కొడుకును కాపాడబోయి.. తల్లి, మరో ఇద్దరు మహిళల మృతి

ఓ బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో జారిపడ్డాడు. అతన్ని కాపాడేందుకు ఒకరి తర్వాత ఒకరు వెళ్లి ముగ్గురు మహిళలు మృత్యువాతపడ్డారు.

Updated : 26 Sep 2023 09:56 IST

చెరువులో ఆడుకుంటూ బాలుడి గల్లంతు
ప్రాణాలతో బయటపడ్డ మరో మహిళ
మెదక్‌ జిల్లా రంగాయపల్లిలో విషాదం

మనోహరాబాద్‌, తూప్రాన్‌, న్యూస్‌టుడే: ఓ బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో జారిపడ్డాడు. అతన్ని కాపాడేందుకు ఒకరి తర్వాత ఒకరు వెళ్లి ముగ్గురు మహిళలు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం రంగాయపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాలుడి ఆచూకీ లభించలేదు. మనోహరాబాద్‌(Manoharabad) ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగాయపల్లికి చెందిన ఫిరంగి చంద్రయ్య ఇంట్లో ఆదివారం బోనాల పండగ నిర్వహించారు. ఇందుకు సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం అంబర్‌పేటకు చెందిన తన బావమరుదులు దొడ్డు యాదగిరి, దొడ్డు శ్రీకాంత్‌ల కుటుంబాన్ని ఆహ్వానించారు. సోమవారం యాదగిరి భార్య బాలమణి(35), వీరి కుమారుడు చరణ్‌ (10), శ్రీకాంత్‌ భార్య లక్ష్మి (30), ఫిరంగి చంద్రయ్య భార్య లక్ష్మి, వీరి కుమార్తె లావణ్య(18)లు దుస్తులు ఉతికేందుకని గ్రామ శివారులోని చెరువు వద్దకు వెళ్లారు.

ఈ క్రమంలో చరణ్‌ నీటిలో దిగి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో మునిగిపోయాడు. గమనించిన బాలుడి తల్లి బాలమణి కుమారుడిని కాపాడేందుకు చెరువులో దూకి నీటిలో మునిగారు. వారిద్దరిని రక్షించేందుకు దొడ్డు లక్ష్మి, లావణ్య ప్రయత్నించగా.. వారు సైతం నీటిలో మునిగిపోయారు. అక్కడే ఉన్న చంద్రయ్య భార్య ఫిరంగి లక్ష్మి వారిని కాపాడేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. వీరి అరుపులు విన్న స్థానికులు గమనించి ఫిరంగి లక్ష్మిని బయటకు తీయడంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని దొడ్డు లక్ష్మి, దొడ్డు బాలమణి, ఫిరంగి లావణ్య మృతదేహాలను బయటకు తీశారు. చరణ్‌ కోసం గాలిస్తున్నారు. బోనాల పండగ వేళ్ల ముగ్గురు మృత్యువాతపడటంతో ఆ కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలాన్ని తూప్రాన్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డి, డీఎస్పీ యాదగిరి, సీఐ శ్రీధర్‌ పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని