logo

పెరిగిన సహకారం.. అన్నదాతపై మమకారం

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ జిల్లావాసుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఆదాయపన్ను మినహాయింపులు పెంపు, మధ్య తరగతి సొంతింటి కల నెరవేరేలా కేటాయింపులు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం, యువత ఉపాధికి చేసిన కేటాయింపులు ఆయా వర్గాలకు ఊరటనిచ్చాయి.

Published : 02 Feb 2023 02:29 IST

కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులపై ఆశలు
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పాలనాప్రాంగణం

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ జిల్లావాసుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఆదాయపన్ను మినహాయింపులు పెంపు, మధ్య తరగతి సొంతింటి కల నెరవేరేలా కేటాయింపులు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం, యువత ఉపాధికి చేసిన కేటాయింపులు ఆయా వర్గాలకు ఊరటనిచ్చాయి. కేంద్ర బడ్జెట్‌తో జిల్లావాసులకు కలిగే లబ్ధిపై ‘న్యూస్‌టుడే’ కథనం.


పంట రుణాల పెంపు

జిల్లా రైతులకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ అండగా నిలవనుంది. ఆహార ఉత్పత్తుల సేకరణ, కనీస మద్దతు ధరకు పెద్దపీట వేయడం కలిసొచ్చే అంశం. వ్యవసాయ రుణాలు అందించనున్నారు. పంట రుణ లక్ష్యాన్ని 11 శాతం పెంచనున్నారు. పశు పోషణ, మత్స్య, పాడి పరిశ్రమలకు రుణాలు ఇవ్వనున్నారు. చిన్న రైతులకు వడ్డీలేని రుణ పరిమితిని రూ.లక్ష నుంచి 1.6 లక్షలకు పెంచడం, ‘పీఎం-ప్రణామ్‌’ పథకం కింద రసాయన ఎరువుల వినియోగం తగ్గించి ప్రకృతి సాగుకు ప్రోత్సాహకాలు ఇస్తుండటం ఊరనిచ్చే అంశం. పది వేల బయో-ఇన్‌ఫుట్‌ రిసోర్స్‌సెంటర్లలో ఒకటి మనకు రావచ్చు. ఉద్యానవన పంటల సాగుకు ‘ఆత్మ నిర్భర్‌ హార్టికల్చర్‌ క్లీన్‌ ప్లాంట్‌’ పథకం మేలు చేకూర్చనుంది. పబ్లిక్‌ ప్రైవేటు భాగ్యస్వామ్యం ద్వారా చేపట్టనున్నారు.

వ్యవసాయ రుణ లక్ష్యం: రూ. 20 లక్షల కోట్లు
జిల్లాలో రైతులు : 1,46,591


కొంతే ఊరట..

కేంద్ర బడ్జెట్లో ఆదాయపన్ను మినహాయింపులు వేతన జీవులకు కొంతే ఊరటనిచ్చింది. కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల లోపు ఆదాయమున్న వారికి పన్ను పోటు లేదని ప్రకటించారు. గతంలో ఆరు స్లాబులు ఉంటే అయిదు స్లాబులకు కుదిస్తూ పన్ను మినహాయింపులు ఇచ్చారు.

పన్నుమినహాయింపు : రూ. 7 లక్షల వరకు
కొత్తవిధానం ఎంచుకుంటే లబ్ధి పొందే వేతనజీవులు : దాదాపు 15 వేల మంది


మత్స్య సంపద పెంపునకు చర్యలు

చేపలు పట్టుకుని జీవనం పొందే వారిని అన్ని విధాలుగా ఆదుకునేలా ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ కొత్త పథకం తీసుకురానుంది. జిల్లాలోని 72 మత్స్య సహకార సొసైటీలోని 2,558 మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది. సూక్ష్మ, చిన్న పరిశ్రమలను ప్రోత్సాహం అందించనుండటంతో ఆ కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.  

మత్స్య సహకార సొసైటీలు: 72
మత్స్యకార కుటుంబాలు: 2,558


కంప్యూటరీకరణ దిశగా..

చిన్న, సన్నకారు రైతుల సంక్షేమానికి సహకార వ్యవస్థ తోడ్పాటును అందిస్తుంది. జిల్లాలో సహకార సంఘాలు 438 ఉన్నాయి. దేశవ్యాప్తంగా 63 వేల సంఘాలను కంప్యూటరీకరణ చేయడంతోపాటు రూ.2,516 కోట్లు కేటాయించనున్నారు. వీటిని బహుళ ఉపయోగ కేంద్రాలుగా తీర్చిదిద్దనుండటంతో రైతులకు మేలు జరగనుంది. గ్రామాల్లో పీఏసీఎస్‌, ప్రాథమిక మత్స్య సొసైటీలు, డెయిరీ సహకార సొసైటీలు ఏర్పాటు చేయనుండటంతో అన్నదాతలకు కేంద్రం నుంచి మరింత ‘సహకారం’ అందనుంది.

జిల్లాలో సహకార సంఘాలు : 438
సహకార సంఘ సభ్యులు: 79,662


ఏకలవ్య పాఠశాలలకు ప్రాధాన్యం

నిరుద్యోగ యువతకు వెన్నుదన్నుగా నిలిచేలా మూడేళ్ల శిక్షణకు ప్రధాన మంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన పథకానికి నిధులు పెంచింది. జిల్లా విద్యా శిక్షణా సంస్థలను ఎక్స్‌లెన్సు కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు. మోడల్‌ ఏకలవ్య పాఠశాలల్లో 38,800 బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీ చేయనున్నారు.  గిరి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నిరుద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

జిల్లాలో ఏకలవ్య పాఠశాలలు మొత్తం : 03
భర్తీ అయ్యే పోస్టులు : 100కి పైగా


సొంతింటి ‘కల’ నెరవేరేలా..

ఇల్లు లేని పేదలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద రూ.79 వేల కోట్లు కేటాయించడంతో వారి కల నెరవేరనుంది. ప్రస్తుతం రెండు పడక గదుల పథకం కింద జిల్లాలో 3,559 ఇళ్లు మంజూరయ్యాయి. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ఇళ్లు లేని లబ్ధిదారుల సంఖ్య 50వేలకు పైగా ఉన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఇళ్ల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించడం.. రాష్ట్రప్రభుత్వం కూడా స్థలం ఉంటే రూ.3లక్షలు కేటాయిస్తామని ఇదివరకే ప్రకటించడం జిల్లాలో పేదలకు సొంతింటి ‘కల’ నెరవేరే అవకాశముంది.

రెండు పడక గదుల ఇళ్ల మంజూరు : 3,559
ఇంకా ఇళ్లు అవసరం ఉన్న కుటుంబాలు: 50 వేల పైనే


మహిళలకు పొదుపు మంత్రం..!

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మహిళల కోసం కొత్త పొదుపు పథకాలను బడ్జెట్‌లో ప్రకటించారు. మహిళా సమ్మాన్‌ సేవింగ్‌ పత్ర పేరిట కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. మహిళలు, బాలికలకు సంబంధించిన ఈ పథకం కింద రెండేళ్లపాటు డిపాజిట్లు చేస్తే 7.5 శాతం స్థిరవడ్డీ లభించనుంది. గరిష్ఠంగా రెండు లక్షల వరకు ఖాతాలో జమ చేసుకోవచ్చు.  

జిల్లాలో మహిళా సంఘాలు : 10,709
సభ్యులు మొత్తం: 1,16,242


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని