్ల (రూ.5లక్షల కోట్లు) మేర తుడిచిపెట్టుకుపోయి రూ.246 లక్షల కోట్లకు చేరింది.

ఫిబ్రవరి 15న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి సిద్ధమైనట్లు సంకేతాలు వెలువడినప్పటి నుంచి నుంచి సెన్సెక్స్ ఏకంగా 4000 పాయింట్ల కిందకు వచ్చింది. అంటే మదుపర్ల సంపద దాదాపు 197 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.15.01 లక్షల కోట్లు) వరకు ఆవిరైంది. దలాల్‌ స్ట్రీట్‌లో మదుపర్లు కోల్పోయిన ఈ సంపద విలువ ఉక్రెయిన్‌ జీడీపీ కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఐఎంఎఫ్‌ గణాంకాల ప్రకారం 2021లో ఉక్రెయిన్‌ జీడీపీ 181.03 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.13.94 లక్షల కోట్లు).

మరోవైపు ముడిచమురు ధరలు సైతం భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచదేశాలకు ప్రధానంగా ముడిచమురును సరఫరా చేస్తున్న దేశాల్లో రష్యా ఒకటి. మరోవైపు ఐరోపాకు రష్యా నుంచి ఉక్రెయిన్‌ మీదుగా సహజవాయువు సరఫరా అవుతోంది. దాడి నేపథ్యంలో ఈ రెండింటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతాయనే అనుమానాలు చమురు ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ఓ దశలో దాదాపు బ్యారెల్‌ చమురు ధర 120 డాలర్లకు చేరింది. ప్రస్తుతం 110 డాలర్ల వద్ద కదలాడుతోంది.. దీంతో ద్రవ్యోల్బణ భయాలు సైతం పెరుగుతున్నాయి. మరోవైపు రూపాయి విలువ సైతం భారీగా పతనమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని