logo

అందని బీమా ప్రోత్సాహకాలు

గ్రామీణులు తమ సంపాదనలో కొంతసొమ్ము పొదుపు చేసుకునేలా తపాలాశాఖ గ్రామీణ తపాలా జీవిత బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకంలో పొదుపు చేయించిన గ్రామీణ పోస్టాఫీసుల్లో సిబ్బందికి పాలసీ ఆధారంగా కొంత ప్రోత్సాహకాలు ఇస్తోంది.

Published : 04 Jun 2023 06:32 IST

గ్రామీణ తపాల ఉద్యోగుల ఆవేదన

అరవిందనగర్‌ (అనంతపురం), న్యూస్‌టుడే: గ్రామీణులు తమ సంపాదనలో కొంతసొమ్ము పొదుపు చేసుకునేలా తపాలాశాఖ గ్రామీణ తపాలా జీవిత బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకంలో పొదుపు చేయించిన గ్రామీణ పోస్టాఫీసుల్లో సిబ్బందికి పాలసీ ఆధారంగా కొంత ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఆయా డివిజన్లవారీ ఏటా బీమా పాలసీ లక్ష్యాన్ని నిర్దేశించి, ఆ మేరకు లక్ష్యం సాధించిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తోంది. అనంతపురం డివిజన్లోని 490 (గ్రామీణ) బ్రాంచి పోస్టాపీసుల్లో బ్రాంచి పోస్టుమాస్టరు, సహాయ బ్రాంచిపోస్టుమాస్టర్లు సుమారు 500 మంది గ్రామీణ తపాలా జీవిత బీమా పథకంలో  గ్రామీణులతో కొంత పొదుపు చేయిస్తున్నారు. ఈ విధంగా బీమా పథకంలో పొదుపు చేయించిన సిబ్బంది కొందరు తమకు రావాల్సిన ప్రోత్సాహకాల మంజూరులో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో తమకు ప్రోత్సాహకాలు అందేలా చూడాలని అధికారులను కోరుతున్నారు. నాలుగు నెలలుగా సుమారు రూ.4 లక్షల బకాయిలు అందాల్సి ఉందంటున్నారు.

ఆర్థిక ప్రయోజనం

గ్రామీణ తపాలా జీవిత బీమా పొదుపు పథకం 5, 8, 10, 15, 20 సంవత్సరాలు కాల పరిమితితో బీమా పథకాలను అమలు చేస్తోంది. ఉదాహరణకు లక్ష రూపాయలు పొదుపు పథకంలో చేర్పించిన ఉద్యోగికి ప్రోత్సాహక రూపంలో తొలి ఏడాది 10 శాతం కమీషన్‌ (ప్రోత్సాహకం), ఆ తరువాత పాలసీ కాలవ్యవధి గడువు ముగిసేవరకు 2.5 శాతం ప్రకారం ప్రోత్సాహకం (నగదు రూపంలో) ఉద్యోగికి మంజూరు చేస్తారు. ఈ రకంగా ప్రోత్సాహకాలు అందిస్తే నిర్దేశించిన లక్ష్యసాధన సాధ్యమవుతుందని, ఉద్యోగులకు కొంత ఆర్థిక సాయం అందుతుందని యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.

నిధుల లభ్యత ఆధారంగా మంజూరు

- పార్వతి, తపాలాశాఖ అనంతపురం డివిజన్‌ ఏఎస్పీ

యాజమాన్యం అందిస్తున్న నిధుల లభ్యత మేరకు ప్రతి నెలా ఆయా ఉద్యోగులకు ప్రోత్సాహకాలు మంజూరు చేస్తున్నాం బీమా పథకంలో చేరిన పాలసీదారుడు ప్రతినెలా చెల్లిస్తున్న ప్రీమియం, తదితర అంశాలను పరిశీలించి మంజూరు చేస్తున్నాము. ప్రోత్సాహకం అందనివారు మాదృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కరిస్తాము.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని