UPI payments: సురక్షితమైన యూపీఐ చెల్లింపులకు కొన్ని టిప్స్‌!

చెల్లింపులను డిజిటలైజ్‌ చేసిన తర్వాత అనేక రంగాలు కొత్తరూపును సంతరించుకున్నాయి. ముఖ్యంగా కొవిడ్‌ మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత ‘యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI)’ ద్వారా చేసే లావాదేవీలు ఊపందుకున్నాయి....

Updated : 18 Mar 2022 14:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చెల్లింపులను డిజిటలైజ్‌ చేసిన తర్వాత అనేక రంగాలు కొత్తరూపును సంతరించుకున్నాయి. ముఖ్యంగా కొవిడ్‌ మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత ‘యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI)’ ద్వారా చేసే లావాదేవీలు ఊపందుకున్నాయి. ఈ మాధ్యమం ద్వారా చెల్లింపులు చాలా సులభం. సురక్షితమైనవి. అయినప్పటికీ.. చాలా మందికి ఇంకా యూపీఐ భద్రతపై అనుమానాలు ఉన్నాయి. కాబట్టి యూపీఐ ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం చాలా ముఖ్యం.

ఏ రకమైన లావాదేవీ ముందే ధ్రువీకరించుకోవాలి?

‘పేమెంట్‌ రిక్వెస్ట్’‌, ‘కలెక్ట్‌ రిక్వెస్ట్‌’.. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడంలో చాలా మంది తికమకపడుతుంటారు. కొత్తగా యూపీఐని వినియోగించేవారైతే ఈ విషయంలో పెద్ద గందరగోళమే ఎదుర్కొంటారని చెప్పాలి. నగదు రిసీవ్‌ చేసుకోవడానికి బదులు.. చెల్లింపు చేసి బోల్తా పడుతుంటారు. దీని నుంచి బయటపడడానికి కొన్ని మార్గాలున్నాయి.

* యూపీఐ ద్వారా డబ్బులు పొందడానికి పిన్‌ ఎంటర్‌ చేయాల్సిన అవసరం ఉండదు.

* ఏ రకమైన లావాదేవీయో ముందే ధ్రువీకరించుకోవాలి. అలాగే ఎవరికి చెల్లిస్తున్నారో వారి వివరాలను ముందే చెక్‌ చేసుకోవాలి.

* ఒకవేళ అవతలి వ్యక్తి లేదా లావాదేవీ మొత్తంపై ఏమాత్రం అనుమానం వచ్చినా.. వెంటనే అభ్యర్థనను తిరస్కరించాలి. మరోసారి చెల్లింపు అభ్యర్థనను పంపమని కోరాలి.

ప్రైవేటు విండోను ఉపయోగించండి..

అనుమానిత యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొద్దు. యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న విశ్వసనీయ యాప్‌లలో మాత్రమే డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించాలి. https://తో ప్రారంభమయ్యే వెబ్‌సైట్‌లను మాత్రమే వినియోగించాలి. లావాదేవీ పూర్తయిన తర్వాత లాగౌట్‌ చేయడం మరిచిపోవద్దు.

యూపీఐ యాప్‌ను అప్‌డేట్‌గా ఉంచుకోవాలి..

యూపీఐ యాప్‌ అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. భద్రతాపరమైన లోపాల్ని సరిచేసి కూడా అప్‌డేట్స్‌ని అందిస్తుంటారు.

పాస్‌వర్డ్‌ల షేరింగ్‌ వద్దు..

ఎట్టిపరిస్థితుల్లోనూ పాస్‌వర్డ్‌లను ఇతరులతో పంచుకోవద్దు. అలాగే తరచూ పిన్‌ను మార్చుకోవడం ఉత్తమం. తద్వారా సైబర్‌ మోసాల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే ఎవరైనా యూపీఐ పిన్‌ కానీ, ఐడీ కానీ అడిగితే చెప్పొద్దు. వీలున్న చోట ‘వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌’ ఆప్షన్‌ ద్వారా చెల్లింపులు చేస్తే మరింత సురక్షితం.

నకిలీ యాప్‌లను ఇలా గుర్తించండి..

ప్లేస్టోర్‌ లేదా యాప్‌ స్టోర్లలో అనేక నకిలీ యాప్‌లూ ఉంటున్నాయి. అయితే, వీటిని గుర్తించడం అంత కష్టమేం కాదు. నెగెటివ్‌ రివ్యూలు, వెరిఫైడ్‌ బ్యాడ్జెస్‌ లేకపోవడం, తక్కువ డౌన్‌లోడ్లు.. ఇలాంటి అంశాలను పరిశీలించి నకిలీ యాప్‌ల నుంచి దూరంగా ఉండొచ్చు. ప్లేస్టోర్లలో వెరిఫైడ్‌ అని ఉన్న యాప్‌లను మాత్రమే వినియోగించడం సురక్షితం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని