logo

మూడు వంతెనలన్నారు.. రైతులను ముంచారు

కృత్తివెన్ను మండలంలోని పెదలంక డ్రైయిన్‌కు రూ.40కోట్లు, పడతడిక-చినగొల్లపాలెం మధ్యగల కొత్తకాలువకు రూ.136.6కోట్లు, ఏటిమొండిపల్లెపాలెం-మోళ్లపర్రు మధ్యగల ఉప్పుటేరుకు రూ.188.4కోట్ల నిధులతో మొత్తం మూడు రెగ్యులేటర్‌ కం బ్రిడ్జిలకు రూ.365 కోట్లు నిధులు సీఎం జగన్‌ మంజూరు చేసినట్లు మంత్రి జోగి రమేష్‌ ప్రజలను మోసం చేశారు.

Published : 07 May 2024 05:32 IST

హామీ ఇచ్చి చేతులెత్తేసిన మంత్రి జోగి రమేష్‌
కృత్తివెన్ను, న్యూస్‌టుడే

కృత్తివెన్ను మండలంలోని పెదలంక డ్రైయిన్‌పైనా, చినగొల్లపాలెం-పడతడిక మధ్యగల కొత్తకాలువ, రెండు జిల్లాల సరిహద్దు ఉప్పుటేరుపై రూ.365కోట్లతో మూడు రెగ్యులేటర్‌ కంబ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి.ఏడాదిలో నిర్మాణాలు పూర్తి చేస్తా 

 - మంత్రి జోగి రమేష్‌ ఇచ్చిన హామీ

నిరాశపడిన రైతులు

మంత్రి ఇచ్చిన హామీతో రైతులు ఎంతో సంతోషించారు. తమ కష్టాలు తీరతాయని ఆశపడ్డారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. నిధులు మంజూరయ్యాయని ప్రజలను నమ్మించిన ఆయన ఆ తరువాత ఆ విషయాన్నే మరిచిపోయారు. కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. తన పదవీకాలంలో ఒక్క వంతెన కూడా నిర్మించలేదు.. ఒక్క అభివృద్ధి పనీ చేపట్టలేదు.

కృత్తివెన్ను మండలంలోని పెదలంక డ్రైయిన్‌కు రూ.40కోట్లు, పడతడిక-చినగొల్లపాలెం మధ్యగల కొత్తకాలువకు రూ.136.6కోట్లు, ఏటిమొండిపల్లెపాలెం-మోళ్లపర్రు మధ్యగల ఉప్పుటేరుకు రూ.188.4కోట్ల నిధులతో మొత్తం మూడు రెగ్యులేటర్‌ కం బ్రిడ్జిలకు రూ.365 కోట్లు నిధులు సీఎం జగన్‌ మంజూరు చేసినట్లు మంత్రి జోగి రమేష్‌ ప్రజలను మోసం చేశారు. ఇది చెప్పిన రెండేళ్లవరకు ఆయన పత్తాలేరు. రైతులు ఈ విషయాన్ని నిలదీయడంతో మోళ్లర్రు,కొత్తకాలువలపై రెగ్యులేటర్ల నిర్మాణానికి నిధులు సరిపోవని, అందుకే అంచనాలు పెంచి  పంపామని అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామని మరోసారి నమ్మించారు. మండలానికి వచ్చిన ప్రతిసారీ అన్నదాతలు నిలదీయడంతో ఈ విషయం సీఎం దృష్టిలో ఉందని,త్వరలో పనులు చేపడతామని నమ్మించి చివరకు పెనమలూరుకు జారుకున్నారని ఆరోపించారు. రెండో పంటకు సాగునీరు ఎలాగు ఇవ్వలేదు. కనీసం వీటిని నిర్మించిటన్లయితే మళ్లీ సార్వా పంట నాటికి భూములన్నీ సముద్రపు ఉప్పునీరు పోటుకు గురికాకుండా ఉండేవని రైతులు అంటున్నారు.


భూములు చౌడుబారాయి

-బొమ్మిడి బాలకృష్ణ, గరిశపూడి, ఆక్వారైతు

పెదలంక డ్రెయిన్‌పై రెగ్యులేటర్‌ నిర్మించకపోవడంతో ఆక్వా రైతులందరమూ ఇబ్బందులు పడుతున్నాం. సుమారు 400మందికి చెందిన సుమారు వెయ్యి ఎకరాలు చౌడుబారాయి.రెండో పంటకు ప్రభుత్వం నీరు ఇవ్వడం లేదు. ఇలాంటి సమయంలో ఈ రెగ్యులేటర్‌ నిర్మిస్తే చాలామంది రైతులకు మేలు జరిగేది. పాలకులు ఈ విషయాన్ని విస్మరించారు.


ఉసూరుమనిపించారు

-తమ్ము మురళీకృష్ణ బొడ్డు నారాయణమూర్తి, రైతులు

పడతడిక-చినగొల్లపాలెం మధ్య ఉన్న కొత్తకాలువపై రెగ్యులేటర్‌ నిర్మిస్తామని చెప్పిన మంత్రి జోగి రమేష్‌ మమ్మల్ని ఉసూరుమనిపించారు. దాన్ని నిర్మించడం వల్ల మాకు 10నెలల పాటు మంచినీరు అందుబాటులో ఉంటుంది. ఆక్వాసాగుకు ఇబ్బంది ఉండదు. ఈ రెగ్యులేటర్‌ నిర్మాణం చేపట్టకపోవడం వల్ల గ్రామాల్లోని సుమారు 4వేల ఎకరాల్లో ఆక్వాసాగు చేపట్టిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని