logo

చనాఖా-కొరాట నీరు... చేనుకు ఎప్పుడు చేరు?

తెలంగాణ స్వరాష్ట్రమైన ఏడాదికే కేసీఆర్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చనాఖా-కొరాట బ్యారేజీ నుంచి ఈ రబీలో పంటకు సాగు నీళ్లు రావడం కష్టమే.

Published : 02 Dec 2022 03:05 IST

ఈటీవీ - ఆదిలాబాద్‌

తెలంగాణ స్వరాష్ట్రమైన ఏడాదికే కేసీఆర్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చనాఖా-కొరాట బ్యారేజీ నుంచి ఈ రబీలో పంటకు సాగు నీళ్లు రావడం కష్టమే. ప్రధాన కాలువ, బ్యారేజీని మినహాయిస్తే డిస్ట్రిబ్యూటర్లు, పిల్లకాలువల పని ఇంకా ప్రారంభమే కాలేదు. డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాలువలనిర్మాణానికి అవసరమైన దాదాపు వెయ్యి ఎకరాల భూసేకరణ పూర్తికాకపోవడం ప్రతిబంధకంగా మారింది. తక్షణం రూ.100 కోట్లకు పైగా నిధులు విడుదల చేస్తే తప్ప పనులు జరిగేలా కనిపించడం లేదు. బ్యారేజీ పనులను ఒప్పందం(అగ్రిమెంట్‌) ప్రకారం 2018లో పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులు చేజిక్కించుకున్న ప్రధాన గుత్తేదారు ఉమ్మడి జిల్లాలోని ఓ కీలక నేత బంధువు. దాంతో ఆయనపై అధికారుల ఒత్తిడి చేయకపోవడంతో ఆశించిన రీతిలో పనులు జరగలేదు. ఫలితంగా ప్రారంభంలో రూ.386 కోట్ల అంచనా వ్యయం ఏకంగా రూ.750 కోట్లకు చేరింది. ఇందులో రూ.150 కోట్ల విలువ చేసే ఆరు పంపులు, మరో రూ.60 కోట్ల విలువ చేసే సబ్‌స్టేషన్‌, మరో 13 శాతం జీఎస్‌టీ మినహా మిగిలినదంతా పనుల జాప్యం వల్లనే వ్యయం పెరిగింది. ఇటీవల బ్యారేజీ పనుల డిటెయిల్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌(డీపీఆర్‌)కు సాంకేతిక సలహా సంఘం ఆమోద ముద్ర లభించింది. దీనివల్ల భవిష్యత్తులో బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుందే తప్ప క్షేత్రస్థాయిలో జరిగే పనులతో పెద్దగా సంబంధమేమీ లేదు.


ఎత్తిపోసేనా?

పెన్‌గంగా బ్యారేజీలో బిగించిన ఈ మోటార్లు దుమ్ముగూడెం రిజర్వాయర్‌ కోసం 2005లో అప్పటి ప్రభుత్వం కొనుగోలు చేసినవి. అక్కడ సరిపోనందున ప్రత్యామ్నాయంగా చనాఖా-కొరాట బ్యారేజీకి మార్చారు. 17ఏళ్లపాటు మూలనపడి ఉన్న వాటిని ఇటీవలే బిగించినా డ్రైరన్‌, ట్రయల్‌ రన్‌ పూర్తి చేయాల్సి ఉంది. పిల్లకాలువలు పూర్తికానందున నీళ్లు ఎత్తిపోసే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ ఎత్తిపోస్తే ప్రధాన కాలువకు చివరన ఉన్న బేల మండలం చప్రాల వద్ద నీరు పొంగిపొర్లి అవతలవైపు ఉన్న చేలలోకి వృథాగా పోయే అవకాశం ఉంది. ఈ మోటార్లను ప్రస్తుతానికి నమూనాగా చూపించడమే తప్ప నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు.


హామీలకే పరిమితం

చనాఖా-కొరాట బ్యారేజీకి ప్రధానమైన కాలువలు రెండు. ఇందులో మొదటిది లోయర్‌ పెన్‌గంగా ప్రాజెక్టు(ఎల్‌పీపీ) కాలువ పొడవు 42 కి.మీ. దీని ద్వారా బేల, జైనథ్‌, ఆదిలాబాద్‌ మండలాల పరిధిలోని 37,500 ఎకరాలకు సాగు నీరందించాలనేది లక్ష్యం. ప్రధాన కాలువ నిర్మాణ పని 90 శాతం పూర్తయింది. దాదాపుగా 90 కి.మీ. పొడవున కొనసాగించాల్సిన పిల్ల కాలువలకు అవసరమైన 700 ఎకరాల భూసేకరణ జరగకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో ప్రధాన కాలువలకు నీళ్లు వదలడం ప్రశ్నార్థకంగా మారింది.

రెండో కాలువ చనాఖా-కొరాట బ్యారేజీ(సీకేబీ) కాలువ పొడవు 3.3 కి.మీల ద్వారా  భీంపూర్‌ మండలం పిప్పల్‌కోటిలో వెయ్యి ఎకరాల బ్యాలెన్సింగ్‌ నీటి కోసం వినియోగించాల్సి ఉంది. మండలంలో మరో 13,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. పిల్లకాలువల కోసం మరో 100 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. అంటే మొదటి కాలువ ఎల్‌పీపీ, రెండో కాలువ సీకేబీ ప్రధాన కాలువల నిర్మాణం 90 శాతం పూర్తయినా పిల్లకాలువల కోసం అవసరమైన 800 ఎకరాల భూసేకరణలో స్తబ్ధత నెలకొంది. భూసేకరణకు కలెక్టర్‌ నేతృత్వంలో రైతులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ముంపునకు గురయ్యే భూమికి ధర నిర్ణయించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని