logo

దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం

‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు.

Updated : 26 Apr 2024 03:46 IST

జీతాల సమస్యల్లేకుండా ఉత్తర్వులు 

ఈనాడు, పాడేరు : ‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. మరి తన తండ్రి సమానుడిగా ప్రకటించిన అమాత్యుని శాఖలో జరిగిన దొడ్డిదారి బదిలీలు ఆయనకు కనిపించలేదేమో. గతేడాది సాధారణ బదిలీలు తర్వాత కొంతమంది ఉపాధ్యాయులు నేతలతో సిఫార్సు చేయించుకుని స్థానచలనం పొందారు. దీనికోసం ఒక్కో టీచర్‌ రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు డీఈవో కార్యాలయం నుంచి విద్యాశాఖ మంత్రిత్వ కార్యాలయం వరకు చదివించుకున్నట్లు ఆరోపణలున్నాయి. కౌన్సెలింగ్‌తో సంబంధం లేకుండా కాసులతోనే నచ్చిన చోటుకు కొలువును మార్చుకున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 60 మంది వరకు దొడ్డిదారి బదిలీ చేసుకున్నట్లు సమాచారం. వారిలో 26 మంది రెండు నెలలు కిందటే వారికి కేటాయించిన స్కూళ్లలో చేరిపోయారు. అయితే అడ్డదారిలో బదిలీలు చేసుకోవడంతో జీతాలు చెల్లించడానికి ట్రెజరీల్లో సమస్యలు ఎదురవుతున్నాయి. తాజాగా వారి జీతాల సమస్యను పరిష్కరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని విద్యాశాఖ ఉన్నతాధికారి డీఈవో కార్యాలయాలకు ఉత్తర్వులు జారీచేసి రాచమార్గం చూపించారు. మొదటి విడతలో 26 మంది సిఫార్సు బదిలీలతో కొత్త పాఠశాలల్లో చేరగా మిగతావారు రెండో విడతలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో కొన్ని ఖాళీలను విద్యాశాఖ అధికారులు బ్లాక్‌ చేశారు. వాటిలో కొన్నింటిని దొడ్డిదారి బదిలీలపై వచ్చిన వారికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.

ఏజెన్సీ నుంచి నగరానికే..

నా ఎస్సీలు, నా ఎస్టీలు అనే జగన్‌.. ఈరోజు అదే ఎస్టీ పిల్లలు చదువుకునే పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను దొడ్డిదారిన మైదాన ప్రాంతానికి బదిలీకి అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లాలోని జరిగిన 26 సిఫార్స్‌ బదిలీల్లో 15 మందికి పైగా ఉపాధ్యాయులు ఏజెన్సీ నుంచి విశాఖ నగరానికి స్థానచలనం పొందారు. పెదబయలు మండలం కుంటూరుపుట్టులో ఎస్జీటీ ఉపాధ్యాయిని విశాఖలోని చినగదిలి మండలానికి సిఫార్సు బదిలీపై వచ్చారు. చింతపల్లి మండలం మండిపల్లి పాఠశాలలో ఎస్జీటీ గాజువాకకు బదిలీ చేసుకున్నారు. అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల్లోని ఎస్జీటీలు పెందుర్తి మండలానికి బదిలీపై వచ్చారు. ఒకరిద్దరు మాత్రమే పరస్పర బదిలీలతో నగరం నుంచి ఏజెన్సీకి వెళ్లారు. మిగతా వారంతా హెచ్‌ఆర్‌ ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లోకి మారిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని