logo

తెదేపా సమరోత్సాహం

యువగళం పాదయాత్ర సందర్భంగా మంగళవారం గన్నవరంలో నిర్వహించే బహిరంగ సభ తెలుగుదేశం శ్రేణులకు ప్రతిష్ఠాత్మకంగా మారింది.

Published : 22 Aug 2023 05:03 IST

ప్రతిష్ఠాత్మకంగా గన్నవరం బహిరంగ సభ

సిద్ధమైన ప్రాంగణం

ఈనాడు, అమరావతిన్యూస్‌టుడే, గన్నవరం గ్రామీణం: యువగళం పాదయాత్ర సందర్భంగా మంగళవారం గన్నవరంలో నిర్వహించే బహిరంగ సభ తెలుగుదేశం శ్రేణులకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ సభ నిర్వహణను పార్టీ నేతలు సవాల్‌గా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు, మారిన సమీకరణాల నేపథ్యంలో తెదేపా బలనిరూపణకు సిద్ధమైంది. లోకేశ్‌ పాదయాత్ర సోమవారం రాత్రి గన్నవరం చేరుకోగా ఆయనకు విడిది ఏర్పాటు చేశారు. మంగళవారం భారీ బహిరంగ సభ మాత్రమే ప్రణాళికలో ఉంది. సభకు కనీసం లక్ష మందిని సమీకరించాలనే లక్ష్యంతో పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభావేదిక నుంచి ప్రత్యర్థులకు సవాల్‌ విసిరేందుకు సిద్ధమవుతున్నారు. వైకాపా సీనియర్‌ నేత యార్లగడ్డ తెదేపాలో చేరడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి.

గన్నవరం తెదేపా అడ్డా..!

గన్నవరం గడ్డ.. తెదేపా అడ్డా అని పార్టీ శ్రేణులు కేరింతలు కొడుతున్నాయి. గన్నవరం నుంచి 2019లో పోటీ చేసిన వల్లభనేని వంశీ గెలుపొందిన తర్వాత తెదేపాకు ఝలక్‌ ఇచ్చి జగన్‌ పంచన చేశారు. గన్నవరంలో తెదేపా శ్రేణులను తమవైపు తిప్పుకొన్నారు. రాని వారిపై అధికార బలం ఉపయోగించారు. ఆస్తులపై దాడులు, కేసులు నమోదు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇటీవల గన్నవరంలో తెదేపా కార్యాలయంపై దాడికి పాల్పడి ధ్వంసం చేస్తే.. తెదేపా వారిపైనే కేసులు పెట్టారు. ఇలా గన్నవరంలో మారిన సమీకరణాలతో పరిస్థితి వాడీవేడి మీదుంది. గన్నవరంలో తెలుగుదేశం అభ్యర్థులే ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాంటి గన్నవరంలో వంశీ పార్టీ మారిన తర్వాత.. శ్రేణులు కొంత నిరాశలోకి వెళ్లాయి. బచ్చుల అర్జునుడు మృతితో నైరాశ్యంలో మునిగారు. కార్యక్రమాలు చేయాలంటే ఇబ్బందులు ఎదుర్కొనేవారు.

యార్లగడ్డ రాకతో ఊపు...

గత ఎన్నికల్లో వంశీకి ప్రత్యర్థి అయిన వైకాపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రస్తుతం తెదేపాలో చేరడం.. అదే వంశీకి ప్రత్యర్థిగా పోరాడేందుకు సిద్ధం కావడంతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. వెరసి గన్నవరంలో నువ్వానేనా అన్నట్లు తెదేపా, వైకాపా తయారయ్యాయి. ఈక్రమంలో మంగళవారం నాటి సభ బలనిరూపణకు కీలకం కానుంది. మండలాల వారీగా పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా తమ గ్రామాల్లో కార్యకర్తలను తరలించేందుకు ముందుకు వచ్చారు. ఇందుకు కమిటీలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. గన్నవరంలో 9 ఎకరాల్లో బహిరంగ సభావేదిక ఏర్పాటు చేశారు.  ఈసభావేదిక నుంచి లోకేశ్‌ సైతం కీలక ఉపన్యాసం చేయనున్నారని భావిస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం పాదయాత్ర సందర్భంగానే కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. స్వయంగా కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా వచ్చి బందోబస్తు పర్యవేక్షించారు. పాదయాత్ర మార్గాన్ని దావాజీ గూడెం మీదుగా మళ్లించారు. ఎమ్మెల్యే తన కార్యాలయంలో ఉండగా ఆయనను, వారి అనుచరులను అక్కడి నుంచి పంపించారు.

వ్యక్తిగత విమర్శలతో వేడి!

తెదేపా నుంచి వైకాపాలో చేరిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. ఇద్దరూ తెదేపా అధినేత చంద్రబాబును తరచూ విమర్శించేవారు. వ్యక్తిగతంగా దూషణలకు దిగారు. అమర్యాద పదాలను మాట్లాడారనే ఆరోపణలు ఉన్నాయి. తెదేపా క్యాడర్‌లో దీనిపై పంతం పెరిగింది. తెదేపా చెట్టు నీడన ఎదిగిన నేతలు ఇలా తమ నేతకు ఎదురు తిరగడం, ఇష్టానుసారం దూషణలకు పాల్పడటం పార్టీ శ్రేణుల్లో కసిగా మారింది. ఈసారి ఈరెండు నియోజక వర్గాలను ఎట్టి పరిస్థితుల్లో కైవసô చేసుకోవాలని తెదేపా నాయకులు భావిస్తున్నారు. ప్రజల తీర్పు ద్వారానే తగిన గుణపాఠం నేర్పుతామని పలు సందర్భాలో హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని