Crime news: 133 ల్యాప్‌టాప్‌లు, 19 ఫోన్లు చోరీ.. మాజీ ఐటీ ఉద్యోగి అరెస్టు!

ఐటీ ఉద్యోగులు నివసించే ప్రాంతాలే లక్ష్యంగా పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్‌ పరికరాలను చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Published : 07 Nov 2023 16:29 IST

బెంగళూరు:  ప్రముఖ ఐటీ నగరం బెంగళూరులో ఐటీ ఉద్యోగులు ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని చోరీకి పాల్పడుతున్న నిందితుడు పోలీసులకు చిక్కాడు. ఐటీ ఉద్యోగుల పేయింగ్ గెస్ట్ వసతి గృహాల నుంచి  133 ల్యాప్‌టాప్‌లు, 19 మొబైల్ ఫోన్లు, నాలుగు ట్యాబ్‌లను చోరీ చేసిన కేసులో ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కంప్యూటర్‌ సైన్స్‌ గ్రాడ్యుయేట్‌ అని.. గతంలో ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసినట్టు పోలీసులు గుర్తించారు. చోరీ చేసిన ఈ ఎలక్ట్రానిక్‌ పరికరాల విలువ దాదాపు రూ.75లక్షలు ఉంటుందని బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌ బి.దయానంద వెల్లడించారు. గతంలో ఓ ఐటీ కంపెనీలో పనిచేసిన ఈ నిందితుడు.. పేయింగ్‌ గెస్ట్‌, బ్యాచిలర్‌ వసతి గృహాలకు తరచూ వెళ్లడం.. అక్కడి నుంచి ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్లు మాయం చేసేవాడని తెలిపారు. అతడు చోరీ చేసిన ఎలక్ట్రానిక్‌ పరికరాలను తీసుకెళ్లి మార్కెట్లో విక్రయించిన మరో ఇద్దరిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు దయానంద తెలిపారు. ఆ ముగ్గురూ ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నట్లు తెలిపారు. సెంట్రల్‌ డివిజన్‌లో ఎనిమిది కేసులు గుర్తించామని.. మిగతా పోలీస్‌ స్టేషన్‌లలో ఈ తరహా కేసులను పరిశీలిస్తున్నట్లు దయానంద తెలిపారు. 

మహిళా వాలంటీరుపై కీచకపర్వం!

మరోవైపు, బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బెట్టింగ్‌ రాకెట్‌ను ఛేదించారు. 11 చోట్ల దాడులు చేసి 13 మందిని అరెస్టు చేశారని దయానంద తెలిపారు. ఈ వ్యవహారంలో 11 కేసులు నమోదు చేసి.. నిందితుల నుంచి రూ.10లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని