Crime News: వెంటే వచ్చిన కుమార్తె అదృశ్యం.. కొన్ని గంటల తర్వాత ఇటుక బట్టీలో కాలుతూ..!

Rajasthan: పని నిమిత్తం తల్లి వెంట వెళ్లిన ఓ బాలిక అదృశ్యమైంది. కొద్ది గంటల తర్వాత ఇటుక బట్టీలోకాలుతున్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించడంతో ఆమె హత్య విషయం వెలుగులోకి వచ్చింది. 

Updated : 03 Aug 2023 14:15 IST

జైపుర్‌: రాజస్థాన్‌(Rajasthan)లో గురువారం ఉదయం దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటుక బట్టీ వద్ద 14 ఏళ్ల బాలికకు చెందిన కాలిన శరీరం బయటపడటంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే...?

బుధవారం భిల్వారా గ్రామానికి మృతురాలు తన తల్లితో కలిసి మేకలు కాయడానికి ఇంటి నుంచి బయలుదేరింది. కొద్దిసేపటి తర్వాత తన తల్లికి కనిపించకుండా పోయింది. ఎంతసేపటికి ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆమె కోసం రాత్రంతా గాలించారు. ఈ రోజు తెల్లవారుజామున ఆమె ఇంటికి సమీపంలోని ఇటుక బట్టీ(Brick Kiln)వద్ద పోలీసులు కాలుతున్న దేహాన్ని, వెండిపట్టీ, చెప్పులను గుర్తించారు. వాటి ఆధారంగా ఆ మృతదేహం బాలికదే అని భావిస్తున్నారు.

హత్యకుముందు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే ఘటనా స్థలంలోని ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే న్యాయం జరగాలని డిమాండ్‌ చేశారు. తమ ఫిర్యాదుపై పోలీసులు వెంటనే స్పందించలేదని, ఐడీ, జనన ధ్రువీకరణ పత్రం అడిగారని ఆరోపించారు. 

తండ్రి కళ్లెదుటే.. చక్రాల కింద నలిగి..

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన కాంగ్రెస్(Congress) ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసింది. మహిళలు, బాలికలపై జరుగుతున్న ఘోరాలపై విపక్ష భాజపా.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తోంది. కానీ, ఈ విమర్శలను ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌(Ashok Gehlot) తోసిపుచ్చుతున్నారు. భాజపా(BJP) పాలిత రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లోనే స్త్రీలపై నేరాలు పెరిగాయని, అస్సాం, దిల్లీ, హరియాణా ముందు వరుసలో ఉన్నాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని