logo

పంచాయతీలకు రూ. 33 కోట్లు మంజూరు

మావల మండల కేంద్రంలో సీసీ రోడ్లకు రూ. 10 లక్షలు మంజూరయ్యాయి. పాలకవర్గ అనుమతితో నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నారు.

Published : 02 Feb 2023 02:22 IST

సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి ‘ఉపాధి హామీ’ నిధులు
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ గ్రామీణం, మావల

మావల మండల కేంద్రంలో సీసీ రోడ్లకు రూ. 10 లక్షలు మంజూరయ్యాయి. పాలకవర్గ అనుమతితో నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నారు.


గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు, మురుగు కాలువలు మెరుగుపడనున్నాయి. ఉపాధిహామీ పథకం కింద మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు రూ.33.08 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పల్లె ప్రగతి, 15వ ఆర్థిక సంఘం నిధులు సరిపోక ఇబ్బందుల్లో ఉన్న పాలకవర్గాలకు తాజాగా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడం కొంత ఊరటనిచ్చింది. గతేడాది ఇదే పథకం కింద రూ.30 కోట్లకు సంబంధించి పనులు చేయగా రూ.18 కోట్ల బిల్లులు మాత్రమే చెల్లించారు. మరో రూ.12 కోట్లు రావాల్సి ఉంది. వడ్డీకి అప్పులు తెచ్చి పనులు చేసిన సర్పంచులు ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రెండు విడతలుగా 445 పనులు

ఉపాధి హామీ పథకంలో గ్రామాల్లో మురుగు కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణం నిమిత్తం ఏటా మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులను విడుదల చేస్తారు. కూలీల చెల్లింపులకు 40 శాతం, నిర్మాణ సామగ్రి వాటా కింద 60 శాతం నిధులను ఆయా పంచాయతీలకు కేటాయిస్తారు. సాధారణంగా ఈ పనులను స్థానిక ఎమ్మెల్యేల సూచనతో కలెక్టర్‌ ఛైర్మన్‌గా ఉన్న కమిటీ ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారు. మొదటి విడత కింద 179 పనులకు రూ.13.78 కోట్లు, రెండో విడత కింద 266 పనులకు రూ.20.30, మొత్తం 445 పనులకు గాను రూ.33.08 కోట్లు మంజూరయ్యాయి. పంచాయతీరాజ్‌ శాఖ ఇంజినీర్లు పనులను పర్యవేక్షించనున్నారు.

చేపట్టకపోతే వెనక్కి

పంచాయతీ పాలకవర్గం తీర్మానాన్ని అనుసరించి ఎక్కడ సీసీ రోడ్డు, మురుగు కాలువ నిర్మాణం చేపట్టాలో నిర్ణయించనున్నారు. నామినేషన్‌ పద్ధతిన పాలకవర్గం సూచించిన వ్యక్తి పనులు చేస్తే.. సర్పంచి పేరిట బిల్లులు విడుదలవుతాయి. గతంలో గడువు తక్కువగా ఉందని హడావుడిగా పనులు పూర్తి చేయడంతో కొన్నిచోట్ల నాణ్యత లోపించింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి రెండు నెలలే సమయం ఉండటంతో ఈలోగా పనులు చేయాలి. లేకపోతే నిధులు వెనక్కిమళ్లే ప్రమాదముంది. దీంతో త్వరగా తీర్మానం పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు.

మార్చి 25లోగా పూర్తి చేయాలి
మహావీర్‌, ఈఈ, పంచాయతీరాజ్‌

జిల్లాలో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి రెండు విడతలుగా రూ.33.08 కోట్లు మంజూరయ్యాయి. రెండో విడత కింద మంజూరైన రూ.20.30 కోట్లకు సంబంధించి పాలనాధికారి ఆమోదం తీసుకోవాల్సి ఉంది. మార్చి 25 లోగా పనులను పూర్తి చేయాలి. తర్వాత ఎంబీ రికార్డు తయారు చేసేందుకు అవకాశం ఉంటుంది. పనులు చేయకపోతే నిధులు వెనక్కి వెళ్లిపోతాయి.


ఆదిలాబాద్‌ గ్రామీణం మండలంలోని దిమ్మ పంచాయతీలో వర్షపు నీరు బయటకు రావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా రూ.5లక్షల మంజూరుతో సమస్య పరిష్కారం కానుంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని