Nizamabad: మాల్‌లో ఫ్రిజ్‌ తెరవబోయి విద్యుదాఘాతంతో చిన్నారి మృతి

ఐస్‌క్రీం కావాలని మారాం చేసి తండ్రిని షాపింగ్‌ మాల్‌కు తీసుకెళ్లిన చిన్నారి అక్కడి ఫ్రిజ్‌ను తాకి విద్యుదాఘాతంతో మరణించిన విషాదకర సంఘటన నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌లో సోమవారం చోటు చేసుకుంది.

Updated : 03 Oct 2023 09:01 IST

ఆర్మూర్‌, న్యూస్‌టుడే: ఐస్‌క్రీం కావాలని మారాం చేసి తండ్రిని షాపింగ్‌ మాల్‌కు తీసుకెళ్లిన చిన్నారి అక్కడి ఫ్రిజ్‌ను తాకి విద్యుదాఘాతంతో మరణించిన విషాదకర సంఘటన నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌లో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై రాహుల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్‌ నియోజకవర్గం నవీపేటకు చెందిన గూడురు రాజశేఖర్‌ ఆదివారం తన కుటుంబంతో కలిసి నందిపేట్‌లోని అత్తారింటికి వచ్చారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు తిరిగి ఊరికెళ్తుండగా.. కుమార్తె రిషిత(4) ఐస్‌క్రీం కావాలని కోరింది. దీంతో నందిపేట్‌లోని ఎన్‌మార్ట్‌ మాల్‌కు తీసుకెళ్లారు. తండ్రి ఒక ఫ్రిజ్‌లో వస్తువులు చూస్తుండగా.. పక్కనున్న మరో ఫ్రిజ్‌ను తెరిచేందుకు రిషిత దాని డోర్‌ను పట్టుకుంది. విద్యుదాఘాతానికి గురై అలానే బిగుసుకుపోయింది. కొద్దిసేపటికి గమనించిన తండ్రి హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధరించారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే పసిపాప బలైందని కుటుంబసభ్యులు చిన్నారి మృతదేహంతో మాల్‌ ఎదుట ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని