logo

మండుతున్న ఎండలు.. వేడెక్కుతున్న భవనాలు

వేసవిలో మండుతున్న ఎండలకు పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. సిమెంటు కాంక్రీటు భవనాలు వేడెక్కుతున్నాయి. సాధారణంగా గది ఉష్ణోగ్రత 24 డిగ్రీలు ఉంటుంది. మండుతున్న ఎండలతో ఈ ఉష్ణోగ్రతలు సైతం సాధారణ స్థాయిని మించి నమోదవుతున్నాయి.

Published : 06 May 2024 05:16 IST

పట్టణంలో అమలుకాని చలువ పైకప్పు విధానం
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ అర్బన్‌

ట్టణాల్లో 600 చదరపు గజాల విస్తీర్ణంలో ఉండే ఇలాంటి అపార్ట్‌మెంట్లకు విధిగా చలువ పైకప్పు నిర్మించుకోవాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ స్థలంలో నిర్మించుకునే ఇళ్లకు ఈ నిబంధనను ఐచ్ఛికం చేశారు. అవగాహన, పర్యవేక్షణ లేక ఈ విధానం అమలు కావడం లేదు


వేసవిలో మండుతున్న ఎండలకు పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. సిమెంటు కాంక్రీటు భవనాలు వేడెక్కుతున్నాయి. సాధారణంగా గది ఉష్ణోగ్రత 24 డిగ్రీలు ఉంటుంది. మండుతున్న ఎండలతో ఈ ఉష్ణోగ్రతలు సైతం సాధారణ స్థాయిని మించి నమోదవుతున్నాయి. ఇంట్లో కరెంటు పోతే ఒళ్లంతా చెమట పట్టేస్తోంది. ఉక్కపోత భరించలేక వెంటనే చల్లగాలికి బయటకు రావాలనిపిస్తుంది. ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ చలువ పైకప్పు(కూల్‌ రూఫ్‌) 2023-28 విధానాన్ని తీసుకొచ్చింది. వేడి ప్రభావాన్ని తగ్గించి లోపల చల్లదనం ఉండేలా భవనాల పైకప్పులను నిర్మించుకోవాలని గతేడాది ఆదేశాలను జారీ చేసింది. ప్రజల్లో అవగాహన లేకపోవడం, బల్దియా యంత్రాంగం పర్యవేక్షణ లేకపోవడంతో ఈ విధానం అమలుకు నోచుకోవడం లేదు.

ఈ నిర్మాణాలకు తప్పనిసరి

పట్టణాల్లో చలువ పైకప్పు విధానం గతేడాది ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం బల్దియాకు 6 లక్షల చదరపు అడుగుల లక్ష్యం విధించింది. భవన నిర్మాణ అనుమతులు తీసుకునే టీఎస్‌బీపాస్‌ చట్టం కిందే ఈ విధానం అమలవుతుంది. 600 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన నివాస యోగ్యమైన భవన నిర్మాణాలకు తప్పనిసరి చేసింది. దాదాపు అంత విస్తీర్ణంలో నిర్మించే అపార్ట్‌మెంట్లు ఈ పరిధిలోకి వస్తాయి. 600 చ.గ.ల కంటే తక్కువ విస్తీర్ణంలోని నిర్మాణాలకు ఐచ్ఛికం చేశారు. అంటే వారు కావాలనుకుంటే కూల్‌ రూఫ్‌ నిర్మించుకోవచ్చు లేకపోతే లేదు. ప్రభుత్వ నూతన భవనాలకు, వ్యాపార, వాణిజ్య సముదాయాలకు తప్పనిసరిగా చేసుకోవాలి. ప్రభుత్వ ఆధీనంలోని గృహ నిర్మాణ పథకాలకు సైతం దీన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. చలువ పైకప్పు నిర్మించుకున్న వాటికే బల్దియా అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌(వినియోగ పత్రం) జారీ చేయాలని ఆదేశించింది.

పైకప్పును చల్లగా మార్చే ప్రక్రియ

సాధారణంగా భవనాలను సిమెంటు కాంక్రీటుతో నిర్మించడంతో పైకప్పులు ఎండకు వేడెక్కుతాయి. చలువ పైకప్పు విధానంలో సూర్యకిరణాలు పరావర్తనం చెందేలా పైకప్పునకు ప్రత్యేక పూత వేస్తారు. ఇందుకోసం లైమ్‌ వాష్‌/అక్రిలిక్‌ పాలిమర్‌/ప్లాస్టిక్‌ సాంకేతికతను వినియోగించి పైకప్పునకు పూత పూస్తారు. మరో విధానంలో పాలివినీల్‌ క్లోరైడ్‌(పీవీసీ) విధానంలో పైకప్పును తీర్చిదిద్దుతారు. మూడో విధానంలో ఆల్బిడో, సిరామిక్‌ మొజాయిక్‌ టైల్స్‌ను పైకప్పులో అమరుస్తారు. పైకప్పులో వినియోగించే సామగ్రి వేడిని నియంత్రిస్తాయి. సాధారణ భవనాలతో పోలిస్తే చలువ పైకప్పు ఉన్న నిర్మాణాలు 80 శాతం సూర్యుడి వేడి ప్రభావాన్ని తగ్గిస్తాయి. ప్రభుత్వం ఆమోదించిన ఏజెన్సీలు, ప్రైవేటు కంపెనీలు ఈ పనులను చేపడతాయి. ఇప్పటికే ఈ విధానం విదేశాల్లో అమల్లో ఉంది. ఈ విధానం విజయవంతం కావాలంటే పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని