logo

సమస్యల పరిష్కారానికే ‘స్పందన’

మన్యంలో గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రతి వారం ఐటీడీఏ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి సూరజ్‌ గనోరే పేర్కొన్నారు.

Published : 21 Mar 2023 01:20 IST

సమస్యలు వింటున్న ఐటీడీఏ పీఓ సూరజ్‌ గనోరే, సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌

రంపచోడవరం, న్యూస్‌టుడే: మన్యంలో గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రతి వారం ఐటీడీఏ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి సూరజ్‌ గనోరే పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌, సహాయ ప్రాజెక్ట్‌ అధికారి శ్రీనివాసరావుతో కలిసి ఆయన స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 46 మంది వివిధ సమస్యలపై అర్జీలు అందజేశారు. దేవీపట్నం మండలం గిన్నేపల్లి తాటివాడలో గిరిజన ప్రాథమిక పాఠశాల భవనం పనులు మొదలుపెట్టి సగంలోనే నిలిపివేశారని, దీనిని వెంటనే పూర్తి చేయించాలని సర్పంచి కె.బుచ్చన్నదొర, కలుం స్వామిదొర తదితరులు కోరారు. డి.ఎన్‌.పాలెం పంచాయతీ మునకలగూడెం నుంచి సీహెచ్‌.గంగవరం వరకు రెండు కిలోమీటర్ల మెటల్‌ రోడ్డు వేయాలని సర్పంచి రత్నారెడ్డి వినతిపత్రం అందజేశారు. రంపచోడవరం మండలం చిలకమామిడికి చెందిన ఒంటుకుల రామాయమ్మ జీవనోపాధి నిమిత్తం కిరాణా దుకాణం పెట్టుకొనేందుకు తనకు రూ. లక్ష రుణం మంజూరు చేయాలని కోరారు. రంపచోడవరం మండలం భీమవరం నుంచి మారేడుమిల్లి మండలం నరసాపురం వరకు పది కిలోమీటర్ల వరకు తారు రోడ్డు పనులు అటవీ అభ్యంతరాలతో నిలిచిపోయాయని, ఈ పనులు పూర్తి చేయాలని మాజీ సర్పంచి కుంజం వెంకటరమణ ఆధ్వర్యంలో గిరిజనులు కోరారు. గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక ఉప కలెక్టర్లు జాన్‌బాబు, డి.ఎస్‌ శాస్త్రి, కార్యనిర్వాహక ఇంజినీర్లు (ఈఈ) నాగేశ్వరరావు, ఎండీ యూసఫ్‌, గిరిజన సహకార సంస్థ జిల్లా మేనేజర్‌ పార్వతీశ్వరరావు, వెలుగు ఏపీడీ శ్రీనివాసరావు, ఏడీఎంహెచ్‌ఓ అనూష, పీహెచ్‌ఓ చిట్టిబాబు, మత్స్య అభివృద్ధి అధికారి రమేష్‌, సీడీపీఓ సంధ్యారాణి, ఆర్‌అండ్‌బీ డీఈ సాయిసతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని