logo

నా ఎస్సీ, నా ఎస్టీ.. నా బీసీలంటూనే దాడులు

జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని... నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూనే వారిపై వైకాపా నేతలే దాడులకు తెగబడుతున్నారని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు.

Published : 07 May 2024 05:26 IST

వైకాపా సర్కారు తీరుపై బొండా ధ్వజం

విజయవాడ (సూర్యారావుపేట), న్యూస్‌టుడే : జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని... నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూనే వారిపై వైకాపా నేతలే దాడులకు తెగబడుతున్నారని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. అజిత్‌సింగ్‌నగర్‌లో జగన్‌పై గులకరాయి దాడి కేసులో అమాయకులైన బీసీలను వేధించి.. వేముల సతీష్‌కుమార్‌పై అక్రమంగా కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా పోస్టల్‌ బ్యాలట్‌ ఓటుకు డబ్బు తీసుకోలేదని ఎస్టీ ఉద్యోగిపై వైకాపా నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని దుయ్యపట్టారు. సోమవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. తెదేపా నాయకులపై దాడులు చేస్తున్నా.. పోలీసులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు జరుగుతున్నా.. చర్యలు తీసుకోలేదని దుయ్యపట్టారు. రాష్ట్ర ఎన్నికల సంఘం డమ్మీ అయిపోయిందని విమర్శలు గుప్పించారు. తన ఇంటిపై వైకాపా మూక దాడి చేసి కొట్టారని మనోజ్‌కుమార్‌ ఫిర్యాదు చేసినా స్పందించలేదని, అదే మనోజ్‌కుమార్‌పై ఎస్సీ మహిళతో ఫిర్యాదు చేయించి ఆగమేఘాల మీద కేసు కట్టారని.. పోలీసుల తీరును దుయ్యపట్టారు. గులకరాయి కేసులో చిన్న దెబ్బకే బీసీల పిల్లలపై 307 హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. దళిత ఉద్యోగి ఇంటిపై మూకుమ్మడి దాడి చేసి కులం పేరుతో తిట్టి దారుణంగా కొట్టినా కేసు నమోదు చేసేందుకు తాత్సారం చేశారన్నారు. వైద్య పరీక్షల పేరుతో రాత్రంతా రోడ్లపై తిప్పి, కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేశారని మండిపడ్డారు. నిందితులు మోదుగుల గణేష్‌, ఇతరులకు పోలీస్‌స్టేషన్‌లో మర్యాదలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఉమా డిమాండ్‌ చేశారు. నార్త్‌ ఏసీపీ డి.ఎన్‌.వి.ప్రసాద్‌, నున్న సీఐ దుర్గాప్రసాద్‌లు వైకాపా కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని, తమకు పోస్టింగ్‌లు ఇచ్చింది వెలంపల్లి అంటూ స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఏప్రిల్‌ 14న వీరిపై ఎన్నికల సంఘానికి సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో నవనీతం సాంబశివరావు, వీరమాచినేని కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని