logo

నేతల తలరాత మార్చే..

పుట్టపర్తి నియోజకవర్గంలోని మెప్మా సంఘాల ఆర్పీలు, యానిమేటర్లతో వైకాపా నాయకుడు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి పథకాల గురించి కనీసం 20 ఓట్లు వేయించేలా చూడాలని నిర్దేశం చేశారు.

Updated : 27 Mar 2024 04:56 IST

ఆర్పీలు, యానిమేటర్లకు తాయిలాలు
శక్తికి గాలం

 

  • పుట్టపర్తి నియోజకవర్గంలోని మెప్మా సంఘాల ఆర్పీలు, యానిమేటర్లతో వైకాపా నాయకుడు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి పథకాల గురించి కనీసం 20 ఓట్లు వేయించేలా చూడాలని నిర్దేశం చేశారు. వైకాపా గెలుపు కోసం క్షేత్రస్థాయిలో ఆర్పీలు, యానిమేటర్లు పనిచేయాలన్నారు. సమావేశంలో పాల్గొన్న మహిళలందరికీ చీరలు అందజేశారు.
  • పెనుకొండ నియోజకవర్గంలో ఇటీవల యానిమేటర్లతో సమావేశం నిర్వహించి, ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకమని, అత్యధికంగా వైకాపాకు ఓటేసేలా చూడాలని సూచించారు. ఇంటింటికి వెళ్లి, ఓటు వేయించాలని, తిరిగి అధికారంలోకి వస్తే మంచి భవిష్యత్తు కల్పిస్తామని భరోసా కల్పిస్తున్నారు. ఇటీవల సమావేశం నిర్వహించి చీరలు, నగదు అందజేశారు.

పుట్టపర్తి, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లాలో మొత్తం 13,91,378 మంది ఓటర్లుండగా ఇందులో పురుషులు 6,91,890 మంది, మహిళలు 6,99,426 ఉన్నారు. జిల్లాలో 7,536 మంది మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నియోజకవర్గాల్లో మహిళదే పైచేయి. దీంతో వారి ఓట్లను తమవైపు తిప్పుకొనేందుకు వైకాపా విశ్వప్రయత్నం చేస్తోంది. మహిళల ఓట్ల కోసం నేతలు అప్పుడే ప్రదక్షిణలు చేస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలోని ఆరు శాసనసభ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు విజయం సాధించాలంటే మహిళ ఓటర్లే కీలకం కానున్నారు. మహిళ ఓటర్ల మద్దతు ఎవరికి దక్కితే వారే విజేత అవుతారు. అందులో ఎలాంటి సందేశం లేదు. సార్వత్రిక సమరంలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు అతివలు ఆశా కిరణాలు కానున్నారు. వనితకు వందనం చేస్తూ తమకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. మెప్మా, స్వయం సహాయక సంఘాలను పర్యవేక్షించేవారితో ఇటీవల సమావేశాలు నిర్వహించి, మీ పరిధిలోని ఇళ్లకు వెళ్లి కనీసం ఒక్కొక్కరు 20 ఓట్లు వేయించాలని నిర్దేశం చేశారు. రాత్రి సమయంలో వెళ్లి గోప్యంగా ప్రచారం చేస్తున్నారు. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా రాజకీయ పార్టీల నాయకులు ఎవరికివారు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యం మహిళలే తేల్చనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని