Bengaluru: గోనె సంచిలో మృతదేహం.. అత్యంత అరుదైన రీతిలో మృతి

ఆయనో వృద్ధుడు.. నిర్జన ప్రదేశంలో ఆయన మృతదేహం దొరకడంతో హత్య కావచ్చనుకున్నారు పోలీసులు.. లోతుగా దర్యాప్తు జరపగా అత్యంత అరుదైన రీతిలో ఆయన కన్నుమూసినట్లు తేలింది.

Updated : 26 Nov 2022 08:40 IST

బెంగళూరు: ఆయనో వృద్ధుడు.. నిర్జన ప్రదేశంలో ఆయన మృతదేహం దొరకడంతో హత్య కావచ్చనుకున్నారు పోలీసులు.. లోతుగా దర్యాప్తు జరపగా అత్యంత అరుదైన రీతిలో ఆయన కన్నుమూసినట్లు తేలింది. పుట్టేనహళ్లి పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరు జేపీనగర ప్రాంతంలో ఈ నెల 18న గోనె సంచిలో మూటకట్టి ఉన్న ఒక వృద్ధుడి మృతదేహం లభించింది. ఆరా తీస్తే ఆయన పేరు బాలసుబ్రహ్మణియన్‌ (67) అని తెలిసింది. వంటిపై గాయాలు లేకపోవడంతో ఎలా చనిపోయారో అర్థం కాలేదు. ప్రత్యర్థులు ఎవరూ లేరని తేలింది. పోలీసులు పట్టువదలకుండా దర్యాప్తు జరపగా అనూహ్యమైన కారణాలు వెలుగుచూశాయి. బాలసుబ్రహ్మణియన్‌ ఈ నెల 16న సాయంత్రం తన మనవడిని బ్యాడ్మింటన్‌ తరగతికి తీసుకు వెళ్లారు. సాయంత్రం ఫోన్‌ చేసి పనిపై బయటకు వెళుతున్నానని, చిన్నారిని ఇంటికి తీసుకు వెళ్లాలని ఇంట్లో వారికి ఫోన్‌ చేసి చెప్పారు. తర్వాత ఆయన ఆచూకీ తెలీలేదు. కుమారుడు సోమసుందర్‌ ఫోన్‌ చేస్తే స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 18న మృతదేహం దొరకడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆయన కాల్‌డేటాను పరిశీలించగా, చివరిగా తన ఇంట్లో పని చేస్తున్న మహిళతో మాట్లాడినట్లు తెలిసింది. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, తనకూ ఆయనకు వివాహేతర సంబంధం ఉందని అంగీకరించింది. తన భర్తకూ ఆ విషయం తెలుసని చెప్పింది. తనతో సన్నిహితంగా ఉన్న సమయంలో హఠాత్తుగా ఆయన మరణించడంతో కంగారుపడిన ఆమె సోదరుడికి, భర్తకు ఫోన్‌ చేసి చెప్పింది. చివరకు మృతదేహాన్ని గోనెసంచిలో ఉంచి, దుప్పటిలో చుట్టి నిర్జన ప్రదేశంలో పడేసినట్లు వెల్లడించింది. విచారణ జరిపిన పోలీసులు ఆయన మృతికి గుండెపోటే కారణమని గుర్తించారు. దర్యాప్తు కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని