logo

తాడిని తరలించకపోతే ఎన్నికలను బహిష్కరిస్తాం

అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని తరలిస్తామని కలెక్టర్‌ వచ్చి తమకు స్పష్టమైన ప్రకటన చేయాలని లేనిపక్షంలో గ్రామస్థులంతా కలిసి మూకుమ్మడిగా సార్వత్రిక ఎన్నికలను బహిష్కరిస్తామని గ్రామానికి చెందిన అఖిలపక్ష నాయకులు(తెదేపా, వైకాపా, జనసేన, సీఐటీయూ) తేల్చి చెప్పారు.

Published : 28 Mar 2024 02:14 IST

ముక్తకంఠంతో హెచ్చరించిన అఖిలపక్ష నాయకులు

మాట్లాడుతున్న అఖిలపక్ష నాయకులు

పరవాడ, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని తరలిస్తామని కలెక్టర్‌ వచ్చి తమకు స్పష్టమైన ప్రకటన చేయాలని లేనిపక్షంలో గ్రామస్థులంతా కలిసి మూకుమ్మడిగా సార్వత్రిక ఎన్నికలను బహిష్కరిస్తామని గ్రామానికి చెందిన అఖిలపక్ష నాయకులు(తెదేపా, వైకాపా, జనసేన, సీఐటీయూ) తేల్చి చెప్పారు. తాడి గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వీరు మాట్లాడారు. తాడి గ్రామానికి ఆనుకుని ఫార్మాసిటీ రావడంతో 15 ఏళ్లుగా భరించలేని దుర్వాసనతో పాటు శ్వాసకోశ, చర్మ, గుండె, కిడ్నీ రోగాలబారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీల నుంచి విషవాయువులు లీకైనా, అగ్ని ప్రమాదాలు సంభవించినా భయాందోళనతో పరుగులు తీయాల్సి వస్తోందన్నారు. గత 15 ఏళ్లలో 3 ప్రభుత్వాలు మారినా తమ గ్రామాన్ని తర¢లించకుండా మోసం చేశాయన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా 28 ఏప్రిల్‌ 2022న సబ్బవరం వచ్చి పది రోజుల్లో తాడి గ్రామాన్ని తరలిస్తామని హామీ ఇచ్చినా నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు. గ్రామానికి ఆనుకుని ఉన్న గ్రీన్‌బెల్ట్‌ స్థలంలో రాంకీ యాజమాన్యం రెండు వారాలుగా అక్రమంగా పైపులైన్‌ నిర్మాణ పనులు చేపడుతోందని వాటిని అడ్డుకుంటే పోలీసులతో కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న ఈ పైపులైన్‌ వలన మరింత కాలుష్యం పెరుగుతోందన్నారు. రాంకీ ఛైర్మన్‌ అయోధ్యరామిరెడ్డి రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ పీసీబీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు కావడంతో ఇష్టానుసారంగా చట్టాలను ఉల్లంఘించి ఈ ప్రాంతాన్ని తీవ్ర కాలుష్యమయం చేస్తున్నారని ఆరోపించారు. తాడి గ్రామాన్ని తరలించడానికి జిల్లా ఉన్నతాధికారులు త్వరితగతిన స్పష్టమైన ప్రకటన చేయాలని లేకుంటే గ్రామస్థులంతా కలిసి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఏకగ్రీవ తీర్మానం చేసి కలెక్టర్‌కు అందిస్తామన్నారు.. అఖిలపక్ష నాయకులు మాదంశెట్టి నీలబాబు, బొడ్డపల్లి అప్పారావు, ఎస్‌.నదియా, గనిరెడ్డి కనకరాజు, గనిశెట్టి సత్యనారాయణ, కోమటి కులదీప్‌రాజు, దానబోయిన నీలకంఠరావు, బంతికోరు గోవింద్‌, మాదంశెట్టి బుజ్జి, జుత్తుక మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని