logo

భయంగా వచ్చాం.. ఆనందంతో వెళ్తున్నాం

భయం భయంగా వచ్చాం.. ఏడాది పాటు విద్యాలయంలో చదువుకున్నాం. ఆనందంగా తిరిగి ఈ నెల 30న సొంత ప్రాంతానికి తిరిగి ప్రయాణమవుతున్నామంటూ..

Updated : 24 Mar 2023 06:28 IST

‘మైగ్రేషన్‌’పై వచ్చిన శివపూరి విద్యాలయం విద్యార్థుల అభిప్రాయాలివి

మధ్యప్రదేశ్‌లోని శివపూరి విద్యాలయం విద్యార్థులు

కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే: భయం భయంగా వచ్చాం.. ఏడాది పాటు విద్యాలయంలో చదువుకున్నాం. ఆనందంగా తిరిగి ఈ నెల 30న సొంత ప్రాంతానికి తిరిగి ప్రయాణమవుతున్నామంటూ.. మైగ్రేషన్‌పై వచ్చిన విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జాతీయ సమైక్యత, సమగ్రతలను కాపాడేందుకు జవహర్‌ నవోదయ విద్యాలయం ‘మైగ్రేషన్‌’ (వలస) విధానాన్ని అమలు చేస్తోంది. విద్యార్థిదశలోనే జాతీయసమైక్య భావాన్ని పెంపొందించేందుకు ఓ ఆనవాయితీని కొనసాగిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తున్న విద్యాలయాల్లో ఒక రాష్ట్రం విద్యార్థులు మరో రాష్ట్రంలో ఏడాదిపాటు చదవాలనేది స్పష్టమైన నిబంధన. విద్యాలయాల్లో 9వ తరగతి చదివే వారు ఈ విధానంలో ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటారు. కాగజ్‌నగర్‌ విద్యాలయ విద్యార్థులు మధ్యప్రదేశ్‌లోని శివపూరి విద్యాలయం, అక్కడి విద్యార్థులు స్థానిక విద్యాలయంలో ఏడాదిపాటు చదువుకుంటారు. 2020-21, 2021-22 రెండేళ్ల పాటు కరోనా కారణంగా ఈ విధానాన్ని నిలిపి వేయగా.. 2022-23లో 9వ తరగతి 25 మంది విద్యార్థులు(17 బాలురు, 8 మంది బాలికలు)ఏడాది పాటు ఇక్కడికి వచ్చి చదివారు. వార్షిక పరీక్షలు ముగియగా.. మధ్యప్రదేశ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ వారి మనోగతాన్ని సేకరించింది.

మైగ్రేషన్‌ విధానం అమలు..

9వ తరగతి ప్రారంభంలోనే మైగ్రేషన్‌ విధానంపై ఆసక్తి ఉన్న విద్యార్థుల పేర్లు ప్రిన్సిపల్‌ సేకరిస్తారు. లేకుంటే సంఖ్యను బట్టి 30శాతం విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎవరూ ముందుకు రాకపోతే ఆయా మండల విద్యాధికారి సమక్షంలో లక్కీడ్రా ద్వారా ఎంపిక చేస్తారు.


క్రమశిక్షణకు మారు పేరు
- చక్రపాణి, ప్రిన్సిపల్‌, విద్యాలయం

మైగ్రేషన్‌పై వచ్చిన విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరు. సమయపాలన, చదువుల్లోనూ అత్యంత ప్రతిభావంతులు.  స్థానిక విద్యార్థులతో కలిసి మెలిసి ఉండేవారు. తెలుగుపై మంచి పట్టు సాధించారు. వారి అభిప్రాయాల మేరకు ఇష్టమైన ఆహారాన్ని, సదుపాయాలను ఏర్పాటు చేశాం. ఏ ఒక్కరోజు కూడా వారితో ఇబ్బందులు తలెత్తలేదు.


అదృష్టంగా భావిస్తున్నా
- చాందినీ సోలంకి, శివపూరి  

హైదరాబాద్‌ పేరును పత్రికలు, టీవీల్లోనే చూశా. విజ్ఞానయాత్ర పేరిట మమ్మల్ని అక్కడకు తీసుకెళ్లారు. గోల్కొండ కోట, పార్కులు, మ్యూజియం, బిర్లామందిర్‌ తదితర వాటిని చూశా. దక్షిణ భారత సంస్కృతి, సంప్రదాయాలు తెలిశాయి. విద్యాలయంలో ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్‌ సొంత పిల్లల మాదిరిగా చూసుకున్నారు. ఇక్కడ ఏడాదిపాటు చదువుకోవడం అదృష్టంగా భావిస్తున్నా.


సంస్కృతి, సంప్రదాయాలు బాగున్నాయి
- రాధిక నామ్‌దెవ్‌, శివపూరి  

మా రాష్ట్రంలో కంటే తెలంగాణలో సంస్కృతీ సంప్రదాయాలు బాగున్నాయి. స్థానిక విద్యాలయంలోనే చదువుతూ ఇష్టమైన బ్రేక్‌, కూచిపూడి నృత్యాలు నేర్చుకున్నా. గణతంత్ర, స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా దేశభక్తి గీతాలపై నృత్యం చేశా. మొదట్లో నాకు తెలుగు మాట్లాడటం, రాయటం రాదు. ఉపాధ్యాయులు, తోటి విద్యార్థినులు సూచనలు, సలహాలను తీసుకొని, నేర్చుకున్నా.


ఇక్కడి వారి ఆదరణ నచ్చింది
- అర్జున్‌, శివపూరి  

ఇక్కడ విద్యాబోధన బాగుంది. పండగలు, ఆచారాలు తెలుసుకున్నా. ఆప్యాయత, అనురాగం స్థానిక విద్యార్థుల ద్వారా తెలిసింది. ఏ ఒక్కరోజు కూడా మమ్మల్ని వేరుగా చూడలేదు. ఏడాదిపాటు చదువు అప్పుడే అయిపోయిందా అనిపించింది. ఉపాధ్యాయుల బోధన వల్లే మంచి మార్కులతో టాపర్‌గా నిలవడం ఆనందంగా ఉంది. క్రీడలపై కూడా ఆసక్తి పెరిగింది. ఇటీవల జాతీయ స్థాయి క్రీడల్లోనూ పాల్గొని, అవార్డు సాధించా.


ప్రారంభంలో ఇబ్బంది పడ్డా
- ప్రేమ్‌చంద్‌, శివపూరి  

ఇక్కడికి రాగానే ప్రారంభంలో చాలా ఇబ్బంది పడ్డా. ఉపాధ్యాయులు, తోటి విద్యార్థుల స్నేహం  ఏర్పడిన తర్వాత ఇబ్బందులు తలెత్తలేదు. మా విద్యాలయం కంటే ఇక్కడ క్రమశిక్షణ, సమయపాలన  కచ్చితంగా అమలు చేస్తారు. తెలుగు, ఆంగ్లంపై మంచి పట్టు సాధించా. ఇబ్బందులు లేకుండా మాకు ఇష్టమైన భోజనం, తదితర వాటిని ప్రిన్సిపల్‌, ఉపాధ్యాయులు ఏర్పాటు చేశారు. మా విద్యాలయంలోనూ విద్యార్థులకు భోజనం చేసే సమయంలో క్రమశిక్షణ పాటించాలంటూ నేర్పిస్తా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని