logo
Published : 06 Aug 2022 04:59 IST

ఎస్సై పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించం

 ‘ఈనాడు’తో ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి

ఈటీవీ- ఆదిలాబాద్‌

పోలీసు ఉద్యోగం అంటేనే ఓ క్రేజీ. అందులో ఎస్‌ఐ అంటే మరీ ప్రాధాన్యంతో కూడుకున్నది. ఆదివారం జరగనున్న ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు ఆ శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్షకు పోలీసు యంత్రాంగం బందోబస్తును పర్యవేక్షిస్తోంది. జిల్లాలో పరీక్ష నిర్వహణపై ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డితో ‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖీ.

ఈనాడు: జిల్లాలో ఎంతమంది పరీక్షకు హాజరవుతున్నారు. ఎన్ని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.?

ఎస్పీ: జిల్లా వ్యాప్తంగా 3355 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కేంద్రాలుగా ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఒన్‌ టౌన్‌ పోలీసుస్టేషన్‌ ఎదురుగా), ప్రభుత్వ డిగ్రీ కళాశాల (శాంతినగర్‌), ఆదిత్య జూనియర్‌ కళాశాల (విద్యానగర్‌), నలందా కళాశాల(మావల), విద్యార్థి కళాశాల (రవీంద్రనగర్‌), గౌతమీ డిగ్రీ కళాశాల, లిటిల్‌ ఫ్లవర్‌ పాఠశాల, సీబీఆర్‌ పాఠశాల(శాంతినగర్‌)లను ఎంపిక చేశాం. పరీక్ష నిర్వహణ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో జరుగుతుంది. మా శాఖ తరఫున బందోబస్తు ఉంటుంది. ఎక్కడా లోపాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

ఈనాడు: పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను ఎప్పుడు అనుమతిస్తారు. వెంట తీసుకెళ్లే వస్తువులపై ఏమైన నిషేధం ఉందా.?

ఎస్పీ: ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుంది. అభ్యర్థులను ఓ గంట ముందే అనుమతినిస్తాం. నిర్ణీత సమయం దాటాక ఒక నిమిషం ఆలస్యమైనా లోపలికి రానివ్వం. పెన్ను, హాల్‌ టిక్కెట్‌, ఒక ఫొటోను మినహాయిస్తే మిగతా ఏ వస్తువులను అనుమతించరు. వేలిముద్రల కోసం బయోమెట్రిక్‌ స్క్రీనింగ్‌ కారణంగా చేతులకు మెహెందీ, టాటూలు పెట్టుకోవద్దు. ప్యాడ్డు, గడియారాలు, సెల్‌ఫోన్లు, బ్యాగులు, నీళ్ల బాటిళ్లు సహా ఇతర వస్తువులేవీ తీసుకురావద్దు. కేంద్రాల వద్ద స్టోర్‌ రూంలు ఉండవు. కేంద్రాల్లోనే తాగునీటి సౌకర్యం కల్పిస్తాం. పరీక్ష ముగిశాక ఓఎంఆర్‌ షీటు తీసుకొని, ప్రశ్నపత్రాలతో అందరినీ ఒకేసారి బయటకు పంపిస్తాం.

ఈనాడు: అనుకోకుండా కేంద్రాలకు సమీపంలో ఎక్కడైనా ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తితే ఎలా.?

ఎస్పీ: అందుకే ఒక గంట ముందు నుంచే ఉదయం 9 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలనే నిబంధన ఉంది. మా శాఖ తరఫున ట్రాపిక్‌ జామ్‌ కాకుండా ముందస్తు చర్యలు చేపడతాం. ఊరేగింపులు, ధర్నాలు, ఆందోళనలు జరకుండా నియంత్రణ ఏర్పాట్లు చేశాం. పరీక్ష సమయం ముగిసే వరకు సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లను మూసేస్తాం. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు వీలుగా కేంద్రాలకు సమీపంలోని ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద లౌడ్‌స్పీకర్ల చప్పుడు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మా శాఖ తరఫున తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు అంకితభావంతో పరీక్షలకు హాజరు కావాలన్నదే మా సూచన.

ఈనాడు: ఒకవేళ చివరి నిమిషంలో హాల్‌ టిక్కెట్‌ డౌన్‌లోడ్‌ కాని అభ్యర్థులు వస్తే ఎలా.? పరీక్ష కేంద్రాలకు హడావుడి తలెత్తకుండా తీసుకుంటున్న జాగ్రత్తలేంటి?

ఎస్పీ: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ ఇప్పటికే హాల్‌ టిక్కెట్ల పంపిణీ పూర్తయింది. కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నోడల్‌ అధికారి అదనపు ఎస్పీ సమయ్‌ జాన్‌రావు పర్యవేక్షణ ఉంటుంది. ఒక్కో కేంద్రం వద్ద సీఐ, ఎస్‌ఐల ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఉంటుంది. పరీక్ష హాల్‌లోకి ఏమేం తీసుకురావాలో? తీసుకురావద్దో అనే అంశాలు హాల్‌ టిక్కెట్ల వెనక పొందుపరిచిన నిబంధనలకు అనుగుణంగానే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతినిస్తాం.

Read latest Adilabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని