Kothagudem: డ్రైనేజీలో జారిపడి మహిళా కానిస్టేబుల్‌ మృతి

మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో బందోబస్తుకు వెళ్లిన ఓ మహిళా హెడ్‌కానిస్టేబుల్‌ మురుగు కాలువ(డ్రైనేజీ)లో గల్లంతై మృత్యువాతపడ్డారు.

Updated : 01 Oct 2023 07:24 IST

మంత్రి పర్యటన బందోబస్తు నేపథ్యంలో ఘటన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం

కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్‌టుడే: మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో బందోబస్తుకు వెళ్లిన ఓ మహిళా హెడ్‌కానిస్టేబుల్‌ మురుగు కాలువ(డ్రైనేజీ)లో గల్లంతై మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం సారథినగర్‌కు చెందిన రూపన శ్రీదేవి (49) కొత్తగూడెంలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో శనివారం ఉదయం శ్రీదేవి భద్రాచలంలో బందోబస్తుకు వెళ్లారు. ఆలయ అన్నదాన సత్రం వద్ద విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో ఆ ప్రాంతాన్ని వరద చుట్టుముట్టింది. వర్షంతో మంత్రి పర్యటన రద్దయింది.

ఈ క్రమంలో సత్రంలోకి వెళ్తున్న మహిళా కానిస్టేబుల్‌ మధ్యలోనున్న మురుగు కాలువలో ప్రమాదవశాత్తు జారిపడ్డారు. అక్కడే ఉన్న పంచాయతీ కార్మికుడు సునీల్‌.. ఆమె చేయి పట్టుకుని బయటకులాగే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే వర్షపు నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కాలువ ప్రవాహంలో కొట్టుకుపోయారు. అనంతరం సమీప గోదావరి కరకట్ట స్లూయిస్‌ పైపుల వద్ద శ్రీదేవి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఎన్డీఆర్‌ఎఫ్‌ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. 1995వ బ్యాచ్‌కు చెందిన శ్రీదేవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు స్టేషన్లలో విధులు నిర్వర్తించారు. ఆమె భర్త రామారావు జిల్లా కేంద్రంలో స్పెషల్‌ పార్టీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. బందోబస్తు విధులకు వెళ్లిన కానిస్టేబుల్‌ మృత్యువాత పడటంతో స్థానికంగా విషాదం నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు