logo

ఓటేయాలంటే పాట్లెన్నో..!

ఏళ్లు గడుస్తున్నా మన్యంవాసులకు రవాణా కష్టాలు గట్టెక్కడం లేదు. పాడేరు డివిజన్‌ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు నేటికీ ఓటేయాలంటే కిలోమీటర్ల దూరం నడక సాగించాల్సిన పరిస్థితి ఉంది.

Published : 05 May 2024 01:46 IST

మన్యంలో తప్పని రవాణా కష్టాలు

రహదారి లేని కారణంగా బరువులు మోసుకెళ్తున్న గిరిజనులు

అనంతగిరి, కొయ్యూరు, న్యూస్‌టుడే: ఏళ్లు గడుస్తున్నా మన్యంవాసులకు రవాణా కష్టాలు గట్టెక్కడం లేదు. పాడేరు డివిజన్‌ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు నేటికీ ఓటేయాలంటే కిలోమీటర్ల దూరం నడక సాగించాల్సిన పరిస్థితి ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా మారుమూల గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను మారుస్తుండటంతో ఆయా గ్రామాల ప్రజలు కొండలు, గుట్టలు ఎక్కుకుంటూ కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఓటేయాల్సిన పరిస్థితి నెలకొంది. మన్యంప్రాంతంలో నేటికీ కనీసం ద్విచక్ర వాహనం వెళ్లలేని గ్రామాలు అనేకం ఉన్నాయి.. పాడేరు డివిజన్‌ పరిధిలో 244 పంచాయతీలు ఉండగా.. సుమారు 3800 గ్రామాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 1600 మారుమూలన, సుమారు 900 అత్యంత మారుమూలన ఉన్నాయి. 

  • కొయ్యూరు మండలంలో మొత్తం 56 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ఇందులో 413 మంది ఓటర్లున్న పెదలంక కొత్తూరు (82) పోలింగ్‌ కేంద్రాన్ని, 664 మంది ఓటర్లున్న రేవులకోట బూత్‌(80)ను ఈసారి పలకజీడిలో ఏర్పాటు చేస్తున్నారు. 664 మంది ఓటర్లున్న కన్నవరం (70వ) పోలింగ్‌ కేంద్రాన్ని గరిమండకు, 954 మంది ఓటర్లున్న కునుకూరు(70వ) బూత్‌ను బాలరేవులకు మారుస్తున్నారు. ఆయా మారుమూల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతూ పోలింగ్‌ కేంద్రానికి చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది.

హామీలు నీటి మూటలే... గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని ఎన్నికల వేళ హామీలు గుప్పిస్తున్న నాయకులు అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేటికీ కనీసం ద్విచక్రవాహనాలు సైతం చేరుకోలేని గ్రామాలు అనేకం ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులు, గర్భిణులను డోలీమోతతో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి రవాణా సదుపాయం మెరుగుపర్చాలని కోరుతున్నారు.

  • పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీ పరిధిలోని బొడ్డాపుట్టు, సరిపుట్టు, కందులగుంట, కిండలంలుక్‌ తదితర గ్రామాల ప్రజలు కుంతుర్లలో పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాలి. ఈ గ్రామాలకు రహదారి సౌకర్యం లేని కారణంగా సుమారు 8 కిలోమీటర్లు నడవాలి.
  • ముంచంగిపుట్టు మండలం బుంగాపుట్టు పంచాయతీ పరిధిలో సుమారు 15 గ్రామాలు ఉన్నాయి. వీరంతా ఓటేసేందుకు లక్ష్మీపురం వెళ్లాలి. ఇందులో సుమారు 10 గ్రామాల ప్రజలు కనీసం 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం కాళ్లకు పనిచెబితేనే ఓటేసే అవకాశం ఉంటుంది.
  • అనంతగిరి మండలం పెదకోట, పినకోట పంచాయతీల పరిధిలోని పందిరిమామిడి, నక్కులమామిడి, రాచకీలం, గుమ్మ పంచాయతీ పరిధిలో కడరేవు, రొంపల్లి పంచాయతీ పరిధిలో గల పలు గ్రామాల ప్రజలు ఓటేయాలంటే కనీసం 10 కిలోమీటర్లు నడవాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని