సిగ్నల్‌, టెలిగ్రాం డౌన్‌లోడ్లు ఎన్ని పెరిగాయంటే..!

మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ వ్యక్తిగత గోప్యతా విధానం వివాదంగా మారడం మిగతా యాప్‌లకు సంబరంగా మారింది. గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ స్టోర్‌లో సిగ్నల్‌, టెలిగ్రాం యాప్‌ల...

Published : 14 Jan 2021 18:40 IST

ఓక్లాండ్‌: మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ వ్యక్తిగత గోప్యతా విధానం వివాదంగా మారడం మిగతా యాప్‌లకు సంబరంగా మారింది. గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ స్టోర్‌లో సిగ్నల్‌, టెలిగ్రాం యాప్‌ల డౌన్‌లోడ్లు విపరీతంగా పెరిగాయి. జనవరి 5 నుంచి 12 మధ్య గూగుల్‌, యాపిల్‌ స్టోర్ల నుంచి సిగ్నల్‌ యాప్‌ను 17.8 మిలియన్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని మొబైల్‌ యాప్‌ అనలిటిక్స్‌ సంస్థ సెన్సర్‌ టవర్‌ తెలిపింది. అంతకు ముందు వారంలోని 2,85,000 డౌన్‌లోడ్లతో పోలిస్తే ఇది 61% పెరుగుదల కావడం గమనార్హం.

సిగ్నల్‌ తరహాలోనే టెలిగ్రాం యాప్‌కూ గిరాకీ పెరిగింది. జనవరి 5 నుంచి 12 మధ్య 15.7 మిలియన్ల డౌన్‌లోడ్లు నమోదయ్యాయి. అంతకుముందు వారం 7.7 మిలియన్లతో పోలిస్తే ఇది రెట్టింపు కావడం గమనార్హం. ఇక వివాదానికి కేంద్ర బిందువైన వాట్సాప్‌కు‌ అంతకు ముందువారం 12.7 మిలియన్ల డౌన్‌లోడ్లు ఉండగా జనవరి 5-12 మధ్య 10.6 మిలియన్లకు తగ్గాయి. ఇదంతా చూస్తుంటే సంప్రదాయ సోషల్‌ మీడియా వినియోగదారులు ఫేస్‌బుక్‌, ట్విటర్‌కు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నట్టు కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

తాము తీసుకువచ్చిన కొత్త ప్రైవసీ పాలసీపై పలు అనుమానాలు వ్యక్తం అవుతోన్న తరుణంలో మంగళవారం మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరోసారి స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిన సందేశాల గోప్యతను తాజాగా తీసుకువచ్చిన మార్పులు ఏ విధంగానూ ప్రభావితం చేయవని వివరించింది. కొత్త పాలసీపై చక్కర్లు కొడుతున్న వదంతులను పరిష్కరించాలని భావిస్తున్నామని వెల్లడించింది. అలాగే ఎప్పటిలాగే వినియోగదారుల సందేశాలు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్క్రిప్షన్‌తో భద్రంగా ఉంటాయని ట్విటర్ వేదికగా స్పష్టం చేసింది.

ఇవీ చదవండి

మీ గోప్యతకు ఏ భంగం వాటిల్లదు: వాట్సాప్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని