logo

పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగంలో సమాచార లోపం

పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకునే తేదీల విషయంలో సక్రమమైన సమాచారం ఇవ్వకపోవడంతో పలువురు ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

Published : 05 May 2024 02:57 IST

మచిలీపట్నం వచ్చి ఇబ్బందిపడిన ఉద్యోగులు

పాండురంగస్కూల్‌ వద్ద ముందస్తు ఇచ్చిన సమాచార పత్రాలను చూపిస్తూ..

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకునే తేదీల విషయంలో సక్రమమైన సమాచారం ఇవ్వకపోవడంతో పలువురు ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ సిబ్బందికి ఎన్నికల కమిషన్‌ సూచనలకు అనుగుణంగా పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకునే సౌలభ్యం కల్పించారు. అందుకు అనుగుణంగా శనివారం కృష్ణా జిల్లాలోని పీవోలు, ఏపీవోలు, మైక్రో అబ్జర్వర్లు, 5న ఓపీవోలు, 6న పోలీస్‌ సిబ్బంది, ఎసెన్షియల్‌ సర్వీసెస్‌, డ్రైవర్లు, వీడియోగ్రాఫర్లు తదితరులకు పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకునేందుకు వీలుగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీ ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీరితో పాటు పొరుగు జిల్లాల్లో ఓటు హక్కు ఉండి జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా మచిలీపట్నం చిలకలపూడి పాండురంగస్వామి మున్సిపల్‌ కార్పారేషన్‌లో ఫెసిలిటేషన్‌ కేంద్రం పెట్టారు. తొలుత వీరికి పోస్టల్‌ బ్యాలట్‌ సౌకర్యాన్ని ఈనెల 4వ తేదీన వినియోగించుకోవాలని సమాచారం ఇచ్చారు. అనంతరం ఆ తేదీని ఈనెల 6కు మార్చి... ఆ సమచారాన్ని సకాలంలో సంబంధిత సిబ్బందికి తెలియజేయలేదు. దీంతో ముందస్తు ఇచ్చిన సమాచారానికి అనుగుణంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు ఉద్యోగులు శనివారం పాండురంగ పాఠశాలకు రాగా ఫెసిలిటేషన్‌ కేంద్రం మూసివేసి ఉంది. దీంతో ఆరా తీసిన ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకునే తేదీని 6కు మార్చినట్లు తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. తేదీ మార్పుపై తమకు కనీస సమాచారం ఇవ్వని సంబంధిత అధికారుల నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు. ఈ విషయంపై కొందరు ఉద్యోగులు నోడల్‌ అధికారి షాహిద్‌బాబుతో ఫోన్‌లో మాట్లాడగా తాము ముందుగానే సమాచారం ఇవ్వడమే కాకుండా, తేదీ మార్పును అర్హులకు తెలియచేయాలంటూ ఆర్వోలను కూడా కోరినట్లు చెప్పారు. నోడల్‌ అధికారితో మాట్లాడిన అనంతరం ఉద్యోగుల సెల్‌ఫోన్లకు తేదీ మార్పుకు సంబంధించి సంక్షిప్త సందేశాలు రావడం గమనార్హం. దీంతో చేసేది ఏమీలేక ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఇవ్వడంలో అలసత్వం చూపిన అధికారుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఉద్యోగులు వెనుదిరిగి వెళ్లిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని