logo

విలువలతో కూడిన విద్య అందించాలి

ఒకప్పుడు చదువులకు దూరంగా ఉన్న మారుమూల అల్లంపల్లి గిరిజన విద్యార్థులకు మంచి విలువలతో కూడిన విద్యను అందుబాటులోకి తెచ్చామని త్రిదండి రామానుజ చినజీయరు స్వామి అన్నారు.

Published : 20 Apr 2024 02:28 IST

కళాశాల భవనం, ఆలయాలను ప్రారంభించిన చినజీయరుస్వామి

మాట్లాడుతున్న చినజీయరు స్వామి

కడెం, న్యూస్‌టుడే: ఒకప్పుడు చదువులకు దూరంగా ఉన్న మారుమూల అల్లంపల్లి గిరిజన విద్యార్థులకు మంచి విలువలతో కూడిన విద్యను అందుబాటులోకి తెచ్చామని త్రిదండి రామానుజ చినజీయరు స్వామి అన్నారు. శుక్రవారం అల్లంపల్లి జీయరు గురుకులం ఆవరణలో కొత్తగా నిర్మించిన కళాశాల భవనాన్ని స్వామి ప్రారంభించారు. అంతకు ముందు మంగళ్‌సింగ్‌ తండాలో అభయాంజనేయ స్వామి ఆలయం, అల్లంపల్లిలో శ్రీసీతారాములవారి ఆలయాన్ని ప్రత్యేక పూజలు చేసి విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జీయరు స్వామి మాట్లాడుతూ.. ఒకప్పటి నక్సలైట్ల ప్రాబల్యప్రాంతం, రహదారిలేక చదువుకు దూరంగా ఉన్న మారుమూల అల్లంపల్లిలో జీయరు గురుకులాన్ని ఏర్పాటుచేశామని గుర్తు చేశారు. అన్నలు ఏమంటారోనని కొందరు భయపెట్టేలా మాట్లాడినా ప్రజలకు మేలుచేసే కార్యక్రమం కావడంతో అందరి సహకారంలో గురుకులాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇక్కడ పదో తరగతి పూర్తిచేసిన పిల్లలు దూరంగా వెళ్లి చదువుకోవడం కష్టమవుతోందని, రూ.లక్షలు పెట్టి ప్రైవేటు విద్యను పొందలేకపోతున్నామని గ్రామస్థులు కోరడంతో ఇక్కడే జూనియర్‌ కళాశాలనూ ప్రారంభించామని అన్నారు. వికాసతరంగిణి ఆధ్వర్యంలో ప్రజ్ఞ కార్యక్రమం ట్రస్మా ద్వారా నిర్వహిస్తున్నామని, ఇందులో ప్రైవేటు ఉపాధ్యాయులందరికీ నైతిక విలువలపై శిక్షణ ఇచ్చి విద్యార్థులకు నేర్పేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అల్లంపల్లిలో చదివే గిరిజన విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లోనూ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని, వారికి విలువిద్య, ఈత, కర్రసాము తదితర అంశాల్లో శిక్షణ ఇప్పిస్తామన్నారు. జెట్‌ చైర్మన్‌ ప్రభాకర్‌ రావు, ప్రిన్సిపల్‌ చక్రధర్‌ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు నిర్మాణానికి కృషిచేస్తా: ఎమ్మెల్యే

మారుమూలనున్న అల్లంపల్లి, బాబానాయక్‌ తండా పంచాయతీలకు రోడ్డు వసతి మెరుగుపడేలా తారురోడ్డు నిర్మాణానికి కృషిచేస్తానని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు చెప్పారు. రహదారి సమస్యను జీయరుస్వామి అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా.. ఇది తమ పరిశీలనలో ఉందని, త్వరలోనే  ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరించేలా చూస్తానన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఖమ్మం జిల్లా అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ ఇంత మారుమూలన పాఠశాల, కళాశాల ఏర్పాటుచేయడం జీయరుస్వామి గొప్పదనం అన్నారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణలను జీయరు స్వామి సత్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని