logo

సూపర్‌-6 పథకాలతో సంక్షేమం పరుగులు

అవనిగడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించడమే లక్ష్యం. సూపర్‌-6 పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాం. నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలను కొత్త పుంతలు తొక్కిస్తాం.  యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం.

Published : 06 May 2024 04:19 IST

ఇళ్ల వద్దకే రూ.4000 పింఛను
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ప్రతి ఇంటికీ ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం
డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలు
న్యూస్‌టుడే, అవనిగడ్డ

అవనిగడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించడమే లక్ష్యం. సూపర్‌-6 పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాం. నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలను కొత్త పుంతలు తొక్కిస్తాం.  యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. తాగు, సాగునీటి సమస్యలు పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తాం. మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటా’ అని జనసేన పార్టీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ వివరించారు. ఆయన ‘న్యూస్‌టుడే’తో ముఖాముఖి మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

సౌర విద్యుత్తు వినియోగం పెంచేందుకు కృషి

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం. అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పేద, మధ్య తరగతి వర్గాల జీవన స్థితిగతులు దెబ్బతిన్నాయి. ధరలు నియంత్రిచే చర్యలు చేపట్టి సామాన్యులపై భారం తగ్గిస్తాం. విద్యుత్తు ఛార్జీలు పెంచకుండా చర్యలు తీసుకుంటాం. సోలార్‌ ఆధారిత విద్యుత్తు వినియోగం పెంచేందుకు కృషి చేస్తాం. దీని ద్వారా నియోజకవర్గంలో 81,772 మంది గృహ విద్యుత్తు వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది.


నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి

నిరుద్యోగ సమస్య పరిష్కరించడమే ప్రధాన లక్ష్యం. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తాం. ఏటా జాబ్‌ క్యాలండర్‌ అమలు చేస్తాం. ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలిస్తాం. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి యువకుడికి నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి  కల్పిస్తాం. దీని ద్వారా నియోజకవర్గంలో సుమారు 3 వేల మంది లబ్ధి పొందుతారు.సింగిల్‌ విండో ద్వారా అనుమతులు జారీ చేసి పరిశ్రమల్ని ప్రోత్సహించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అంకుర సంస్థల ఏర్పాటుకు ప్రాజెక్టు వ్యయంలో రూ.10 లక్షల వరకు రాయితీ ఇస్తాం.


బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలు భర్తీ చేస్తాం

ఎస్సీ, ఎస్టీ, బీసీలను సామాజికంగా, ఆర్థికంగా సమాన స్థాయికి తీసుకురావడానికి కృషి చేస్తాం. బీసీ డిక్లరేషన్‌ అమలు చేసి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. బీసీ ఉప ప్రణాళిక ద్వారా అయిదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేసి వారి అభ్యున్నతికి పాటుపడతాం. వైకాపా ప్రభుత్వంలో రద్దు చేసిన 27 ఎస్సీ పథకాలను పునరుద్ధరిస్తాం. ఆయా వర్గాలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛన్లు ఇస్తాం. జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ అమలు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌ లాగ్‌ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఆదరణ పథకం ద్వారా 25 వేల మంది బీసీలకు వృత్తి పరికరాలు పంపిణీ చేస్తాం. స్వయం ఉపాధికి చేయూతనిస్తాం. స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లకోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం.


రూ.వంద కోట్లతో నూర్‌ బాషా కార్పొరేషన్‌

ఇమామ్‌లకు నెలకు రూ.10 వేలు, మౌజాన్లకు రూ.5 వేలు వేతనంమైనార్టీలు, ఇతర వర్గాల సంక్షేమానికి చర్యలు తీసుకుంటాం. నూర్‌ బాషా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తాం. దీని ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలిస్తాం. వారికి 50 ఏళ్లకే పింఛను ఇస్తాం. మైనార్టీలకు ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరస్తాన్లకు స్థలాలు కేటాయిస్తాం. విజయవాడ సమీపంలో హజ్‌ హౌస్‌ నిర్మాణానికి సహకరిస్తాం. అర్హత కలిగిన ఇమామ్‌లను ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తాం. మసీదు నిర్వహణకు నెలకు రూ.5 వేలు సహాయం. హజ్‌ యాత్రకు వెళ్లేవారికి ఒక్కొక్కరికి రూ.లక్ష సహాయం అందిస్తాం. మైనారిటీల సమస్యలన్నీ పరిష్కరించి వారి సంక్షేమానికి కట్టుబడి ఉంటాం.


ఒకటో తేదీనే జీతాలు, పింఛను

ఉద్యోగులు, ఉపాధ్యాయులను గౌరవించి పూర్తి అనుకూల వాతావరణంలో పని చేసేలా చర్యలు తీసుకుంటాం. సీపీఎస్‌/జీపీఎస్‌ విధానాలు పునఃసమీక్షించి, ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం. ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ అమలు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌ ప్రకటిస్తాం. ఉద్యోగులు, పింఛనుదారులకు ఒకటో తేదీన జీతాలు, పింఛన్లు జమ చేస్తాం. బకాయిలు చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తాం. పింఛనుదారుల కార్పొరేషన్‌ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటాం. తక్కువ జీతాలు పొందే పొరుగు సేవలు, ఒప్పంద, కన్సాలిడేటెడ్‌ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తాం.


ప్రతి మహిళకు ఏడాదికి రూ.18,000

చంద్రబాబునాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన డ్వాక్రా బృందాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించారు. అమెరికా తదితర దేశాల అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్‌ డ్వాక్రా సంఘాల పనితీరును ప్రశంసించిన విషయం మరిచిపోరాదు. దీపం పథకం ప్రవేశపెట్టి రాష్ట్రంలో కట్టెల పొయ్యి లేకుండా చేశారు. గ్యాస్‌ బండల ధరలు పెరగడంతో ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. దీని ద్వారా నియోజకవర్గంలో 70,000 మంది లబ్ధి పొందనున్నారు. వడ్డీ లేని రుణాలు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడం వల్ల నియోజకవర్గంలో 6,397 స్వయం సహాయక సంఘాలకు చెందిన 67,266 మంది లబ్ధిపొందుతారు. 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున నియోజకవర్గంలో 83,338 మంది ఏడాదికి ఒక్కొక్కరు రూ.18,000 చొప్పున లబ్ధి పొందనున్నారు. ప్రతి మహిళకు అర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల నియోజకవర్గంలో 1,07,026 మంది  ప్రయాణం చేసే అవకాశం ఉంది.


ఏప్రిల్‌ నుంచే పెరిగిన పింఛను

అభివృద్ధితోపాటు సంక్షేమానికి కూటమి ప్రాధాన్యమిస్తుంది. ఇందులో భాగంగా పేదరికం నిర్మూలనకు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. రూ.200 ఉన్న సామాజిక పింఛన్లు రూ.2000కు పెంచిన ఘనత చంద్రబాబుదే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సామాజిక పింఛన్లు నెలకు రూ.4,000కు, దివ్యాంగుల పింఛను రూ.6 వేలకు పెంచి ఏప్రిల్‌ నుంచే ఇళ్ల వద్దే పంపిణీ చేస్త్తాం. దీని ద్వారా నియోజకవర్గంలో 44,259 మంది లబ్ధి పొందనున్నారు. పూర్తి స్థాయిలో వైకల్యం ఉన్నవారికి ప్రత్యేకంగా రూ.15 వేలు ఇస్తాం.


ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు

వ్యవసాయానికి సకాలంలో సాగు నీరు అందించి అన్నదాతల్ని అన్ని విధాలా ఆదుకుంటాం. వ్యవసాయాన్ని లాభసాటి చేస్తాం. రానున్న రోజుల్లో రైతుకు పెద్దపీట వేస్తూ అన్నదాత సాయం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. రాయితీపై రుణాలు, పరికరాలు, విత్తనాలు, బీమా తదితరాలు అందజేస్తాం. అలాగే ప్రజల భూములకు భద్రత లేని విధంగా తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రద్దు చేస్తాం. మురుగు నీటి వ్యవస్థ సక్రమంగా నిర్వహించకపోవడంతో అవనిగడ్డ నియోజకవర్గంలో సుమారు 5 వేల ఎకరాలు బీడుగా మారి ఐదేళ్లుగా పండించుకునే అవకాశం లేకుండా పోయింది. కొద్దిపాటి వర్షాలకే పంట పొలాలు మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. అటువంటి సమస్యలు లేకుండా చూస్తాం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం. నియోజకవర్గంలోని 93,000 ఎకరాలకు సకాలంలో సాగునీరు అందిస్తాం.


సాగు, తాగు నీటి సరఫరాకు ప్రాధాన్యం

ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. తీర ప్రాంతం, మరికొన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. రక్షిత మంచినీరు లభించక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి పక్కా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తాం. ఇందులో భాగంగా జల్‌జీవన్‌ పథకాన్ని పక్కాగా అమలు చేస్తాం.


రహదారులు అభివృద్ధి చేస్తాం

రహదారులు నిర్వహణ లేక గుంతలు పడి అత్యంత ప్రమాదకరంగా తయారయ్యాయి. ఈ గుంతల్లో పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తెదేపా హయాంలో పంచాయతీరాజ్‌ రహదారులు చాలా వరకు అభివృద్ధి చేశాం. మిగిలిన రహదారులు ఇంతవరకూ అభివృద్ధికి నోచుకోలేదు. ధ్వంసమైన రహదారులను పునర్నిర్మించి ప్రజలు ముఖ్యంగా వాహనదారుల కష్టాలు తీరుస్తాం. దీన్ని ప్రత్యేక బాధ్యతగా తీసుకుంటాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని