logo

వైకాపాకు గుణపాఠం చెప్పే సమయం వచ్చింది

పెత్తందారులు.. పేదలు అంటూ నాలుగు సంవత్సరాల పాటు నయవంచక పాలనకు పాల్పడిన వైకాపాకు తగురీతిన బుద్ధి చెప్పేందుకు సమయం వచ్చిందని సోషల్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం అన్నారు.

Updated : 06 May 2024 05:14 IST

సోషల్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు గుర్నాథం

మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: పెత్తందారులు.. పేదలు అంటూ నాలుగు సంవత్సరాల పాటు నయవంచక పాలనకు పాల్పడిన వైకాపాకు తగురీతిన బుద్ధి చెప్పేందుకు సమయం వచ్చిందని సోషల్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం అన్నారు. మచిలీపట్నం ఈశ్వర్‌ రెసిడెన్సీలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి కుట్రలు తెలుసుకోలేక బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యాన నాలుగు సంవత్సరాల పాటు రాజధాని వికేంద్రీకరణ కోసం ఉద్యమించాల్సి రావడం దురదృష్టకరమన్నారు. సజ్జల రామకృష్ణారెడి, తలశిల రఘురాం, కొడాలి నాని, నందిగం సురేష్‌ తదితరుల కనుసన్నల్లో రాజధాని ప్రాంతంలో ఒక అరాచక వాతావరణాన్ని సృష్టించారన్నారు. తాము చేపట్టిన ఉద్యమం మాటున రోజు వారీ రూ.400 కోట్లు విలువ చేసే ఇసుకను దోచేశారనీ, జగన్‌ నిజస్వరూపం తెలియడంతో మూడు రాజధానుల కుట్ర, పెత్తందారులు.. పేదలు అన్న ప్రచారంలో డొల్లతనాన్ని ప్రజలకు తెలియజేసే క్రమంలో చేపట్టిన బహుజన రాజకీయ   చైతన్య యాత్రలో భాగంగా మచిలీపట్నం వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని జగన్‌ తొక్కేస్తే, మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధిని పేర్ని నాని హరించివేశారన్నారు. బందరు పోర్టును మసిపూసి మారేడుకాయలా తయారు చేశారని, మళ్లీ ఎన్నికల్లో ప్రజలను మోసగించి రాజకీయ లబ్ధి పొందేందుకు ఏవో పనులు చేస్తున్నట్లు నాటకానికి తెరతీశారని ఆరోపించారు. మచిలీపట్నం నియోజకవర్గం అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వాటి పట్ల పరిపూర్ణ అవగాహన ఉన్న కూటమి అభ్యర్థులు కొల్లు రవీంద్ర, వల్లభనేని బాలశౌరికి అఖండ విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. నాలుగు సంవత్సరాల పాటు అతి సన్నిహితంగా మెలగడం వల్ల జగన్‌ కుట్రలు, అరాచకాలు, అన్నీ తమకు తెలిశాయని, ప్రస్తుత పరిస్థితులో రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయాల్సిన గురుతర బాధ్యత అన్ని వర్గాలపై ఉందన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మళ్లీ మోసపోకుండా కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. తెదేపా నాయకులు డా.ఎస్‌.విశ్వనాథం, ఎం.అబీద్‌హుస్సేన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని