logo

తీరంలో.. జనసంద్రం

మాఘ పౌర్ణమి పుణ్యస్నానాలు ఆచరించేందుకు పూడిమడక సముద్రతీరానికి ఆదివారం భక్తులు పోటెత్తారు.

Updated : 06 Feb 2023 05:25 IST

మాఘపౌర్ణమి పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తులు

పుణ్యస్నానాలు ఆచరిస్తున్న దంపతులు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమి పుణ్యస్నానాలు ఆచరించేందుకు పూడిమడక సముద్రతీరానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి రెండు లక్షలకు పైగా భక్తులు జాతరకు తరలివచ్చారని అంచనా. సాయంత్రం వరకు భక్తులు వస్తూనే ఉన్నారు. ముందురోజు రాత్రి నుంచి జాగారం చేసిన భక్తులు తెల్లవారుజామున పుణ్యస్నానాలు చేయడానికి పోటీపడ్డారు. సూర్యోదయం సమయంలో మరింత ఎక్కువమంది పుణ్యస్నానాలు ఆచరించారు. గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన కోయదొరలు, జంగాలతో సంప్రదాయబద్ధంగా శాంతిపూజలు నిర్వహించారు. స్నానాలు అనంతరం తీరం వద్ద ప్రసిద్ధి చెందిన జగన్నాథస్వామి, ఆంజనేయుని ఆలయాల్లో పూజలు చేశారు. ఇసుకతో గంగమ్మలను తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కళాకారులు తప్పెటగుళ్లతో సందడి చేశారు. స్నానాలు చేసిన మహిళా భక్తులు వస్త్రాలను మార్చుకోవడానికి తీరంలో వైద్యశాఖ, పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేశారు.

శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీమాధవ స్వామి

పూడిమడకలో సూర్య నమస్కారం చేస్తున్న యువతులు

* సముద్ర స్నానాలు ఆచరించే సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా స్థానిక సీఐ మురళీరావు, ఎస్సై సన్యాసినాయుడు, అనకాపల్లి గ్రామీణ ఎస్సై నర్సింగరావు, వంద మంది వరకు సిబ్బంది, పంచాయతీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పడవలను అడ్డంగా ఉంచి సముద్రం లోపలకి ఎవ్వరూ వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. పూడిమడక ఉన్నత పాఠశాల, పంచాయతీ కార్యాలయం వద్ద పోలీసు అవుట్‌ పోస్టులు ఏర్పాటుచేశారు. తీరంతోపాటు ప్రధాన వీధుల్లో దుకాణాలు ఏర్పాటుచేశారు.

* ఈ ఒక్కరోజే రూ. 50 లక్షల మేర వ్యాపార లావాదేవీలు జరిగాయని వ్యాపారులు తెలిపారు. తీరం వద్ద శనివారం రాత్రి జాతర సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. గ్రామ పొలిమేరల నుంచి తీరం వరకు పందిరి విద్యుద్దీపాలంకరణ చేశారు. వినోదాత్మకమైన కార్యక్రమాలతో పూడిమడక జాతర అంబరాన్ని తాకింది. డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ సుకుమార్‌వర్మ పూడిమడకలో పర్యటించి పుణ్యస్నానం ఆచరించారు.


ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: రేవుపోలవరానికి ఉదయం 9 గంటల సమయంలో వేలాది మంది ఒక్కసారిగా రావడంతో కొత్తపోలవరం నుంచి పార్కింగ్‌ పాయింట్‌ వరకు గంటపాటు ట్రాఫిక్‌ స్తంభించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని