CM Jagan: జగన్‌పై నమ్మకమే మరణశాసనం అయింది

సీఎం జగన్‌ మీద ఉన్న పిచ్చి అభిమానమే తన పాలిట మరణ శాసనం అయ్యిందంటూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాసిన లేఖ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

Updated : 11 Dec 2023 09:50 IST

ఆయన మాట తప్పరని నమ్మి మోసపోయాం
సీపీఎస్‌ రద్దు హామీ నెరవేర్చలేదు
తన చావుకు సీఎం కారణమంటూ ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నం

ఉరవకొండ, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ (CM Jagan) మీద ఉన్న పిచ్చి అభిమానమే తన పాలిట మరణ శాసనం అయ్యిందంటూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాసిన లేఖ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితుడు మల్లేశ్‌ లేఖలో రాసిన వివరాలిలా ఉన్నాయి. ఉరవకొండ మండలం చిన్నముష్టూరుకు చెందిన మల్లేశ్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఎన్నికలకు ముందు సీపీఎస్‌ రద్దు చేస్తానని జగన్‌ పదే పదే చెప్పిన మాటలను ఆయన బలంగా నమ్మారు. ఈ నేపథ్యంలో సీపీఎస్‌ను ఈ ఏడాది, వచ్చే ఏడాది.. ఇలా ఎప్పటికప్పుడు రద్దు చేస్తారంటూ పందేలు కాస్తూ వచ్చారు. అది జరగకపోవడంతో రూ.లక్షలు పోగొట్టుకున్నారు. కుటుంబ పోషణకు, రుణాలను చెల్లించడానికి చిట్టీలు వేయడంతో పాటు బ్యాంక్‌ల్లో, యాప్‌ల్లో రుణాలు తీసుకున్నారు. సీపీఎస్‌ రద్దు కాకపోవడం, నెలనెలా వేతనాలు సక్రమంగా అందకపోవడంతో కుటుంబపోషణ భారమైంది. రుణాలు పేరుకుపోవడంతో తన చావుకు సీఎం జగనే కారణమంటూ ఆదివారం ఉదయం 5 పేజీల లేఖను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసి ఫోన్‌ స్విచాఫ్‌ చేసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు, మిత్రులు ఆయన ఆచూకీ కోసం ప్రయత్నించారు. పెన్నఅహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో విషం తాగి అపస్మారక స్థితిలో ఉండగా గుర్తించి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి, తర్వాత అనంతపురం తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.

మల్లేశ్‌ తన లేఖలో పేర్కొన్న అంశాలివీ..

‘ఉపాధ్యాయులపై సీˆఎం జగన్‌ కక్ష పెంచుకుని రకరకాలు వేధింపులకు గురి చేస్తున్నారు. వారికి ఇచ్చిన ప్రతి మాటనూ తప్పుతున్నారు. ఉద్యోగులను వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎప్పుడూ అణగదొక్కలేదు. జగన్‌ మాత్రం ఉద్యోగులపై ఉక్కుపాదం మోపుతున్నారు. మేం గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. మీరిచ్చిన హమీలనే నెరవేర్చండని అడుగుతున్నాం. ఆర్థికంగా చితికిపోయిన నేను ఇన్ని సమస్యల్లో బతకలేకపోతున్నాను. కనీసం ప్రతి నెలా 5 లోపు వేతనాలు ఇస్తే బ్యాంకు రుణాల వాయిదాలు చెల్లించడానికి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత వస్తే వాయిదాలు కట్టలేక ఇబ్బంది పడుతున్నాం. చేసిన పనికి వేతనాలనైనా సక్రమంగా ఇవ్వండి. మా జీవితాలతో ఆడుకోకుండా మా ప్రాణాలు కాపాడండి సీఎం గారూ..

చంద్రబాబే ఉత్తమమని నిరూపిస్తున్నారు..

పీఆర్‌సీ విషయంలో మమ్మల్ని చాలా మోసం చేశారు. ఐఆర్‌ 27 శాతం ఇచ్చినట్లే ఇచ్చి పీఆర్‌సీ నెపంతో వెనక్కి లాగేసుకున్నారు. మాజీ సీఎం చంద్రబాబు గతంలో 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. మీరు అంతకు మించి ఇస్తారనుకుంటే 23 శాతమే ఇచ్చారు. రెండు డీఏలు పెండింగు పెట్టినందుకే చంద్రబాబును కాదనుకుని చాలా పెద్ద తప్పు చేశాం. ప్రస్తుతం లెంపలేసుకుంటున్నాం. ప్రతి విషయంలోనూ మీ కంటే చంద్రబాబు ఉత్తమమని మీరే రుజువు చేస్తున్నారు. ఆయన హయాంలో ప్రతి నెలా 1న కచ్చితంగా వేతనాలు వేసేవారు. మీరు ఎందుకు వేయలేకపోతున్నారు? ఉద్యోగులారా ఇది ఎన్నికల సమయం. ఐఆర్‌ లాంటివి ఇచ్చి, ఆశ చూపించి, ఎన్నికల్లో గెలవాలనుకుంటారు. గెలిపించారో.. ఇక అంతే సంగతులు! బాగా ఆలోచించి ఓట్లు వేయండి. నాలాగా ఏ ఉద్యోగీ చనిపోకుండా చూడండి’ అని మల్లేశ్‌ పేర్కొన్నారు. సీపీఎస్‌ రద్దు, ఓపీఎస్‌ అమలు, ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు తన అంతిమ కోరికలని లేఖలో రాశారు.


ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నంపై లోకేశ్‌ దిగ్భ్రాంతి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీపీఎస్‌ను రద్దు చేయలేదన్న ఆవేదనతో ఉపాధ్యాయుడు మల్లేశ్‌ ఆత్మహత్యకు యత్నించడంపై తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘జగన్‌ మాటలు నమ్మి మోసపోయిన అన్ని వర్గాలు ఉద్యమించాలి. రాబోయే ఎన్నికల్లో వైకాపాకు బుద్ధి చెప్పాలి’ అని ఎక్స్‌లో లోకేశ్‌ పోస్ట్‌ చేశారు.


కసితో పోరాడదాం.. ఆత్మహత్యలు పరిష్కారం కాదు: యూటీఎఫ్‌

ఈనాడు-అమరావతి: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పోరాటం ద్వారా పరిష్కరించుకోవాలని.. ఆత్మహత్యల ద్వారా పరిష్కారం కావని.. యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కేఎస్‌ఎస్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం రెట్టింపు ఉత్సాహంతో, కసితో పోరాటానికి సిద్ధం కావాలని ఒక ప్రకటనలో కోరారు. జీతాల చెల్లింపులో జాప్యం, పాతపెన్షన్‌ హామీని ముఖ్యమంత్రి జగన్‌ అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉపాధ్యాయుడు మల్లేశ్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంపై వారు దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. ఎంతో మనోవేదన కలిగితే తప్ప.. ఆత్మహత్యాయత్నం చేయరని.. ఇలా ప్రేరేపించిన ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని